మొండి బకాయిల కట్టడే లక్ష్యం
న్యూఢిల్లీ: బడా రుణగ్రహీతల రుణ ఎగవేతలపై ఆర్థిక మంత్రి పి. చిదంబరం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకుల్లో మొండిబకాయిల(ఎన్‌పీఏ)ల కట్టడికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టికేంద్రీకరిస్తోందన్నారు. మంగళవారం ఇక్కడ పీఎస్‌యూ బ్యాంక్‌ల చీఫ్‌లతో పనితీరు సమీక్ష సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ప్రతి బ్యాంకులో టాప్-30 ఎన్‌పీఏ ఖాతాలను ప్రభుత్వం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తొలగించిన ఖాతాల నుంచి బకాయి సొమ్మును సాధ్యమైనంత మేర రికవరీ చేసుకోవడానికి ఎస్‌బీఐ మాదిరిగా ఇతర పీఎస్‌యూ బ్యాంకులన్నీ కూడా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించారు. భారత్ ఆర్థిక వ్యవస్థ మందగమనం ఆందోళనకరస్థాయిలో ఏమీలేదన్నారు. ‘2000 సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం ఈ ఎన్‌పీఏల పరిస్థితి మరీ అంత ఘోరంగా ఏమీ లేదు. అప్పట్లో స్థూల ఎన్‌పీఏలు 14 శాతం గరిష్టాన్ని కూడా తాకింది. కాగా, గత కొద్ది సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ మందగమనంతోపాటే మళ్లీ మొండిబకాయిలు కూడా పేరుకుపోతూ వస్తున్నాయి’ అని వివరించారు.
రుణ వృద్ధిపై సంతృప్తి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి, రెండో(క్యూ1,క్యూ2) త్రైమాసికాల్లో పీఎస్‌యూ బ్యాంకుల రుణ వృద్ధి పట్ల చిదంబరం సంతృప్తిని వ్యక్తం చేశారు. ద్వితీయార్ధంలో కూడా ఇదేవిధమైన పనితీరును ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా క్యూ1, క్యూ2లలో గృహ రుణాల్లో 42 శాతం, 61 శాతం చొప్పున వృద్ధి నమోదైందని, విద్యా రుణాల్లో కూడా సానుకూల వృద్ధే కనబడినట్లు ఆయన పేర్కొన్నారు. మైనారిటీలకు రుణ లక్ష్యాలను అందుకోవడంపై దృష్టిపెట్టాలని బ్యాంకులకు సూచించారు. కాగా, పీఎస్‌యూ బ్యాంకులకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.14,000 కోట్ల మూలధనం అందించే ప్రతిపాదనను ఆర్థిక శాఖ ఖరారు చేసింది. ఈ నిధులను ఏవిధంగా ఇవ్వాలనేదానిపై ఆర్‌బీఐ, సెబీలతో సంప్రతింపుల అనంతరం త్వరలోనే నిర్ణయిస్తామని చిదంబరం వెల్లడించారు.
బంగారు నాణేలపై నిషేధం ఎత్తివేయం...
కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)కు అడ్డుకట్టవేయడం కోసం బంగారు నాణేలు, పెద్దపెద్ద పసిడి పతకాల దిగుమతిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే అవకాశాల్లేవని చిదంబరం స్పష్టం చేశారు. బంగారం దిగుమతులపై ఆర్‌బీఐ, ప్రభుత్వం విధించిన నియంత్రణలు, నిబంధనలను బ్యాంకులు కచ్చితంగా పాటించాల్సిందేనని కూడా ఆయన తేల్చిచెప్పారు. శుభకార్యాలకు బహుమతులకోసం పసిడి నాణేల దిగుమతికి అనుమతించాలన్న సూచనలపై స్పందిస్తూ చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ట్రేడర్లు దేశీ మార్కెట్ నుంచి బంగారాన్ని కొనుగోలు చేసి నాణేలను తయారుచేసుకోవచ్చని, అంతేకానీ ప్రభుత్వం మాత్రం దిగుమతులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోదని పేర్కొన్నారు. గతేడాది క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(జీడిపీతో పోలిస్తే 4.8 శాతం; 88.2 బిలియన్ డాలర్లు) ఎగబాకిన సంగతి తెలిసిందే. దీనికి ప్రధానంగా భారీస్థాయిలో బంగారం దిగుమతులే(845 టన్నులు) ఆజ్యం పోశాయి. ఈ ఏడాది క్యాడ్‌ను 3.7 శాతానికి కట్టడి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం అటు ఆర్‌బీఐ, ఇటు కేంద్రం బంగారం దిగుమతులపై భారీ నియంత్రణలు విధించాయి. దీంతో పుత్తడి దిగుమతులు భారీగా దిగొస్తున్నాయి కూడా. ఈ ఏడాది మే నెలలో 162.4 టన్నుల గరిష్టస్థాయి దిగుమతులు జరగగా... సెప్టెంబర్‌లో ఇవి 7.2 టన్నులకు పడిపోవడగం గమనార్హం.