ఎస్‌బీఐకి 2 వేల కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకులకు ఈ ఏడాది(2013-14)లో రూ.14,000 కోట్ల మూలధన పెట్టుబడులను సమకూర్చాలన్న బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా బుధవారం ఆర్థికశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)కు రూ.2,000 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. అలాగే ఐడీబీఐ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు సైతం రూ.1,800 కోట్ల చొప్పున పెట్టుబడులను సమకూర్చాలని నిర్ణయించింది. చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇండియన్ బ్యాంక్ మినహా మొత్తం 20 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.100 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల శ్రేణిలో పెట్టుబడులను కేంద్రం నుంచి పొందనున్నాయి.
తనకు తాజా క్యాపిటల్ అక్కర్లేదని ఇండియన్ బ్యాంక్ ఆర్థికశాఖకు తెలియజేసింది. ఈ వివరాలను ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ టక్రూ బుధవారమిక్కడ తెలిపారు. ప్రభుత్వం నుంచి అందుతున్న మూలధన పెట్టుబడుల మద్దతుతోపాటు ప్రభుత్వ ప్రస్తుత వాటాలను విక్రయించాల్సిన అవసరం లేకుండా రైట్స్ ఇష్యూ, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్(క్విప్), ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా మార్కెట్ నుంచి రూ.10,000 కోట్లు సమీకరించుకోడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. పీఎస్‌యూ బ్యాంక్‌ల చీఫ్‌లతో మంగళవారం ఆర్థికమంత్రి చిదంబరం భేటీ అయిన మర్నాడే ఆర్థికశాఖ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
క్యూ4లో మరో విడత!
బ్యాంక్ అవసరాలు, రుణాలకు సంబంధించి వాటి పనితీరు ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో(జనవరి-మార్చి, క్యూ4) రెండో దఫా మూలధన పెట్టుబడుల కేటాయింపులు ఉంటాయని రాజీవ్ టక్రూ పేర్కొన్నారు.
ఎస్‌బీఐ క్యూఐపీ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, దామాషా ప్రాతిపదికన బ్యాంక్ నిధులు సమకూర్చుకోవచ్చని పేర్కొన్నారు. ఎస్‌బీఐలో ప్రభుత్వానికి ప్రస్తుతం 62% వాటా ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 30న జరగనున్న ఎస్‌బీఐ బోర్డ్ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. 2012-13లో 13 పీఎస్‌యూ బ్యాంకులకు రూ.12,517 కోట్ల నిధులను కేంద్రం సమకూర్చింది.