Capital Infusion
-
బీమా సంస్థల విలీనం వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బీమా సంస్థల విలీన ప్రక్రియ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. విలీన ప్రక్రియను నిలిపి వేసిన ప్రభుత్వం లాభదాయక వృద్ధి, నిధుల కేటాయింపు ద్వారా వాటిని ఆర్థికంగా బలోపేతం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలను విలీనం చేయాలన్న దివంగత మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రణాళికను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే తాజా నిర్ణయం ప్రకారం మూడు బీమా సంస్థలకోసం 12,450 కోట్ల రూపాయల నిధులను కేటాయించనుంది. ఇందులో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి 7,500 కోట్ల రూపాయలు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెరో 5 వేల కోట్ల రూపాయలను నిధులు కేటాయించినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. బలహీనమైన ఆర్థిక స్థితికితోడు సంస్థలు వినియోగిస్తున్న వివిధ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లు, తదితర కారణాల రీత్యా ప్రస్తుత ప్రరిస్థితుల్లో విలీనం ఒక సవాలుగా మారిందని అధికారులు పేర్కొన్నారు. -
యస్ బ్యాంకు : మరో రూ. 600 కోట్లు
సాక్షి, ముంబై: మూలధన సంక్షోభం పడిన యస్‌బ్యాంకునకు పెట్టుబడుల వరద పారుతోంది. ముఖ్యంగా ఆర్బీఐ ప్రతిపాదించిన పునరుద్ధరణ ప్రణాళికను కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదించింది. అంతేకాదు బ్యాంకునకు అందించే అధీకృత మూలధనాన్ని రూ. 6200 కోట్లకు పెంచినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ప్రభుత్వ బ్యాంకుఎస్‌బీఐ 49 శాతం ఈక్విటీ కొనుగోలు ద్వారా రూ.7250 కోట్ల నిధులను యస్ బ్యాంకునకు అందించనుంది. దీంతో యస్ బ్యాంకులో పెట్టుబడులకు దిగ్గజ ప్రైవేటు బ్యాంకులు వరుసగా క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంకులు పెట్టుబడులను ప్రకటించగా శనివారం బంధన్ బ్యాంక్ రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ మేరకు బోర్డు ఆమోదం లభించినట్టు తెలిపింది. రూ.2 ముఖ విలువున్న షేరును (రూ.8 ప్రీమియంతో) రూ.10 చొప్పున మొత్తం 30 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.300 కోట్లతో కొనుగోలు చేయనున్నామని పేర్కొంది. నగదు రూపేణా ఈ లావాదేవీ జరుగుతుంది. తాజాగా ఫెడరల్ బ్యాంకు కూడా యస్ బ్యాంకులో రూ .300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. 30 కోట్ల ఈక్విటీ షేర్లను ఈక్విటీ షేరుకు 10 రూపాయల చొప్పున కొనుగోలు ద్వారా రూ. 300 కోట్ల పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. (యస్ సంక్షోభం : పెట్టుబడుల వెల్లువ) ఇప్పటివరకూ యస్ బ్యాంకులో ప్రైవేటుబ్యాంకుల పెట్టుబడులు ఐసీఐసీఐ బ్యాంక్ రూ .1000 కోట్లు హెచ్డీఎఫ్సీ రూ. 1,000 కోట్లు యాక్సిస్ రూ.600 కోట్లు కోటక్ మహీంద్రా రూ.500 కోట్లు బంధన్ బ్యాంకు రూ.రూ. 300 కోట్లు ఫెడరల్ బ్యాంకు రూ. 300 కోట్లు కాగా సమస్యాత్మక ప్రైవేట్ బ్యాంకు యస్ బ్యాంకు పునర్నిర్మాణ పథకానికి ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో బ్యాంకు, ఖాతాదారులు నగదు ఉపసంహరణపై తాత్కాలిక నిషేధాన్ని మార్చి 18 న ఎత్తివేయనున్న సంగతి తెలిసిందే. -
యూనియన్ బ్యాంక్ ఓపెన్ ఆఫర్‌కు మినహాయింపు
న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ విషయంలో ఓపెన్ ఆఫర్ ఇవ్వకుండా ప్రభుత్వానికి మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ మినహాయింపునిచ్చింది. యూనియన్ బ్యాంక్‌లో ప్రభుత్వం రూ.4,112 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఈ పెట్టుబడులకు ప్రతిగా యూనియన్ బ్యాంక్ ప్రిఫరెన్షియల్ షేర్లను ప్రభుత్వానికి జారీ చేస్తుంది. దీంతో యూనియన్ బ్యాంక్‌లో ప్రస్తుతం 67.43 శాతంగా ఉన్న ప్రభుత్వం వాటా 6.55 శాతం పెరిగి 73.98 శాతానికి చేరుతుంది. ఫలితంగా టేకోవర్ నిబంధనలు వర్తించి ప్రభుత్వం ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి వస్తుంది. అయితే ప్రభుత్వ పెట్టుబడుల కారణంగా ప్రజల వద్ద ఉండే ఈక్విటీ షేర్ల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండనందున ప్రభుత్వం ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సిన అవసరం లేదని సెబీ స్పష్టతనిచ్చింది. ఓపెన్ ఆఫర్ విషయంలో మినహాయింపును ఇచ్చింది. -
ప్రభుత్వ బ్యాంకులకు రీ క్యాపిటలైజేషన్ బూస్ట్
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకులకు తాజాగా పెట్టుబడులను సమకూర్చనుంది. దీంతో గురువారం నాటి మార్కెట్లో పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు లాభాల దౌడు తీస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ కౌంటర్లు భారీగా లాభపడుతున్నాయి. దీంతో ఊగిసలాట మార్కెట్‌కు ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల లాభాలు భారీ మద్దతునిస్తున్నాయి. మొత్తం 12 పీఎస్‌యూ బ్యాంకులకు ప్రభుత్వం రూ. 48,239 కోట్ల పెట్టుబడులను సమకూర్చేందుకు తాజాగా నిర్ణయించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. బ్యాంకులు - పెట్టుబడుల వివరాలు ప్రభుత్వం పెట్టుబడులు సమకూరుస్తున్న బ్యాంకులలో అలహాబాద్ బ్యాంక్‌కు రూ. 6896 కోట్లు కార్పొరేషన్ బ్యాంకుకు రూ. 9086 కోట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 4638 కోట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు రూ. 205 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ. 5098 కోట్లు యూనియన్ బ్యాంక్‌కు రూ. 4112 కోట్లు ఆంధ్రా బ్యాంక్‌కు రూ. 3256 కోట్లు సిండికేట్ బ్యాంకుకు రూ. 1603 కోట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 2560 కోట్లు యునైటెడ్ బ్యాంక్‌కు రూ. 2839 కోట్లు యుకో బ్యాంక్‌కు రూ. 3330 కోట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు రూ. 3806 కోట్లు సమకూర్చనుంది. అలహాబాద్ బ్యాంక్ షేరు 6 శాతం జంప్ చేయగా కార్పొరేషన్ బ్యాంక్ 16 శాతం లాభపడుతోంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 5 శాతం, ఆంధ్రా బ్యాంక్ 5.5 శాతం, పీఎన్బీ 3.2 శాతం, యూనియన్ బ్యాంక్ 3శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.3 శాతం పుంజకున్నాయి. ఇంకా సెంట్రల్ బ్యాంక్ 5.6 , యునైటెడ్ బ్యాంక్ 7 శాతం, యుకో బ్యాంక్ 7శాతం , ఐవోబీ 7.3 శాతం, సిండికేట్ బ్యాంక్ దాదాపు 3 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. -
ఇ-కామర్స్ ట్రేడ్‌వార్: భారీ నిధులు
సాక్షి, న్యూఢిల్లీ: ఒక్కపక్క ఈ కామర్స్ వ్యాపారంలో మెగా డీల్‌కు రంగం సిద్ధమైంది. మరోపక్క ఈ ట్రేడ్‌వార్ లో పోటీని తట్టుకునే నిలబడే వ్యూహంలో భాగంగా అమెజాన్ ఇండియాలో భారీగా నిధుల వెల్లువ. దేశంలో అతిపెద్ద ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ డీల్ ఈ సాయంత్రం అధికారికంగా వెల్లడికానున్న నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ ప్రధాన ప్రత్యర్థి అమెజాన్ కూడా ఇందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. మాతృసంస్థ అమెజాన్ అమెజాన్ ఇండియాలో మరోసారి భారీగా నిధులు సమకూర్చుతోంది. తాజాగా 2,600 కోట్ల రూపాయల (385.7మిలియన్ డాలర్లు) నిధులు అందజేసింది. దీనిపై అమెజాన్ ఇండియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇ-కామర్స్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడానికి, కస్టమర్లకు విశ్వసనీయమైన సేవలను అందించేందుకు భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు సమకూర్చనున్నట్టు వెల్లడించారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సమర్పించిన సమాచారం ప్రకారం, అమెజాన్ సంస్థ భారతీయ మార్కెట్లో రూ .2,600 కోట్ల పెట్టుబడును సమకూర్చి పెట్టింది. ఈ మేరకు 2018 ఏప్రిల్ 26 న అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ డైరెక్టర్ల బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది. ఫ్లిప్‌కార్ట్‌ను వాల్ మార్ట్ కొనుగోలు చేస్తున్న తరుణంలో పోటీని ఎదుర్కొనేందుకు అమెజాన్ ఇండియాకు తాజా నిధులు ఉపయోగపడనున్నాయి. తాజా నిధులతో పెట్టుబడుల మొత్తం విలువ రూ.20,000 కోట్లకుపైమాటే. కాగా గతేడాది నవంబర్ లో రూ.2,990 కోట్లు , ఈ ఏడాది జనవరిలో అమెజాన్ మాతృ సంస్థ ద్వారా రూ .1,950 కోట్ల నిధులను అందుకుంది. తాజా పెట్టుబడులు తమ సాధారణ ప్రక్రియలో భాగమేనని, ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ మెగాడీల్‌కు ఎలాంటి సంబంధం లేదని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. -
దిగ్గజాలకు షాక్: ఫోన్ పేలో భారీ పెట్టుబడులు
సాక్షి,ముంబై: డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పేకు మాతృసంస్థ నుంచి భారీ నిధులు సమకూరాయి. ఆన్లైన్ రిటైల్ మేజర్ ఫ్లిప్‌కార్ట్ ఫోన్ పేకు రూ. 518 కోట్ల నిధులను అందించింది. డిజిటల్ పేమెంట్స్‌కు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ ఈ చర్య తీసుకుంది. తద్వారా దేశంలో టాప్ కంపెనీగా ఎదగాలని పథకాలు రచిస్తోంది. ముఖ్యంగా ప్రత్యర్థులు గూగుల్ తేజ్ పేటీఎం, అమెజాన్ పే లాంటి దిగ్గజ సంస్థలకు షాకిచ్చేలా ఈ నిర్ణయం తీసుకుంది. సింగపూర్‌కు చెందిన పేరెంట్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ చెల్లింపుల ప్లాట్‌ఫాం ఫోన్ పే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (సిఆర్సీ) తో దాఖలు చేసిన తాజా రెగ్యులేటరీ డాక్యుమెంట్ల ప్రకారం 518 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈ తాజా క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ మార్చి 19 న జరిగింది. రాబోయే సంవత్సరాల్లో తన చెల్లింపుల వ్యాపారం కోసం ఈ పెట్టుబడులను వెచ్చించినట్టు ఫోన్ పే తెలిపింది. -
ఎస్బీఐకి 2 వేల కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకులకు ఈ ఏడాది(2013-14)లో రూ.14,000 కోట్ల మూలధన పెట్టుబడులను సమకూర్చాలన్న బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా బుధవారం ఆర్థికశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కు రూ.2,000 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. అలాగే ఐడీబీఐ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు సైతం రూ.1,800 కోట్ల చొప్పున పెట్టుబడులను సమకూర్చాలని నిర్ణయించింది. చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇండియన్ బ్యాంక్ మినహా మొత్తం 20 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.100 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల శ్రేణిలో పెట్టుబడులను కేంద్రం నుంచి పొందనున్నాయి. తనకు తాజా క్యాపిటల్ అక్కర్లేదని ఇండియన్ బ్యాంక్ ఆర్థికశాఖకు తెలియజేసింది. ఈ వివరాలను ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ టక్రూ బుధవారమిక్కడ తెలిపారు. ప్రభుత్వం నుంచి అందుతున్న మూలధన పెట్టుబడుల మద్దతుతోపాటు ప్రభుత్వ ప్రస్తుత వాటాలను విక్రయించాల్సిన అవసరం లేకుండా రైట్స్ ఇష్యూ, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్విప్), ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా మార్కెట్ నుంచి రూ.10,000 కోట్లు సమీకరించుకోడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. పీఎస్‌యూ బ్యాంక్‌ల చీఫ్‌లతో మంగళవారం ఆర్థికమంత్రి చిదంబరం భేటీ అయిన మర్నాడే ఆర్థికశాఖ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. క్యూ4లో మరో విడత! బ్యాంక్ అవసరాలు, రుణాలకు సంబంధించి వాటి పనితీరు ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో(జనవరి-మార్చి, క్యూ4) రెండో దఫా మూలధన పెట్టుబడుల కేటాయింపులు ఉంటాయని రాజీవ్ టక్రూ పేర్కొన్నారు. ఎస్బీఐ క్యూఐపీ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, దామాషా ప్రాతిపదికన బ్యాంక్ నిధులు సమకూర్చుకోవచ్చని పేర్కొన్నారు. ఎస్బీఐలో ప్రభుత్వానికి ప్రస్తుతం 62% వాటా ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 30న జరగనున్న ఎస్బీఐ బోర్డ్ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. 2012-13లో 13 పీఎస్‌యూ బ్యాంకులకు రూ.12,517 కోట్ల నిధులను కేంద్రం సమకూర్చింది.