27మంది బ్యాంకు అధికారులు సస్పెండ్
Published Fri, Dec 2 2016 7:47 PM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM
పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ ఆదేశాలు పాటించకుండా అక్రమ లావాదేవీలు చేపడుతున్న 27 మంది బ్యాంకు అధికారులపై కేంద్రం చర్యలు తీసుకుంది. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 27 మంది బ్యాంకు అధికారులపై సస్పెన్షన్ వేటుతో పాటు, మరో ఆరుగురు అధికారులను ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేస్తున్నట్టు ఆర్థికమంత్రిత్వశాఖ ప్రకటించింది. నల్లకుబేరులపై సర్జికల్ స్ట్రైక్ చేస్తూ నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్యాంకుల్లో పాత నోట్లను మార్చుకోవడానికి, డిపాజిట్ చేయడానికి నిర్ణీత గడువును ప్రభుత్వం విధించింది. అయితే ఈ ప్రక్రియలో బ్యాంకు అధికారులు కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. కానీ ఈ బ్యాంకు అధికారులు మాత్రం ఏ మాత్రం ఆర్బీఐ ఆదేశాలు పాటించకుండా నల్లకుబేరులకు సాయపడుతూ అక్రమ లావాదేవీలకు తెరతీసినట్టు తెలుస్తోంది.
ఇంతకమున్నుపై బ్యాంకు అధికారులు అక్రమ లావాదేవీలు చేపడుతున్నారని తెలిసి పలుమార్లు ఆర్బీఐ హెచ్చరించింది. తమ సూచనలు మేరకు నడుచుకోవాలని పేర్కొంది. బెంగళూరులో 5.7 కోట్ల కొత్త కరెన్సీ నోట్లను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో బ్యాంకు అధికారులపై ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. కొన్ని కేసుల్లో అధికారులు ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ లావాదేవీలకు తెరతీశారని తెలిసి వారిని సస్పెండ్ చేశామని ఆర్థికమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. అక్రమ పద్ధతులను అసలు సహించేది లేదని, ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకునేవారిపై చర్యలు తీసుకుంటామని కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే 27 మంది బ్యాంకు అధికారులను సస్పెండ్ చేసి, ఆరుగురిని ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేసినట్టు తెలిపింది.
Advertisement
Advertisement