సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్‌బీ మెగా స్కాంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీపై చర్యల్లో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మోదీ, ఆయన వ్యాపార భాగస్వామి, గీతాంజలి ప్రమోటర్ మాహుల్ చోక్సి పాస్‌పోర్ట్‌లను కేంద్రం నిలిపివేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన పాస్‌పోర్ట్ జారీ కార్యాలయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విజ్ఞప్తి మేరకు వారి పాస్‌పోర్ట్‌లను నాలుగు వారాలపాటు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇంటర్‌పోల్ కూడా నోటీసులు జారీ చేసింది. అలాగే వారి పాస్‌పోర్ట్‌లను ఎందుకు రద్దు చేయకూడదో వారంలోపు స్పందించాల్సిందిగా కోరింది. నిర్దేశించిన గడువు లోపు నిందితులు స్పందించకపోతే, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాస్‌పోర్ట్‌లను పూర్తిగా స్వాధీనం చేసుకోనుంది.
అయితే నీరవ్‌మోదీ మరికొన్ని దేశాల్లో పౌరసత్వం లేదా శాశ్వత నివాస హోదాను కలిగి ఉండవచ్చని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం నిర్వహిస్తున్న మోదీ అమెరికాలోఎక్కువ సమయం గడుపుతాడనీ, అతనికి బెల్జియం పాస్‌పోర్ట్ కూడా ఉందని తెలుస్తోంది. అంతేకాదు తరచుగా ఇండియాకు వచ్చే మోదీ గత రెండేళ్లుగా ఇండియాకు రావడం బాగా తగ్గించేడశాడంటూ కీలక సమాచారాన్ని ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. సన్నిహితులకు మాత్రం ఫోన్ల ద్వారా నిరంతరం అందుబాటులో ఉండేవాడని నివేదించింది.
మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రూ.11,400కోట్ల అతిభారీ కుంభకోణంలో ఈడీ అధికారుల దాడులు కొనసాగనున్నాయి. నీరవ్ మోదీకి చెందిన మరో 50 సంస్థలపై దాడులు నిర్వహిస్తామని అధికారులు తాజాగా ప్రకటించారు. కాగా మనీలాండరింగ్ ఆరోపణలతో ఇప్పటికే నీరవ్‌మోదీ, మెహుల్ చోక్సికి ఈడీ సమన్లు జారీ చేసింది. వీటిపై వారంలోగా స్పందించాలని ఆదేశించింది. పాస్‌పోర్ట్ చట్టం 1967 సెక్షన్ 10 (3) (సి) కింద వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేస్తామని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment