ఎగవేతదారులకు పీఎస్‌యూ బ్యాంకుల షాక్
న్యూఢిల్లీః కొండల్లా పేరుకుపోయిన రుణ బకాయిల వసూళ్లకు పీఎస్‌యూ బ్యాంకుల్లో కదలిక వచ్చింది. రూ 70,000 కోట్ల రుణాలు చెల్లించాల్సిన 5954 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై ప్రభుత్వ రంగ బ్యాంకులు లోన్ రికవరీ యాక్షన్ చేపట్టాయి.ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలోని 21 బ్యాంకులు 5954 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై సర్ఫేసి చట్టం కింద చర్యలు తీసుకున్నాయి.రూ 20943 కోట్ల రుణాల వసూలు కోసం 1,444 మంది డిఫాల్టర్లపై దేశంలో అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ చర్యలు చేపట్టగా, మిగిలిన 20 బ్యాంకులు రూ 48,496 కోట్ల రుణ బకాయిల వసూలు నిమిత్తం 4510 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై చర్యలు తీసుకున్నాయి.
పీఎస్‌యూ బ్యాంకులకు మొత్తం రూ 92,376 కోట్లు ఉద్దేశపూర్వక ఎగవేతదారుల బకాయిలున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.గతేడాదితో పోలిస్తే వీరి సంఖ్య పది శాతం పెరగడం ఆందోళనకరమని తెలిపాయి. 2016-17లో ఎస్‌బీఐ సహా ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ 81,683 కోట్ల రుణాలను రద్దు చేశాయి.