నగదు ( ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలు ఎగవేసి విదేశాలకు చెక్కేస్తున్న బడాబాబుల బండారం సామాన్య ప్రజానీకం గుండెల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంటే.. ప్రభుత్వ బ్యాంకులు రద్దు చేసిన మొండి బకాయిల వివరాలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. ఒకటి.. రెండూ లేదంటే వంద కోట్లు కాదు.. ఏకంగా లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేశాయి. స్వయంగా ఆర్థికశాఖ పార్లమెంట్ సాక్షిగా వెల్లడించిన చేదు వాస్తవాలివి. గత మూడేళ్ల కాలంలో 2.41లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేసినట్టు ఆర్థిక శాఖ సహాయమంత్రి శివప్రతాప్ శుక్లా మంగళవారం రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
2014, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్, 2017 మధ్య ఈ రుణాలను రద్దు చేశాయని మంత్రి తెలిపారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ (నిరర్ధక ఆస్తులు) లేదా వసూలు కాని రుణాలను ప్రతి ఏటా బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్‌ను తొలగించడం సాధారణ ప్రక్రియే అని శుక్లా రాజ్యసభలో చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఈ మూడేళ్లలో 2,41,911కోట్ల రూపాయల రుణాలను రద్దు చేశాయని వెల్లడించారు. అయితే లోన్లను బ్యాలెన్స్ షీట్ నుంచి తొలగించినంత మాత్రాన రుణాలు తీసుకున్నవారిని వదిలేది లేదని.. ఈ నిర్ణయం రుణ గ్రహీతలకు లాభించదంటూ మంత్రి చెప్పుకొచ్చారు. అంతేకాదు నిబంధనల ప్రకారం రుణాలు తీసుకున్నవారి వివరాలను ప్రకటించలేమని చేతులు దులుపుకున్నారు. ఇప్పటికే రుణాలు వసూలు చేయడానికి బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాయని శుక్లా తెలిపారు.
మండిపడిన మమతా బెనర్జీ
మూడేళ్లలో ఇంత పెద్ద మొత్తంలో రుణాలు రద్దు చేయడంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ లెక్కలు తనను షాక్‌కు గురిచేశాయంటూ దుయ్యబట్టారు. ఓవైపు రుణాలు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు రుణాలను రద్దు చేయాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పట్టించుకోక పోగా బడాబాబులు తీసుకున్న రుణాలను రద్దు చేస్తారా అంటూ విమర్శించారు. పైగా ఈ రుణాలు ఎవరు తీసుకున్నారన్న విషయాన్ని కూడా మంత్రి చెప్పకపోవడంపై మండిపడిన మమతా అసలు ఇదే అతి పెద్ద కుంభకోణం కాదా అని ప్రశ్నించారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారి వివరాలు ఇవ్వడం కుదరదని పార్లమెంట్‌లోనే ప్రభుత్వం చెప్పడం దారుణమని...కచ్చితంగా ఆ వివరాలు వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా గత ఐదేళ్లలో బ్యాంకుల నిరర్ధక ఆస్తులు రెట్టింపు కావడం గమనార్హం. దీనిపై ఆర్‌బీఐ స్వయంగా పలుమార్లు ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే.
I have just seen the reply to the Parliament Question of today as given below. My FB post: https://t.co/u5rKQhMWGG pic.twitter.com/L72tfImeeG
— Mamata Banerjee (@MamataOfficial) April 3, 2018
Comments
Please login to add a commentAdd a comment