సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పేరుకుపోతున్న నిరర్థక ఆస్తులు, రుణ బకాయిలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్‌పీఏలను సమర్థంగా ఎదుర్కోవడంపై బ్యాంకులు దృష్టిసారించాయి. ఒత్తిడికి లోనయ్యే రుణాలు, ఆస్తుల విషయంలో సత్వర నిర్ణాయక వ్యవస్థ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
బ్యాంకుల్లో సత్వర నిర్ణయాల కోసం రిటైర్డ్ జడ్జీలు, విజిలెన్స్ అధికారులు, ఇతర నిపుణులతో కూడిన పర్యవేక్షక కమిటీల నియామకాన్ని పలు బ్యాంకులు పరిశీలిస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
సుదీర్ఘ అనుభవం కలిగిన ఎస్‌బీఐ ప్రతిపాదనను పలు బ్యాంకులు పరిశీలిస్తున్నాయని, బ్యాంకుల వద్ద పేరుకుపోయిన నిరర్థక ఆస్తులు, ఖాతాలను సమర్ధవంతంగా, పారదర్శకంగా పరిష్కరించడంలో పర్యవేక్షక కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని గోయల్ చెప్పారు. ఎస్‌బీఐ దశాబ్ధాల అనుభవంతో పరపతి నిర్ణయాలను అత్యంత పారదర్శకంగా, సత్వరం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఒత్తిడికి గురయ్యే ఆస్తుల నిర్వహణలోనూ పకడ్బందీగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment