![Finance Ministry asks PSU banks to enhance recovery rate from written off accounts - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/3/npa.jpg.webp?itok=i6z8a3KP)
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు మాఫీ చేసిన (ఖాతాల్లో రద్దు) మొండి రుణాల (ఎన్‌పీఏలు)ల వసూళ్ల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ కీలక సూచన చేసింది. వీటి వసూళ్ల రేటు తక్కువగా ఉండడంతో కనీసం 40 శాతానికి అయినా పెంచుకోవాలని కోరింది. 2022 మార్చి నాటికి ఐదేళ్ల కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.7.34 లక్షల కోట్లను ఖాతాల్లో మాఫీ చేశాయి. ఇందులో 14 శాతాన్నే అవి వసూలు చేసుకోగలిగాయి. మాఫీ చేసినప్పటికీ వాటిని వసూలు చేసుకునే కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. 2022 మార్చి నాటికి మాఫీ చేసిన రూ.7.34 లక్షల కోట్లలో రూ.1.03 లక్షల కోట్లనే వసూలు చేశాయి.
ఇదీ చదవండి: భారత్ ‘గ్రీన్’ పరిశ్రమకు రాయితీ రుణాలు
దీంతో 2022 మార్చి నాటికి నికరంగా మాఫీ చేసిన ఎన్‌పీఏల మొత్తం రూ.6.31 లక్షల కోట్లుగా ఉంది. ఈ విధమైన వసూళ్లు ఆమోదయోగ్యం కాదని ఆర్థిక శాఖ స్పష్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇలా వసూలయ్యే మొత్తం బ్యాంకుల నికర లాభాలను పెంచుతుందని పేర్కొన్నాయి. ఈ పరిస్థితిపై సమీక్ష చేయడానికి వీలుగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ త్వరలోనే పీఎస్‌బీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పాయి. 2022 మార్చి నాటికి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మాఫీ చేసిన రుణాల మొత్తం రూ.11.17 లక్షల కోట్లుగా ఉంది.
ఇదీ చదవండి: బ్యాంకింగ్‌లోకి బడా కార్పొరేట్లను అనుమతించొద్దు
Comments
Please login to add a commentAdd a comment