న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పది బ్యాంకుల భారీ విలీనం బుధవారం నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఆంధ్రా బ్యాంకు సహా ఆరు బ్యాంకులు కనుమరుగు కానున్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ 19 మహమ్మారిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ అమలవుతున్నప్పటికీ విలీన ప్రక్రియను ప్రణాళిక ప్రకారంగానే అమలు చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత తరుణంలో విలీన ప్రక్రియ అంత సజావుగా జరగకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, యాంకర్ బ్యాంకుల చీఫ్‌లు మాత్రం ఎలాంటి సమస్యలూ ఉండబోవని ధీమా వ్యక్తం చేశారు. ‘అంతా ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది. సమస్యలేమీ తలెత్తే అవకాశం లేదు. ప్రస్తుత పరిస్థితులను కూడా సమీక్షించే నిర్ణయం తీసుకున్నాం.
ఉద్యోగులు, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం‘ అని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్ రాయ్ జి తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చే దాకా రుణ మంజూరు తదితర ప్రక్రియల్లో ఎలాంటి మార్పులు లేకుండా యథాప్రకారమే కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని విభాగాల అనుసంధానికి తమ బ్యాంకు కూడా సర్వ సన్నద్ధంగా ఉందని ఇండియన్ బ్యంక్ ఎండీ పద్మజా చుండూరు తెలిపారు. విలీనం కాబోయే అలహాబాద్ బ్యాంక్ కస్టమర్లకు కూడా తమ ఎమర్జెన్సీ రుణ పథకాలు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆమె వివరించారు. 2020 డిసెంబర్ ఆఖరు నాటికి మొత్తం ఐటీ వ్యవస్థ అనుసంధానం పూర్తి కాగలదని చెప్పారు. విలీన ప్రక్రియతో తమ బ్యాంకు మరింత శక్తిమంతంగా మారగలదని కెనరా బ్యాంకు ఎండీ ఎల్‌వీ ప్రభాకర్ తెలిపారు. మరోవైపు, లాక్‌డౌన్ కారణంగా కొన్ని ప్రక్రియల అమలు మాత్రం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు యాంకర్ బ్యాంకుల వర్గాలు తెలిపాయి.
ప్రణాళిక ఇదీ..
అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలిగే భారీ బ్యాంకులను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కేంద్రం.. ప్రభుత్వ రంగంలో బ్యాంకుల విలీనానికి తెరతీసిన సంగతి తెలిసిందే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమవుతాయి. అలాగే కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు .. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు .. ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకు విలీనమవుతాయి. పీఎన్‌బీ, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు .. యాంకర్ బ్యాంకులుగా ఉంటాయి. ఈ కన్సాలిడేషన్‌తో ప్రభుత్వ రంగంలో 7 భారీ బ్యాంకులు, 5 చిన్న బ్యాంకులు ఉంటాయి. ఒక్కో భారీ బ్యాంకు పరిమాణం రూ. 8 లక్షల కోట్ల పైగా ఉండనుంది. ప్రభుత్వ రంగంలో ఎస్‌బీఐ తర్వాత రెండో అతి పెద్ద బ్యాంకుగా పీఎన్‌బీ ఆవిర్భవిస్తుంది. కెనరా బ్యాంక్ నాలుగో స్థానంలో, యూనియన్ బ్యాంక్ (5), ఇండియన్ బ్యాంక్ ఏడో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉంటాయి. 2017లో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) ఉండగా ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకులను, బ్యాంక్ ఆఫ్ బరోడాలో మరికొన్ని బ్యాంకులను విలీనం చేయగా 18కి తగ్గాయి. ఇకపై 12 మాత్రమే ఉండనున్నాయి.
నేడే మెగా విలీనం
Published Wed, Apr 1 2020 2:01 AM | Last Updated on Wed, Apr 1 2020 2:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment