
ఆరు బ్యాంకుల సీఎండీలపై మోడీ సర్కారు వేటు
ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఎండీలపై నరేంద్ర మోడీ సర్కారు వేటు వేసింది.
ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఎండీలపై నరేంద్ర మోడీ సర్కారు వేటు వేసింది. ఆగస్టులో లంచం తీసుకున్న ఆరోపణలతో సిండికేట్ బ్యాంకు ఛైర్మన్ను అరెస్టు చేసిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంకుల సీఎండీల ఎంపిక విధానంలోనే అక్రమాలున్నాయంటూ ఓ ఉన్నతస్థాయి కమిటీ సర్కారుకు నివేదిక సమర్పించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్, విజయా బ్యాంకుల సీఎండీలను ఇప్పుడు తొలగించారు. వీరంతా యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైనవాళ్లే. ఇప్పుడు తీసేసిన వాళ్లతో పాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న మరో 8 సీఎండీ పోస్టులను, 14 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా ప్రభుత్వం నిలిపివేసింది.
సిండికేట్ బ్యాంకు ఛైర్మన్ ఎస్కే జైన్ అరెస్టు తర్వాత ఈ బ్యాంకు సీఎండీల నియామకాలపై దృష్టిపెట్టారు. కొత్త విధానంలోనే భవిష్యత్తులో మొత్తం బ్యాంకుల సీఎండీల నియామకాలు జరుగుతాయని ఆర్థికమంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవలి కాలంలో జరిగిన బ్యాంకు అధినేతల నియామకాలపై కూడా పరిశీలన మొదలుపెట్టినట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మొత్తం ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.