ప్రభుత్వ బ్యాంకుల్లో మరో విలీనం?
♦ బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి దక్షిణాది బ్యాంకులు
♦ దేనా బ్యాంకు మాత్రం వేరొక బ్యాంకులోకి
♦ ఆర్థిక శాఖ అధ్యయనం; మార్చిలోగా నిర్ణయం!
న్యూఢిల్లీ: ఎస్‌బీఐలో ఐదు బ్యాంకుల విలీనం సంపూర్ణం కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మరో విడత ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏకీకరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో బలమైన, అతిపెద్ద బ్యాంకులుండాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో విలీన ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. 3–4 బ్యాంకుల్ని స్థిరకరించే ప్రతిపాదనలపై అధ్యయనం చేస్తోంది. జూన్ 12న ఇందుకు సంబంధించి ఓ సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. స్థిరీకరణకు సంబంధించిన ప్రతిపాదనలను సెప్టెంబర్ నాటికి ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పిస్తామని, వచ్చే జనవరి–మార్చి నాటికి ఇది పూర్తి కావచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.
నీతిఅయోగ్ రోడ్‌మ్యాప్..: భారీ స్థాయి బ్యాంకుల ఏర్పాటు దిశగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రెండో దశ స్థిరీకరణకున్న అవకాశాలను పరిశీలించి అభిప్రాయాలు చెప్పాలని నీతి ఆయోగ్, అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థలను కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే కోరింది. భవిష్యత్తులో ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి సంబంధించి నీతి ఆయోగ్ ఓ రోడ్‌మ్యాప్‌ను తీసుకురానుంది. పెద్ద బ్యాంకుల్లో విలీనానికి అనువైన చిన్న బ్యాంకులను గుర్తించే పనిని కూడా ఆర్థికశాఖ ప్రారంభించింది.
అయితే బలహీన బ్యాంకుల్ని, బలమైన బ్యాంకుల్లో విలీనం చేయడం జరగదని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు స్పష్టం చేశారు. దక్షిణాదిన టర్న్ అరౌండ్ అయిన బ్యాంకులను బ్యాంకు ఆఫ్ బరోడాలో... దేనా బ్యాంకును దక్షిణాదికే చెందిన మరో బ్యాంకులో విలీనం చేయడానికి అవకాశాలున్నాయని తెలిపారు. అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకులు ఏప్రిల్ 1 నుంచి ఎస్‌బీఐలో కలిసిపోయిన విషయం తెలిసిందే.