దేశంలో అన్నీ ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల పనిదినాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. వారానికి 6 రోజులు పని చేసే ఉద్యోగులు ఇకపై 5 రోజులు మాత్రమే పనిచేయనున్నారా? అంటే అవుననే అంటోంది ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ). అంతే కాదు బ్యాంకు యూనియన్ సభ్యులు కొన్ని డిమాండ్లను ఆర్‌బీఐ, కేంద్రం ఎదుట ఉంచారు.
పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం..ఏఐబీఈఏ సంఘం కొన్ని ప్రతిపాదనలు చేసింది. అందులో.. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులు వారానికి 6 రోజులు పని చేస్తుండగా.. ఆ పనివేళల్ని 5 రోజులకు కుదించాలని ప్రతిపాదించింది. అదే సమయంలో బ్యాంకు పనిదినాల్ని 5 రోజులకు కుదించడంతో పాటు..రోజుకు మరో అరగంట అదనంగా పనిచేస్తామని పేర్కొంది.
బ్యాంకుల పనిదినాలు ఇలా ఉండాలి
బ్యాంకు ఉద్యోగుల సంఘం లేఖ ప్రకారం..ప్రతిపాదిత పని గంటలు ఉదయం 9:15 గంటల నుండి సాయంత్రం 4.45 గంటల వరకు కాకుండా..ఉదయం 9:45 నుండి సాయంత్రం 4.45 గంటల వరకు మార్చాలి. బ్యాంకు ట్రాన్సాక్షన్ సమయం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు సవరించాలి. సవరించిన నగదు రహిత లావాదేవీల వేళలు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉండాలని యూనియన్ ప్రతిపాదించిందని పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
ఈ సందర్భంగా బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని కల్పించాలని యూనియన్ డిమాండ్ చేస్తోందని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ఈ వర్కింగ్ ప్రతిపాదనలు గతేడాది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌లో ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు.
ఆర్‌బీఐ అంగీకరిస్తుంది
రెండు శనివారాల నష్టాన్ని భర్తీ చేయడంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తన అభిప్రాయాలను కోరినట్లు ఆయన చెప్పారు. పనిగంటలను ముప్పై నిమిషాలు పెంచవచ్చని ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ (ఐబీఏ), కేంద్రం, ఆర్‌బీఐ తమ ప్రతిపాదనలకు అంగీకరిస్తాయని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం ఆశాభావం వ్యక్తం చేశారు.
కోవిడ్ సమయంలో ప్రతిపాదనల తిరస్కరణ
కరోనా మహమ్మారి సమయంలో, కోవిడ్ -19 వైరస్ నుండి ఉద్యోగులను రక్షించడానికి బ్యాంకు ఉద్యోగుల సంఘాలు వారానికి ఐదు రోజుల పని చేయాలని డిమాండ్ చేశాయి. ఈ ప్రతిపాదనను ఐబీఏ తిరస్కరించింది. కాని ఉద్యోగులకు 19 శాతం వేతన పెంపును ప్రతిపాదించింది. ప్రస్తుతం, బ్యాంకులకు ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు, ప్రతి ఆదివారం సెలవులు ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment