ఇక బ్యాంకుల నిరవధిక సమ్మె ! | Two-day banking strike cripples Mumbai | Sakshi
Sakshi News home page

ఇక బ్యాంకుల నిరవధిక సమ్మె !

Published Tue, Feb 11 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

ఇక బ్యాంకుల నిరవధిక సమ్మె !

ఇక బ్యాంకుల నిరవధిక సమ్మె !

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే నెలలో నిరవధిక సమ్మె చేయడానికి ప్రభుత్వరంగ బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో పాటు బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంకు యూనియన్లు రెండు రోజుల సమ్మెకు పిలుపునివ్వటం... సోమవారం నుంచి రెండురోజుల సమ్మె మొదలు కావటం తెలిసిందే. ఇంత జరిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలూ రాలేదు సరికదా... బ్యాంకుల లాభాలు ఉద్యోగుల జీతాలు పెంచడానికి కాదని, వీటిని వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకుంటామని ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు యూనియన్లను మరింత ఎగదోశాయి.

 దీంతో వచ్చే నెలలో నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంపాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) పేర్కొంది. ‘చివరిసారిగా మరోసారి ఆర్థిక మంత్రి చిదంబరాన్ని కలుస్తాం. అప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోతే నిరవధిక సమ్మెకు దిగుతాం’ అని ఏఐబీఈఏ సంయుక్త కార్యదర్శి బి.ఎస్.రాంబాబు ‘సాక్షి’తో చెప్పారు. తదుపరి కార్యాచరణ కోసం ఈనెల 13న సమావేశమవుతామని, ఆ తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఐదేళ్లకోసారి చేసే జీతాల సవరణకు రూ.3,000 కోట్లు అవుతుందని, దానికి ఒప్పుకోకుండా కార్పొరేట్ సంస్థలు చెల్లించకుండా ఎగ్గొట్టిన రుణాలకు లక్షల కోట్లు కేటాయించడం దారుణమన్నారు.

 గత ఐదేళ్ళలో కార్పొరేట్ సంస్థలకు మాఫీ చేసిన రుణాల విలువ 5 లక్షల కోట్లపైనే ఉందని.. న్యాయ సమ్మతంగా పెంచాల్సిన జీతాలకు మాత్రం డబ్బులు లేవనడం సమంజసం కాదంటూ ఆంధ్రాబ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్ ప్రధానకార్యదర్శి ఐ.హరినాథ్ వాపోయారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అన్ని ప్రభుత్వ బ్యాంకులు కలిసి రూ.1.25 లక్షల కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జిస్తే, నికరలాభం రూ.42,000 కోట్లు మాత్రమేనని, మిగిలిన లాభాలన్నీ మొండి బకాయిల ప్రొవిజనింగ్‌కు కేటాయించడం జరిగిందన్నారు. ఈ ఆర్థిక సం వత్సరం 9 నెలల్లో ఆంధ్రాబ్యాంక్‌కు రూ.1,911 కోట్ల స్థూల లాభం వస్తే.. డెక్కన్‌క్రానికల్, ఎంబీఎస్ జ్యూవెలర్స్ వంటి సంస్థల మొండి బకాయిలకు ప్రొవిజనింగ్ కేటాయింపుల వల్ల నికరలాభం రూ.348 కోట్లకు పడిపోయిందని వివరించారు.
 
 ఆగిపోయిన లావాదేవీలు  రూ.1.68 లక్షల కోట్లు
 ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన రెండు రోజుల సమ్మె కారణంగా సోమవారం దేశవ్యాప్తంగా రూ.1.68 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు స్తంభించిపోయాయి. రాష్ట్రంలో కూడా ప్రభుత్వరంగ బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. సుమారు 4,500 శాఖల్లో ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు. పలు గ్రామాల్లో నగదు లేక ఏటీఎంలు పనిచేయలేదు. దేశవ్యాప్తంగా 8 లక్షలమంది, రాష్ర్టంలో 75,000 మంది ఆఫీసర్లు సమ్మెలో పాల్గొన్నట్లు రాంబాబు తెలిపారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగస్తులు సమ్మెలో పాల్గొన్నట్లు హరినాథ్ చెప్పారు. మంగళవారం కూడా సమ్మె యథాతథంగా కొనసాగుతుందని బ్యాంకు యూనియన్లు పేర్కొన్నాయి.
 
 లాభాలన్నీజీతాల పెంపునకే కాదు: చిదంబరం
 
 జీతాల సవరణ కోసం బ్యాంకు ఉద్యోగుల రెండు రోజుల సమ్మె చేస్తున్న సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులు ఆర్జిస్తున్న లాభాలను పూర్తిగా జీతాల పెంపునకే కేటాయించలేమని, వాటికి ఇతర అవసరాలు కూడా ఉంటాయని చెప్పారు. బ్యాంకుల ఆదాయం, లాభాలను జీతాల పెంపునకు కేటాయించాలేమన్న విషయాన్ని బ్యాంకు ఉద్యోగులు, ఆఫీసర్లు దృష్టిలో పెట్టుకోవాలని వ్యాఖ్యానించారాయన. బ్యాంకుల లాభాలను వాటాదారులకు డివిడెండ్లు, వ్యాపార విస్తరణకు అవసరమైన మూలధన అవసరాలను సమకూర్చుకోవడం వంటి అంశాలకు కేటాయించాల్సి ఉంటుందన్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 78వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement