న్యూఢిల్లీ: విజయ, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు బుధవారం దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నాయి. గత శుక్రవారం కూడా ఇదే అంశంతోపాటు వేతన డిమాండ్లపై ఒక రోజు సమ్మె చేసిన బ్యాంకు ఉద్యోగులు వారం తిరగక ముందే మరోసారి సమ్మెకు దిగుతున్నారు. దీంతో బుధవారం ప్రభుత్వరంగ బ్యాంకు సేవలపై ప్రభావం పడనుంది. ప్రైవేటు బ్యాంకులు మాత్రం యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. చాలా వరకు బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు సమ్మె విషయమై సమాచారాన్ని కూడా తెలియజేశాయి.
తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలతో కూడిన యునైటెడ్ బ్యాంక్ యూనియన్స్ ఈ సమ్మెను నిర్వహిస్తోంది. విలీనం విషయంలో ముందుకు వెళ్లబోమంటూ ప్రభుత్వం నుంచి తమకు హామీ రాలేదని, దాంతో సమ్మె నిర్ణయం తీసుకున్నామని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలియజేశారు. ప్రభుత్వం బ్యాంకుల సైజు పెరగాలని కోరుకుంటోందని, ప్రభుత్వరంగ బ్యాంకులు అన్నింటినీ కలిపి ఒక్కటి చేసినా గానీ, ప్రపంచంలోని టాప్ 10లో చోటు దక్కదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment