strike postpone
-
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ నెల 27న తలపెట్టిన సమ్మెను వాయిదా వేశాయి. ఉద్యోగుల డిమాండ్లపై చర్చలు ప్రారంభించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) అంగీకరించడం ఇందుకు కారణం. తొమ్మిది బ్యాంకు యూనియన్లకు నేతృత్వం వహిస్తున్న యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్బీయూ) సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఐబీఏతో చర్చలు జూలై 1 నుంచి మొదలు కానున్నాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్.వెంకటాచలం తెలిపారు. వారంలో అయిదు రోజులు మాత్రమే పని దినాలు ఉండాలని ఉద్యోగ సంఘాలు బ్యాంకులను ఒత్తిడి చేస్తున్నాయి. పింఛన్ దారులందరికీ పెన్షన్ను నవీకరించడం, సవరించడంతోపాటు జాతీయ పెన్షన్ పథకాన్ని తొలగించడం, బ్యాంకు ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం వంటివి డిమాండ్ల జాబితాలో ఉన్నాయి. -
నేడు, రేపు బ్యాంకులు పనిచేస్తాయి!
- నేడు, రేపు బ్యాంకులు పనిచేస్తాయి! - ఢిల్లీ హైకోర్టు జోక్యంతో సమ్మె నిలుపుదల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మంగళ, బుధ వారాల్లో తలపెట్టిన సమ్మె వాయిదాపడింది. సమ్మెను నిలుపుదల చేస్తూ ఢిల్లీ హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులివ్వటంతో యూనియన్లు సమ్మెను వాయిదా వేశాయి. ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు వేసిన రిట్ పిటీషన్ మీద విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు ఎస్బీహెచ్ వెల్లడించింది. తాజా పరిణామాల నేపథ్యంలో సమ్మె వాయిదా పడినట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) కార్యదర్శి బీఎస్ రాంబాబు చెప్పారు. ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఏఐబీఈఏ ఈ నెల 12 (నేడు), 13న (రేపు) సమ్మెకు పిలుపునివ్వడం తెలిసిందే. డిమాండ్లపై జరిపిన చర్చల్లో యాజమాన్యాలు నిర్మాణాత్మకమైన ప్రతిపాదనేదీ తేకపోవడంతో ముందుగా ప్రకటించిన విధంగా సమ్మె జరపాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. అయితే, ఈలోగా న్యాయస్థానం ఆదేశాలు వెలువడటంతో వాయిదా వేశాయి.