పీఎన్‌బీ.. సంస్కరణల అమల్లో టాప్‌ | PNB ranks highest in implementation of 'reforms agenda' | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ.. సంస్కరణల అమల్లో టాప్‌

Published Fri, Mar 1 2019 5:02 AM | Last Updated on Fri, Mar 1 2019 5:04 AM

PNB ranks highest in implementation of 'reforms agenda' - Sakshi

న్యూఢిల్లీ: నీరవ్‌ మోదీ కుంభకోణంతో భారీగా నష్టపోయిన ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, చాలా వేగంగా కోలుకుని సంస్కరణల అజెండా అమల్లో అగ్రస్థానంలో నిల్చింది. ఈ విషయంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) రెండో స్థానం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. సేవల నాణ్యతను మెరుగుపర్చుకునే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలు చేస్తున్న సంస్కరణలపై బీసీజీ–ఐబీఏ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

డిజిటలైజేషన్, రుణ వితరణ తదితర 140 అంశాల ప్రాతిపదికగా రూపొందించిన ఈ నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం విడుదల చేశారు. ఇందులో 100 మార్కులకు గాను పీఎన్‌బీకి 78.4 స్కోరు దక్కించుకుంది. మిగతా బ్యాంకుల స్కోర్లు చూస్తే.. బీవోబీ 77.8, ఎస్‌బీఐ (74.6), ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (69), కెనరా బ్యాంక్‌ (67.5), సిండికేట్‌ బ్యాంక్‌ 67.1గా ఉన్నాయి. బాధ్యతాయుతమైన బ్యాంకింగ్, రుణ వితరణ, ఆర్థిక సేవల విస్తరణ, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సత్వరం స్పందించడం తదితర అంశాల్లో పీఎన్‌బీ ’మెరుగైన పనితీరు’ కనపర్చినట్లు బీసీజీ–ఐబీఏ నివేదిక పేర్కొంది.  

‘భారీ కుంభకోణం కారణంగా ఇటు ఆర్థికంగాను, అటు ప్రతిష్టపరంగానూ దెబ్బతిన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మొండిబాకీలకు  రూ. 14,000 కోట్లు కేటాయించాల్సి వచ్చింది. అయితే, 9 నెలల్లోనే బ్యాంక్‌ పనితీరు గణనీయంగా మెరుగుపడింది. తొమ్మిది నెలల తర్వాత గత క్వార్టర్‌లో లాభాలు కూడా ప్రకటించింది. అలాగే, సంస్కరణల అమల్లో అగ్రస్థానాన్నీ దక్కించుకోవడం అభినందనీయం‘ అని జైట్లీ ప్రశంసించారు. ఇలాంటి ర్యాంకింగ్‌ల విధానంతో బ్యాంకుల మధ్య పోటీతత్వం పెరుగుతుందని, మరింత మెరుగ్గా పనిచేసేలా ప్రోత్సాహం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆయా బ్యాంకులు అమలు చేస్తున్న సంస్కరణల ఊతంతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఒత్తిడి తగ్గిందని, మొండిబాకీలను గుర్తించడంతో పాటు వాటికి పూర్తి స్థాయిలో ప్రొవిజనింగ్‌ చేయడం కూడా ఇందుకు కారణమని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ చెప్పారు.  

పీసీఏలోని బ్యాంకులకూ ర్యాంకింగ్‌..
భారీ మొండిబాకీల కారణంగా ఆర్‌బీఐ ఆంక్షలు ఎదుర్కొంటున్న ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కూడా ఈ నివేదికలో ర్యాంకింగ్‌ లభించింది. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌కి 66.7, యూకో బ్యాంక్‌ (64.1), యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (60.8), ఐడీబీఐ బ్యాంక్‌ (60.2), సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (55.7), దేనా బ్యాంక్‌కు 53.8 ర్యాంక్‌ లభించింది. ప్రభుత్వ రంగంలో మొత్తం 21 బ్యాంకులు ఉండగా, 11 బ్యాంకులను ఆర్‌బీఐ గతేడాది పీసీఏ పరిధిలోకి చేర్చి కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. 5 బ్యాంకులు ఇటీవలే దీన్నుంచి బైటికి వచ్చాయి.  

దివాలా చట్టంతో ప్రయోజనాలు..
దివాలా చట్టం, మొండిబాకీల రికవరీపరమైన సంస్కరణల పక్కా అమలు.. బ్యాంకులు కోలుకునేందుకు తోడ్పడుతున్నాయని నివేదిక పేర్కొంది. 2015 ఏప్రిల్‌ నుంచి 2018 డిసెంబర్‌ దాకా ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 2.87 లక్షల కోట్లు రికవర్‌ చేసుకున్నాయని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ దాకా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 98,498 కోట్లు రాబట్టుకోగలిగాయని తెలిపింది. 2014–15 నుంచి 2019 ఫిబ్రవరి దాకా ప్రభుత్వ  బ్యాంకులకు కేంద్రం రూ. 2.5 లక్షల కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చింది.

కొనసాగనున్న బ్యాంకుల విలీనం..
అంతర్జాతీయ స్థాయి బ్యాంకులను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ చెప్పారు. ఇందులో భాగంగా బ్యాంకుల విలీన విధానాన్ని క్రమంగా అమలు చేస్తోందని ఆయన వివరించారు. మొండిబాకీలను బ్యాంకులు పూర్తిగా బైటపెట్టేలా చర్యలు తీసుకోవడంతో.. ప్రారంభంలో వీటి పరిమాణం భారీ స్థాయికెళ్లిందని, అయితే కేటాయింపులు, రికవరీలతో ఇవి తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు. గడిచిన 2–3 త్రైమాసికాల్లో ప్రభుత్వ బ్యాంకుల్లో మొండిబాకీల సమస్య క్రమంగా తగ్గుతోందన్నారు.  ‘అదనపు మూలధనం సమకూర్చడంపై ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంటోంది. పలు బ్యాంకులు పీసీఏ నుంచి బైటికి రావడం హర్షణీయం. త్వరలో మిగతావి కూడా తమ కార్యకలాపాలు మెరుగుపర్చుకుని, బైటికి రాగలవని ఆశిస్తున్నాను‘ అని  చెప్పారు. ఎన్‌డీఏ సర్కార్‌ వచ్చాక.. బ్యాం కుల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యానికి ఫుల్‌స్టాప్‌ పడిందని జైట్లీ తెలిపారు. బ్యాంకింగ్‌ రంగంలో ప్రతిభ, ప్రొఫెషనలిజంకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. ప్రైవేట్‌ బ్యాంకులతో పోలిస్తే మరిన్ని నియంత్రణలకు లోబడి పనిచేయాల్సి ఉంటున్నా.. ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు భారీ స్థాయిలో ఉండటం అభినందించతగ్గ విషయమని జైట్లీ పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement