తొలుత సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ వెనువెంటనే అమ్మకాలు పెరగడంతో దేశీ స్టాక్ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. కాగా.. సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించడంతో హోమ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రొడక్టుల కంపెనీ హెచ్‌ఎస్‌ఐఎల్ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు దేశీ అనుబంధ సంస్థలో మాతృ సంస్థ 17.59 శాతం వాటాను విక్రయానికి ఉంచడంతో ప్రాసెస్ ఎక్విప్‌మెంట్ దిగ్గజం జీఎంఎం ఫాడ్లర్ లిమిటెడ్ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి హెచ్‌ఎస్‌ఐఎల్ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. జీఎంఎం ఫాడ్లర్ భారీ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం..
హెచ్‌ఎస్‌ఐఎల్ లిమిటెడ్
షేరుకి రూ. 105 ధర మించకుండా ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు హెచ్‌ఎస్‌ఐఎల్ తాజాగా వెల్లడించింది. బైబ్యాక్‌లో భాగంగా 6.67 మిలియన్ షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు రూ. 70 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో హెచ్‌ఎస్‌ఐఎల్ షేరు తొలుత ఎన్‌ఎస్ఈలో 8 శాతం జంప్‌చేసి రూ. 77 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.5 శాతం లాభంతో రూ. 75 వద్ద ట్రేడవుతోంది. గత 8 రోజుల్లో ఈ షేరు 29 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!
జీఎంఎం ఫాడ్లర్ లిమిటెడ్
ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్ గ్రూప్ సంస్థలు 17.59 శాతం వాటాను విక్రయించనున్నట్లు జీఎంఎం ఫాడ్లర్ తాజాగా పేర్కొంది. ఇందుకు ఫ్లోర్ ధర రూ. 3,500గా నిర్ణయించినట్లు తెలియజేసింది. సోమవారం ముగింపు ధర రూ. 5,241తో పోలిస్తే ఇది 33 శాతం డిస్కౌంట్‌కాగా.. నేటి నుంచి ఓఎఫ్‌ఎస్ ప్రారంభంకానుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ బుధవారం వర్తించనుంది. కంపెనీ ప్రమోటర్లు ఫాడ్లర్ ఇంక్, మిల్లర్స్ మెషీనరీ, ఊర్మి పటేల్ సంయుక్తంగా 2.57 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు. ఓఎఫ్‌ఎస్‌కు లభించే స్పందన ఆధారంగా మరో 1.52 మిలియన్ షేర్లను సైతం విక్రయించనున్నారు. తద్వారా మొత్తం 28 శాతంవరకూ వాటాను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. జూన్‌కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 75 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో జీఎంఎం ఫాడ్లర్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం పతనమైంది. కొనుగోలుదారులు కరువుకావడంతో రూ. 4,683 దిగువన ఫ్రీజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment