HSIL
-
ఏజీఐ గ్రీన్‌ప్యాక్ 230 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాకేజింగ్ ఉత్పత్తుల లిస్టెడ్ సంస్థ ఏజీఐ గ్రీన్‌ప్యాక్ ఉత్పత్తి, ఎగుమతి సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు రూ. 230 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. ఇందులో సింహభాగం నిధులను గ్రూప్ సంస్థ ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌లో ప్రస్తుత ఫర్నేస్‌లను ఆధునీకరించేందుకు, అధునాతన టెక్నాలజీలను వినియోగంలోకి తెచ్చుకునేందుకు ఇన్వెస్ట్ చేస్తోంది. ఏజీఐ గ్రీన్‌ప్యాక్ సీఈవో రాజేశ్ ఖోస్లా ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా గ్లాస్ ప్యాకేజింగ్ మార్కెట్ 2024లో 67.28 బిలియన్ డాలర్లు ఉండగా 2032 నాటికి 93.69 బిలియన్ డాలర్లకు చేరే అంచనాలు ఉన్నాయని ఖోస్లా వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భువనగిరిలోని తమ స్పెషాలిటీ గ్లాస్ ప్లాంటుతో పాటు ఇతరత్రా ఉత్పత్తి సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. గ్లాస్ ప్యాకేజింగ్ ఉత్పత్తులను ఇప్పటికే అమెరికాకు ఎగుమతి చేస్తుండగా కొత్తగా మధ్యప్రాచ్యం, యూరప్ మార్కెట్లలో కూడా అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్సీఎల్టీకి చేరిన హిందుస్తాన్ నేషనల్ గ్లాస్ కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నట్లు వివరించారు. గత ఆర్థిక సంవత్సరం తమ టర్నోవరు రూ. 2,421 కోట్లుగా ఉందని ఖోస్లా చెప్పారు. -
భువనగిరి వద్ద ఏజీఐ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంటెయినర్ గ్లాస్ బాటిళ్ల తయారీ సంస్థ ఏజీఐ గ్లాస్‌ప్యాక్ హైదరాబాద్ సమీపంలోని భువనగిరి వద్ద కొత్త ప్లాంటును నెలకొల్పుతోంది. ఇందుకోసం కంపెనీ మాతృ సంస్థ అయిన హెచ్ఎస్ఐఎల్ రూ.220 కోట్లు పెట్టుబడి చేస్తోంది. 15 ఎకరాల్లో స్థాపిస్తున్న ఈ నూతన కేంద్రం 2022 సెప్టెంబర్ చివరికి కార్యరూపం దాల్చనుందని హెచ్ఎస్ఐఎల్ వైస్ చైర్మన్ సందీప్ సొమానీ తెలిపారు. రోజుకు 150 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. ఔషధాలు, సుగంధ పరిమళాలు, సౌందర్య సాధనాలు, ఖరీదైన మద్యం ప్యాకింగ్ కోసం హై ఎండ్ స్పెషాలిటీ గ్లాస్ బాటిళ్లను ఇక్కడ తయారు చేస్తారు. ఫర్నేస్‌తోపాటు అయిదు తయారీ లైన్లు ఏర్పాటు కానున్నాయి. యూఎస్ఏ, ఆ స్ట్రేలియా, యూరప్ దేశాలకు సైతం ఎగుమతి చేయ నున్నారు. 1972లో ప్రారంభమైన ఏజీఐ గ్లాస్‌ప్యాక్.. ముడి సరుకు లభ్యత దృష్ట్యా హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌తోపాటు భవనగిరిలో ప్లాంట్లను నిర్వహిస్తోంది. వీటి సామర్థ్యం రోజుకు 1,600 టన్నులు. కంపెనీ వార్షికాదాయం రూ.1,300 కోట్లు. సుమారు 3,000 మంది ఉద్యోగులున్నారు. 5 నుంచి 4,000 మిల్లీలీటర్ల సామర్థ్యం గల బాటిళ్లను ఉత్పత్తి చేస్తోంది. -
హెచ్ఎస్ఐఎల్ జూమ్- జీఎంఎం పతనం
తొలుత సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ వెనువెంటనే అమ్మకాలు పెరగడంతో దేశీ స్టాక్ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. కాగా.. సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించడంతో హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రొడక్టుల కంపెనీ హెచ్ఎస్ఐఎల్ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు దేశీ అనుబంధ సంస్థలో మాతృ సంస్థ 17.59 శాతం వాటాను విక్రయానికి ఉంచడంతో ప్రాసెస్ ఎక్విప్మెంట్ దిగ్గజం జీఎంఎం ఫాడ్లర్ లిమిటెడ్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి హెచ్ఎస్ఐఎల్ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. జీఎంఎం ఫాడ్లర్ భారీ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. హెచ్ఎస్ఐఎల్ లిమిటెడ్ షేరుకి రూ. 105 ధర మించకుండా ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు హెచ్ఎస్ఐఎల్ తాజాగా వెల్లడించింది. బైబ్యాక్‌లో భాగంగా 6.67 మిలియన్ షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు రూ. 70 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో హెచ్ఎస్ఐఎల్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతం జంప్‌చేసి రూ. 77 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.5 శాతం లాభంతో రూ. 75 వద్ద ట్రేడవుతోంది. గత 8 రోజుల్లో ఈ షేరు 29 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! జీఎంఎం ఫాడ్లర్ లిమిటెడ్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్ గ్రూప్ సంస్థలు 17.59 శాతం వాటాను విక్రయించనున్నట్లు జీఎంఎం ఫాడ్లర్ తాజాగా పేర్కొంది. ఇందుకు ఫ్లోర్ ధర రూ. 3,500గా నిర్ణయించినట్లు తెలియజేసింది. సోమవారం ముగింపు ధర రూ. 5,241తో పోలిస్తే ఇది 33 శాతం డిస్కౌంట్‌కాగా.. నేటి నుంచి ఓఎఫ్ఎస్ ప్రారంభంకానుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ బుధవారం వర్తించనుంది. కంపెనీ ప్రమోటర్లు ఫాడ్లర్ ఇంక్, మిల్లర్స్ మెషీనరీ, ఊర్మి పటేల్ సంయుక్తంగా 2.57 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు. ఓఎఫ్‌ఎస్‌కు లభించే స్పందన ఆధారంగా మరో 1.52 మిలియన్ షేర్లను సైతం విక్రయించనున్నారు. తద్వారా మొత్తం 28 శాతంవరకూ వాటాను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. జూన్‌కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 75 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో జీఎంఎం ఫాడ్లర్ షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం పతనమైంది. కొనుగోలుదారులు కరువుకావడంతో రూ. 4,683 దిగువన ఫ్రీజయ్యింది. -
ధనుకా అగ్రి- హెచ్ఎస్ఐఎల్ బైబ్యాక్ జోష్
సరిహద్దువద్ద చైనాతో వివాదాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 261 పాయింట్లు క్షీణించి 39,042 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా అగ్రికెమికల్స్ కంపెనీ ధనుకా అగ్రిటెక్, శానిటరీవేర్, హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రొడక్టుల దిగ్గజం హెచ్ఎస్ఐఎల్ కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ధనుకా అగ్రిటెక్ షేరుకి రూ. 1,000 ధర మించకుండా సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ధనుకా అగ్రిటెక్ తాజాగా వెల్లడించింది. బైబ్యాక్‌లో భాగంగా 10 లక్షల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. బైబ్యాక్‌కు ఈ నెల 28 రికార్డ్ డేట్‌కాగా.. ఇందుకు రూ. 100 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో తొలుత ఈ షేరు ఎన్ఎస్ఈలో 9 శాతం దూసుకెళ్లి రూ. 839ను అధిగమించింది. ప్రస్తుతం 6.3 శాతం లాభంతో రూ. 817 వద్ద ట్రేడవుతోంది. హెచ్ఎస్ఐఎల్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి ప్రతిపాదించినట్లు హెచ్ఎస్ఐఎల్ తాజాగా వెల్లడించింది. బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈ నెల 21న(సోమవారం) బోర్డు సమావేశమవుతున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో తొలుత హెచ్ఎస్ఐఎల్ షేరు ఎన్ఎస్ఈలో 11 శాతం జంప్‌చేసి రూ. 75ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 6 శాతం లాభంతో రూ. 72 వద్ద ట్రేడవుతోంది. కాగా.. లాక్‌డవున్‌ల కారణంగా ఈ ఏడాది క్యూ1లో హెచ్ఎస్ఐఎల్ రూ. 17 కోట్ల నికర నష్టం ప్రకటించిన విషయం విదితమే. -
హెచ్ఎస్ఐఎల్ మరో ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హింద్‌వేర్ బ్రాండ్‌తో శానిటరీ వేర్ తయారీలో ఉన్న హెచ్ఎస్ఐఎల్ మరో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం కంపెనీకి హైదరాబాద్ సమీపంలోని బీబీ నగర్‌తోపాటు హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో శానిటరీ వేర్ తయారీ కేంద్రాలున్నాయి. మూడవ యూనిట్‌ను పోర్టు సమీపంలో నెలకొల్పుతామని హెచ్ఎస్ఐఎల్ సీఎండీ రాజేంద్ర కె సొమానీ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ఎప్పుడు, ఎక్కడ నెలకొల్పేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ‘ప్రస్తుతమున్న ప్లాంట్లు పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఫ్యాక్టరీ స్థాపించాల్సిందే. ఇందుకోసం సుమారు రూ.110 కోట్లు ఖర్చు చేస్తాం’ అని వివరించారు. ఈ ఏడాది విస్తరణ కోసం రూ.150 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలియజేశారు. మరో రూ.90 కోట్లతో.. పటాన్చెరు వద్ద నెలకొల్పిన ప్లాస్టిక్ పైప్స్, ఫిట్టింగ్స్ యూనిట్లో ఈ ఏడాది ఆగస్టులో ఉత్పత్తి ప్రారంభమైంది. తొలిదశలో రూ.160 కోట్లు పెట్టుబడి పెట్టారు. 2020 నాటికి మరో రూ.90 కోట్లు ఖర్చు చేస్తామని పైప్స్ విభాగం ప్రెసిడెంట్ రాజేశ్ పజ్నూ వెల్లడించారు. ‘రెండేళ్లలో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 30 వేల టన్నుల నుంచి 45 వేల టన్నులకు చేరుతుంది. ట్రూఫ్లో బ్రాండ్ ద్వారా 2018–19లో రూ.200 కోట్ల వ్యాపారం ఆశిస్తున్నాం. 2022 నాటికి టాప్–5 బ్రాండ్లలో ఒకటిగా నిలుపుతాం’ అని వివరించారు. కాగా, ఏప్రిల్–సెప్టెంబరు కాలంలో హెచ్ఎస్ఐఎల్ రూ.1,172 కోట్ల టర్నోవరుపై రూ.6.8 కోట్ల నికరలాభం ఆర్జించింది. -
హెచ్ఎస్ఐఎల్ పైప్స్ ప్లాంటు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శానిటరీవేర్ కంపెనీ హెచ్ఎస్ఐఎల్... తెలంగాణలో పైపుల తయారీ ప్లాంటును ప్రారంభించింది. తద్వారా సీపీవీసీ, యూపీవీసీ పైపుల విభాగంలోకి కంపెనీ ప్రవేశించిం ది. ట్రూఫ్లో బ్రాండ్ పేరుతో వీటిని విక్రయిస్తారు. హైదరాబాద్ సమీపంలోని ఇస్నాపూర్ వద్ద రూ.160 కోట్ల వ్యయంతో 30,000 టన్నుల సామర్థ్యంతో ఈ యూనిట్‌ను స్థాపించింది. 2020 నాటికి ప్లాంటు సామర్థ్యాన్ని రెండింతలకు చేరుస్తామని హెచ్ఎస్ఐఎల్ వైస్ చైర్మన్, ఎండీ సందీప్ సొమానీ ఈ సందర్భంగా సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. విస్తరణకు రూ.100 కోట్లు వెచ్చిస్తామన్నారు. సీపీవీసీ పైపుల విపణి దేశంలో 28 శాతం వార్షిక వృద్ధితో రూ.3,200 కోట్లుంది. రూ.100 కోట్లతో చేపట్టిన మెదక్‌లోని సెక్యూరిటీ బాటిల్ క్యాప్స్ ప్లాంటు విస్తరణ ఈ ఏడాది సెప్టెంబరుకల్లా పూర్తి అవుతుంది. -
తెలంగాణలో హెచ్ఎస్ఐఎల్ రెండు కొత్త ప్లాంట్లు
⇒ మెదక్‌లోని ఇస్నాపూర్‌లో రూ.300 కోట్ల పెట్టుబడులు ⇒ రూ.60 కోట్లతో బీబీనగర్‌లోని సిరామిక్ ప్లాంట్ విస్తరణ కూడా.. ⇒ హెచ్ఎస్ఐఎల్ వీసీఎండీ సందీప్ సొమానీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సొమానీ గ్రూప్‌కు చెందిన హిందుస్థాన్ శానిటరీవేర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (హెచ్ఎస్ఐఎల్) తెలంగాణలో మరో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. రూ.300 కోట్ల పెట్టుబడులతో మెదక్‌లోని ఇస్నాపూర్‌లో ప్రీమియం పైప్స్ అండ్ క్యాప్స్ (సెక్యూరిటీ క్లోజర్ సొల్యూషన్స్), సీపీవీసీ (క్లోరినేటెడ్ పాలి వినైల్ క్లోరైడ్) పైప్స్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు హెచ్ఎస్ఐఎల్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ సొమానీ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ఈ రెండు ప్లాంట్ల ద్వారా ప్రత్యక్షంగా 800–900 మంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలొస్తాయన్నారు. ప్లాంట్ల నిర్మాణం కూడా పూర్తయిందని, ఉత్పత్తుల తయారీకి అవసరమైన మిషనరీని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నామని తెలియజేశారు. ప్రస్తుతం ప్లాంట్‌లో ఉత్పత్తుల తయారీ ట్రయల్ రన్లో ఉందని, మార్చి ముగింపు నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అలాగే సీపీవీసీ ప్లాంట్‌ను జూలై నాటికి ప్రారంభిస్తామని చెప్పారు. సీపీవీసీ ప్లాంట్ సామర్థ్యం ఏటా 30 వేల టన్నులుగా ఉంటుందని.. వీటి దేశీయంగా సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఇస్నాపూర్‌లో సంస్థకిక్కడ 84 ఎకరాల స్థలముంది. ప్రస్తుతానికి కొంత భాగంలోనే ఈ ప్లాంట్లను నిర్మిస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీబీనగర్ ప్లాంట్ విస్తరణ.. ప్రస్తుతం హెచ్‌ఎస్‌ఐఎల్‌కు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 3 ప్లాంట్లున్నాయి. వీటి నుంచి శానిటరీ, గ్లాస్ బాటిల్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. తాజాగా రూ.60 కోట్ల పెట్టుబడులతో బీబీనగర్‌లోని సిరామిక్ ప్లాంట్‌ను సామర్థ్యాన్ని విస్తరించనుంది. దీంతో ప్రస్తుతం ఏటా 38 లక్షల టన్నులుగా ఉన్న ప్లాంట్ సామర్థ్యం 42 లక్షలకు చేరుతుందని తెలిపారు. జూలై నుంచి విస్తరిత ప్లాంట్ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ‘‘2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.1,948 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాం. 40 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకున్నాం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా వంటి దేశాలకు హెచ్ఎస్ఐఎల్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాం. ఏటా మొత్తం వ్యాపారంలో ఎగుమతుల వాటా రూ.70–80 కోట్లుగా ఉంటుందని’’ సందీప్ వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,500 మంది డీలర్లు, 18 వేల ఔట్లెట్లున్నాయని 2020 నాటికి 20 వేల ఔట్లెట్లకు చేర్చుతామని చెప్పారు. మార్కెట్లోకి హింద్‌వేర్ కూలర్లు.. హెచ్ఎస్ఐఎల్ హింద్‌వేర్ స్నోక్రెస్ట్ పేరిట ఎయిర్‌కూలర్లను మంగళవారమిక్కడ మార్కెట్లోకి విడుదల చేసింది. కూలర్ ముందు భాగంలోని ప్యానెల్స్‌ను మార్చుకోగలిగే వీలుండటం దీని ప్రత్యేకత. డెసర్ట్, పర్సనల్, విండో విభాగాల్లో 14 మోడల్స్‌లో అందుబాటులో ఉంటాయి. 18 లీటర్ల నుంచి 100 లీటర్ల శ్రేణిలో లభిస్తాయి. ధర రూ.8,990–17,990 మధ్య ఉన్నాయి. వీటిని హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లోని ప్లాంట్లలో తయారు చేశారు. -
హెచ్ఎస్ఐఎల్ నుంచి...వాటర్ ప్యూరిఫయర్లు
♦ మూన్‌బో బ్రాండ్‌లో విడుదల ♦ 2018 నాటికి సొంత ప్లాంటు ♦ కంపెనీ కంజ్యూమర్ బిజినెస్ ప్రెసిడెంట్ రాకేష్ కౌల్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సానిటరీవేర్ రంగంలో ఉన్న హెచ్ఎస్ఐఎల్ తాజాగా వాటర్ ప్యూరిఫయర్ల విభాగంలోకి ప్రవేశించింది. మూన్‌బో బ్రాండ్‌లో అయిదు వేరియంట్లను ఆవిష్కరించింది. ధరల శ్రేణి రూ.12,990-26,990 మధ్య ఉంది. అత్యాధునిక హెక్సాప్యూర్ టెక్నాలజీని వీటిలో వాడారు. దీంతో స్వచ్ఛమెన, భద్రమైన మంచినీరు అందుతుందని కంపెనీ కంజ్యూమర్ బిజినెస్ ప్రెసిడెంట్ రాకేష్ కౌల్ ఈ సందర్భంగా బుధవారమిక్కడ మీడియాకు తెలి పారు. అన్ని మోడళ్లకు డిజైన్ పేటెంట్లు దక్కించుకున్నట్టు చెప్పారు. నీటి శుద్ధి విధానానికి సైతం పేటెంటు రానుందన్నారు. కొద్ది రోజుల్లో యూవీ గ్రావిటీ వాటర్ ప్యూరిఫయర్లను విడుదల చేస్తామని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధికి టర్నోవరులో 5-6 శాతం వెచ్చిస్తామని సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పట్టణాల్లోనే ప్యూరిఫయర్లు.. ఆర్వో వాటర్ ప్యూరిఫయర్ల వినియోగం నగరాలకే పరిమితమవుతోంది. దీనికి కారణం ఉత్పత్తులు ఖరీదుగా ఉండడమే. అందుబాటు ధరలో ఉన్న కారణంగా గ్రావిటీ వాటర్ ప్యూరిఫయర్లు తృతీయ శ్రేణి పట్టణాల దాకా విస్తరించాయి. మొత్తంగా దేశంలో ప్యూరిఫికేషన్ పరికరాల వినియోగం 2 శాతమేనని కంపెనీ వెల్లడించింది. రూ.15-20 వేల శ్రేణి వేగంగా విస్తరిస్తోంది. మొత్తం అమ్మకాల్లో ఈ విభాగం వాటా 35 శాతముంది. రూ.10-15 వేల శ్రేణి 25 శాతం, రూ.20 వేలు ఆపైన 8 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. వ్యవస్థీకృత రంగంలో పరిశ్రమ 22-25 శాతం వృద్ధితో రూ.4,000 కోట్లుంది. ఇందులో 9 శాతం వ్యాపారం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. పరిశ్రమలో పరిమాణం పరంగా గ్రావిటీ వాటర్ ప్యూరిఫయర్ల వాటా 50 శాతం ఉంది. 10 ఏళ్లలో వ్యవస్థీకృత రంగ వాటా 20 నుంచి 55 శాతానికి ఎగసింది. మూడేళ్లలో టాప్-3 స్థానం.. వాటర్ ప్యూరిఫయర్ల మార్కెట్లో మూడేళ్లలో 10 శాతం వాటాను మూన్‌బో లక్ష్యంగా చేసుకుంది. మూన్‌బో బ్రాండ్‌లో ఎయిర్ ప్యూరిఫయర్లను సైతం హెచ్ఎస్ఐఎల్ విక్రయిస్తోంది. హెచ్ఎస్ఐఎల్ ఇతర బ్రాండ్లలో వాటర్ హీటర్లు, గీజర్లు, కిచెన్ అప్లయెన్సెస్, ఎయిర్ కూలర్లను అమ్ముతోంది. అన్ని విభాగాల్లో వచ్చే మూడేళ్లలో టాప్-3 కంపెనీగా నిలవాలని లక్ష్యంగా చేసుకున్నట్టు రాకేష్ వెల్లడించారు. థర్డ్ పార్టీకి చెందిన ప్లాంట్లలో ఉత్పత్తులను తయరు చేయిస్తున్నట్టు చెప్పారు. వాటర్ ప్యూరిఫయర్ల తయారీకి సొంత ప్లాంటు 2018 నాటికి ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. -
మెదక్ జిల్లాలో హెచ్ఎస్ఐఎల్ మరో రెండు ప్లాంట్లు
♦ 2017 జూన్ నాటికి ఉత్పత్తి ప్రారంభం ♦ హెచ్ఎస్ఐఎల్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ ప్రెసిడెంట్ మనీష్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శానిటరీ వేర్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం హెచ్ఎస్ఐఎల్ తెలంగాణలో మరో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. మెదక్ జిల్లాలో రూ.240 కోట్లతో వీటిని నిర్మిస్తోంది. సీపీవీసీ పైపులతోపాటు సెక్యూరిటీ క్యాప్స్, క్లోజర్స్ ఉత్పత్తులను ఈ ప్లాంట్లలో తయారు చేస్తారు. ప్రత్యక్షంగా 200, పరోక్షంగా 1,000 మందికిపైగా ఉపాధి లభించనుంది. 2017 ఏప్రిల్-జూన్‌లో రెండు ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలు మొదలవుతాయని హెచ్ఎస్ఐఎల్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ ప్రెసిడెంట్ మనీష్ భాటియా బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. పైప్స్ ప్లాంటు అందుబాటులోకి వస్తే బాత్రూం విభాగంలో భారత ఉపఖండంలో పూర్తి స్థాయి ఉత్పత్తులు అందించే ఏకైక కంపెనీగా అవతరిస్తామని చెప్పారు. ఇప్పటికే కంపెనీకి తెలంగాణలో రంగారెడ్డి, నల్గొండలో ప్లాంట్లు ఉన్నాయి. భారత్‌లో తయారీ... వాటర్ హీటర్స్, వాటర్ ప్యూరిఫయర్స్, ఎయిర్ ప్యూరిఫయర్స్‌ను ప్రస్తుతం కంపెనీ దిగుమతి చేసుకుంటోంది. వీటి తయారీని దేశీయంగా చేపట్టాలని భావిస్తున్నట్టు మనీష్ వెల్లడించారు. కొద్ది రోజుల్లో కంపెనీ నుంచి ప్రకటన వెలువడనుందని చెప్పారు. హెచ్ఎస్ఐఎల్ 2015లో ఫాసెట్స్, సానిటరీవేర్ విభాగంలో 174 ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ ఏడాది 200లకుపైగా ఉత్పత్తులను తీసుకు రానుంది. హెచ్ఎస్ఐఎల్ ఉత్పత్తులు లభించే గ్యాలెరియా ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు దేశవ్యాప్తంగా 150 ఉన్నాయి. మూడేళ్లలో మరో 250 ఔట్లెట్లను ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. స్టోర్లు అన్నీ కూడా ఫ్రాంచైజీలు నిర్వహిస్తున్నారు. హింద్‌వేర్ డ్రీమ్ బాత్ యాప్ ద్వారా కస్టమర్లు తమ ఇంటి బాత్రూంను వర్చువల్‌గా డిజైన్ చేసుకోవచ్చు. -
గృహోపకరణాల విభాగంలోకి హెచ్ఎస్ఐఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : శానిటరీవేర్ దిగ్గజం హెచ్ఎస్ఐఎల్ గృహోపకరణాల విభాగంలోకి ప్రవేశించింది. ఫ్రెంచ్ కంపెనీ గ్రూపె అట్లాంటిక్‌తో పంపిణీ ఒప్పందం చేసుకుని భారత్‌లో హింద్‌వేర్ అట్లాంటిక్ బ్రాండ్‌తో వాటర్ హీటర్లను రూ.4-12 వేల శ్రేణిలో విడుదల చేసింది. పేటెంటెడ్ టెక్నాలజీ ఉన్న ఈ ఉపకరణాలను భారత్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. రూ.1,800 కోట్ల విలువైన వాటర్ హీటర్ల విపణిలో మూడేళ్లలో టాప్-3 స్థానాన్ని హెచ్ఎస్ఐఎల్ లక్ష్యంగా చేసుకుంది. ఈ విభాగం ద్వారా 2018 నుంచి ఏటా రూ.250 కోట్ల ఆదాయం ఆశిస్తోంది. అమ్మకాలు పెరిగితే దేశీయంగా ప్లాంటు ఏర్పాటు చేయాలని ఇరు సంస్థలు నిర్ణయించాయని హెచ్ఎస్ఐఎల్ జాయింట్ ఎండీ సందీప్ సొమానీ శుక్రవారం తెలిపారు. వాటర్ హీటర్లను ఇక్కడి మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా కంజ్యూమర్ బిజినెస్ ప్రెసిడెంట్ రాకేశ్ కౌల్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. గ్రూపె అట్లాంటిక్ ఇతర దేశాల్లో విక్రయిస్తున్న సోలార్ వాటర్ హీటర్లు, రూమ్ హీటర్ల వంటి ఉత్పత్తులను భారత్‌లో ప్రవేశపెట్టే ఆలోచన ఉందన్నారు. హెచ్ఎస్ఐఎల్ గుజరాత్‌లోని దహెజ్ వద్ద 65 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇక్కడ రూ.160 కోట్ల వ్యయంతో 12 లక్షల యూనిట్ల సామర్థ్యం గల శానిటరీవేర్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. కంపెనీకి ఉన్న 2 శానిటరీ ఉత్పత్తుల తయారీ ప్లాంట్ల సామర్థ్యం 38 లక్షల యూనిట్లు. రూ.50 కోట్లతో చేపట్టిన విస్తరణ పూర్తి అయితే ఇది 42 లక్షల యూనిట్లకు చేరుకుంటుంది. -
నిత్యావసరంగా శానిటరీవేర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శానిటరీ వేర్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం హెచ్ఎస్ఐఎల్ 2014-15లో టర్నోవరులో 20 శాతం వద్ధి ఆశిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో టర్నోవరు రూ.1,900 కోట్లు నమోదు చేశామని సంస్థ సీఎండీ ఆర్.కె.సొమానీ తెలిపారు. హింద్‌వేర్ గ్యాలెరియా స్టోర్లను ప్రారంభించేందుకు బుధవారం హైదరాబాద్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు విలాసంగా భావించిన సానిటరీ వేర్ నేడు నిత్యావసరమైందని అన్నారు. ఉత్తమ జీవన ప్రమాణాలను అందరూ కోరుకుంటున్నారు. పట్టణాలకు వలసల జోరుతో శానిటరీ వేర్‌కు గిరాకీ పెరుగుతోందని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ల క్ష్యం కార్యరూపం దాలిస్తే ఈ రంగానికి మంచి రోజులు వస్తాయన్నారు. నిధుల లభ్యత విషయంలో ఆర్బీఐ చొరవకుతోడు బ్యాంకుల సైతం విరివిగా గహ రుణాలు ఇస్తున్నాయి. దేశంలో 2 కోట్ల గహాల కొరత ఉంది. పరిశ్రమకు అపార వ్యాపారావకాశాలు ఉన్నాయి’ అని అన్నారు. ఏటా 8-9 డిజైన్లు..: హెచ్ఎస్ఐఎల్ సుమారు 1,700 రకాల ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఏటా 8-9 డిజైన్లను ప్రవేశపెడుతోంది. ఉత్పత్తుల ధర రూ.1,000 నుంచి ప్రారంభమై రూ.2.25 లక్షల వరకు ఉంది. హింద్‌వేర్ గ్యాలెరియా స్టోర్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 105 ఉన్నాయి. మార్చికల్లా మరో 195 ప్రారంభించనుంది. ఒక్కొక్కటి 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ ఔట్లెట్లలో కంపెనీ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. శానిటరీవేర్‌కు రేటింగ్‌ను ప్రవేశపెట్టిన ఘనత తమదేనని కంపెనీ తెలిపింది. లకాసా పేరుతో డిస్ప్లే స్టోర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే యత్నాల్లో కంపెనీ ఉంది. కొత్త ప్లాంట్లు పెడతాం.. ఈ ఏడాది రెండు ప్లాంట్లను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నామని సీఎండీ చెప్పారు. కంపెనీల కొనుగోలు హెచ్‌ఎస్‌ఐఎల్‌కు నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ప్లాంటు పెట్టేందుకు సిద్ధమని వెల్లడించారు. గుజరాత్లో 12 లక్షల పీసుల వార్షిక సామర్థ్యంతో రూ.100 కోట్లతో నెలకొల్పుతున్న ప్లాంటు రెండేళ్లలో రెడీ అవుతుందన్నారు. దీంతో సంస్థ సామర్థ్యం 50 లక్షల పీసులకు చేరుతుందని వివరించారు. రాజస్థాన్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాసెట్స్ తయారీ ప్లాంటు 2016 చివరికల్లా ప్రారంభం అవుతుందని చెప్పారు. కంపెనీకి హర్యానా, నల్గొండ జిల్లా బీబీనగర్ వద్ద సానిటరీ వేర్ తయారీ ప్లాంట్లున్నాయి. చైనా ఉత్పత్తులతో ముప్పే.. సానిటరీ వేర్ మార్కెట్ పరిమాణం భారత్‌లో వ్యవస్థీకత రంగంలో రూ.3,200 కోట్లకు చేరుకుందని సొమానీ తెలిపారు. ఏటా పరిశ్రమ 15-18 శాతం వద్ధి చెందుతోందని చెప్పారు. చైనా చవక ఉత్పత్తుల ప్రభావం భారత పరిశ్రమపై ప్రభావం చూపిస్తోందని వెల్లడించారు. పోటీ కారణంగా విభిన్న రకాల మోడళ్లు కస్టమర్లకు లభిస్తున్నాయి. ఇక్కడ ప్రధాన విషయమేమంటే ఉత్పత్తుల నాణ్యత విషయంలో భారతీయ కస్టమర్లలో అవగాహన పెరగడం దేశీయ కంపెనీలకు కలిసి వచ్చే అంశమని అన్నారు.