మెదక్ జిల్లాలో హెచ్ఎస్ఐఎల్ మరో రెండు ప్లాంట్లు
♦ 2017 జూన్ నాటికి ఉత్పత్తి ప్రారంభం
♦ హెచ్‌ఎస్‌ఐఎల్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ ప్రెసిడెంట్ మనీష్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శానిటరీ వేర్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం హెచ్‌ఎస్‌ఐఎల్ తెలంగాణలో మరో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. మెదక్ జిల్లాలో రూ.240 కోట్లతో వీటిని నిర్మిస్తోంది. సీపీవీసీ పైపులతోపాటు సెక్యూరిటీ క్యాప్స్, క్లోజర్స్ ఉత్పత్తులను ఈ ప్లాంట్లలో తయారు చేస్తారు. ప్రత్యక్షంగా 200, పరోక్షంగా 1,000 మందికిపైగా ఉపాధి లభించనుంది. 2017 ఏప్రిల్-జూన్‌లో రెండు ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలు మొదలవుతాయని హెచ్‌ఎస్‌ఐఎల్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ ప్రెసిడెంట్ మనీష్ భాటియా బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. పైప్స్ ప్లాంటు అందుబాటులోకి వస్తే బాత్రూం విభాగంలో భారత ఉపఖండంలో పూర్తి స్థాయి ఉత్పత్తులు అందించే ఏకైక కంపెనీగా అవతరిస్తామని చెప్పారు. ఇప్పటికే కంపెనీకి తెలంగాణలో రంగారెడ్డి, నల్గొండలో ప్లాంట్లు ఉన్నాయి.
భారత్‌లో తయారీ...
వాటర్ హీటర్స్, వాటర్ ప్యూరిఫయర్స్, ఎయిర్ ప్యూరిఫయర్స్‌ను ప్రస్తుతం కంపెనీ దిగుమతి చేసుకుంటోంది. వీటి తయారీని దేశీయంగా చేపట్టాలని భావిస్తున్నట్టు మనీష్ వెల్లడించారు. కొద్ది రోజుల్లో కంపెనీ నుంచి ప్రకటన వెలువడనుందని చెప్పారు. హెచ్‌ఎస్‌ఐఎల్ 2015లో ఫాసెట్స్, సానిటరీవేర్ విభాగంలో 174 ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ ఏడాది 200లకుపైగా ఉత్పత్తులను తీసుకు రానుంది. హెచ్‌ఎస్‌ఐఎల్ ఉత్పత్తులు లభించే గ్యాలెరియా ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు దేశవ్యాప్తంగా 150 ఉన్నాయి. మూడేళ్లలో మరో 250 ఔట్‌లెట్లను ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. స్టోర్లు అన్నీ కూడా ఫ్రాంచైజీలు నిర్వహిస్తున్నారు. హింద్‌వేర్ డ్రీమ్ బాత్ యాప్ ద్వారా కస్టమర్లు తమ ఇంటి బాత్రూంను వర్చువల్‌గా డిజైన్ చేసుకోవచ్చు.