ధనుకా అగ్రి- హెచ్‌ఎస్‌ఐఎల్‌ బైబ్యాక్‌ జోష్‌ | Sakshi
Sakshi News home page

ధనుకా అగ్రి- హెచ్‌ఎస్‌ఐఎల్‌ బైబ్యాక్‌ జోష్‌

Published Thu, Sep 17 2020 12:52 PM

Dhanuka agritech- HSIL jumps on Buy back news - Sakshi

 
సరిహద్దువద్ద చైనాతో వివాదాల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 261 పాయింట్లు క్షీణించి 39,042 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా అగ్రికెమికల్స్‌ కంపెనీ ధనుకా అగ్రిటెక్‌, శానిటరీవేర్‌, హోమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రొడక్టుల దిగ్గజం హెచ్‌ఎస్‌ఐఎల్‌ కౌంటర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
 
ధనుకా అగ్రిటెక్‌
షేరుకి రూ. 1,000 ధర మించకుండా సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ధనుకా అగ్రిటెక్ తాజాగా వెల్లడించింది. బైబ్యాక్‌లో భాగంగా 10 లక్షల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. బైబ్యాక్‌కు ఈ నెల 28 రికార్డ్‌ డేట్‌కాగా.. ఇందుకు రూ. 100 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో తొలుత ఈ షేరు ఎన్‌ఎస్ఈలో 9 శాతం దూసుకెళ్లి రూ. 839ను అధిగమించింది. ప్రస్తుతం 6.3 శాతం లాభంతో రూ. 817 వద్ద ట్రేడవుతోంది.

హెచ్‌ఎస్‌ఐఎల్‌ 
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కి ప్రతిపాదించినట్లు హెచ్‌ఎస్‌ఐఎల్‌ తాజాగా వెల్లడించింది. బైబ్యాక్‌ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈ నెల 21న(సోమవారం) బోర్డు సమావేశమవుతున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో తొలుత హెచ్‌ఎస్‌ఐఎల్‌ షేరు ఎన్‌ఎస్ఈలో 11 శాతం జంప్‌చేసి రూ. 75ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 6 శాతం లాభంతో రూ.  72 వద్ద ట్రేడవుతోంది. కాగా.. లాక్‌డవున్‌ల కారణంగా ఈ ఏడాది క్యూ1లో హెచ్‌ఎస్‌ఐఎల్‌ రూ. 17 కోట్ల నికర నష్టం ప్రకటించిన విషయం విదితమే.

Advertisement
 
Advertisement
 
Advertisement