కరోనా ఉన్నా... ఆల్‌టైమ్‌ హైకి.. ఈక్విటీ నిధుల సమీకరణ | Fund Raising Via Equity Issues Jumps 116per cent | Sakshi
Sakshi News home page

కరోనా ఉన్నా... ఆల్‌టైమ్‌ హైకి.. ఈక్విటీ నిధుల సమీకరణ

Published Tue, Dec 29 2020 1:15 AM | Last Updated on Tue, Dec 29 2020 1:15 AM

Fund Raising Via Equity Issues Jumps 116per cent - Sakshi

ముంబై: కరోనా కల్లోలం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థితిగతులను అల్లకల్లోలం  చేసింది. కానీ మన దేశంలో  ప్రైమరీ, సెకండరీ మార్కెట్ల ద్వారా ఈక్విటీ మార్గంలో నిధుల సమీకరణ జోరును ఆపలేకపోయింది. ఈక్విటీ మార్కెట్‌ ద్వారా వివిధ కంపెనీలు ఐపీఓ, ఓఎఫ్‌ఎస్, ఇతర మార్గాల్లో రూ.1.78 లక్షల కోట్లు సమీకరించాయి. ఇప్పటివరకూ ఇదే రికార్డ్‌ స్థాయి. గత ఏడాది సమీకరించిన నిధులు(రూ.82,241 కోట్లు)తో పోల్చితే ఇది 116 శాతం అధికం. 2017లో సమీకరించిన రూ. 1,60,032 కోట్ల నిధుల సమీకరణ రికార్డ్‌ ఈ ఏడాది బద్దలైంది.  ప్రైమ్‌ డేటాబేస్‌ వెల్లడించిన      వివరాల ప్రకారం...

► కంపెనీల ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్లు)ల్లో రిటైల్‌ ఇన్వెస్టర్లు జోరుగా పాల్గొనడం, ఐపీఓకు వచ్చిన కంపెనీలు స్టాక్‌మార్కెట్‌ లిస్టింగ్‌లో భారీ లాభాలు సాధించడం, క్యూఐపీ, ఇన్విట్స్‌/రీట్స్‌ మార్గంలో కంపెనీలు రికార్డ్‌ స్థాయిలో నిధులు సమీకరించడం... ఈ ఏడాది చెప్పుకోదగ్గ విశేషాలు.  

► ఈ ఏడాది ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ రూ.26,611 కోట్లుగా ఉంది. గత ఏడాది 16 కంపెనీలు ఐపీఓకు వచ్చి రూ.12,382 కోట్లు సమీకరించాయి. ఈ ఏడాది 15 కంపెనీలు ఐపీఓల ద్వారా 26,611 కోట్లు సమీకరించాయి. గత ఏడాది ఐపీఓ నిధులతో పోల్చితే  ఇది 115 శాతం అధికం.  

► నిధుల సమీకరణ–ఎఫ్‌పీఓల(ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ద్వారా రూ.15,024 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా రూ.21,458 కోట్లు, క్యూఐపీల ద్వారా రూ.84,501 కోట్లు, ఇన్విట్స్‌/రీట్స్‌ ద్వారా రూ.29,715 కోట్లుగా ఉన్నాయి.  

► బాండ్ల జారీ ద్వారా సమీకరించిన మొత్తం, రూ.7,485 కోట్లను కూడా కలుపుకుంటే ఈక్విటీ మార్కెట్‌ల ద్వారా కంపెనీలు రాబట్టిన మొత్తం నిధులు రూ.1,84,953 కోట్లకు పెరుగుతాయి.  
     ఎస్‌బీఐ కార్డ్స్‌ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.10,341 కోట్లు సమీకరించింది. ఈ ఏడాది ఇదే అతి పెద్ద ఐపీఓ.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement