చిన్నోడి సాయం ఘనం.. | Boy Raised Funds For Corona Victims | Sakshi
Sakshi News home page

చిన్నోడి సాయం ఘనం..

Published Thu, Aug 6 2020 10:53 AM | Last Updated on Thu, Aug 6 2020 10:53 AM

Boy Raised Funds For Corona Victims - Sakshi

సైక్లింగ్‌ చేస్తున్న అనీశ్వర్‌

నెల్లూరు(పొగతోట): ఎదుటివారు కష్టాల్లో ఉంటే కొందరు తట్టుకోలేరు. ఏదో రకంగా  వెంటనే సాయం చేస్తారు. తలపెట్టిన కార్యాన్ని నెరవేరుస్తారు. దీనికి వయసుతో సంబంధం లేదు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాడు ఐదేళ్ల బాలుడు అనీశ్వర్‌. కోవిడ్‌ –19 రిలీఫ్‌ ఫండ్‌ సేకరణ కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. సైక్లింగ్‌ చేసి నిధులు సేకరించారు. బాలుడి తల్లి నెల్లూరు జిల్లా వాసి కావడం విశేషం. 

కోవూరు మండలం యల్లాయపాళేనికి చెందిన వాల్మేటి శేషారెడ్డి, సుజాతమ్మ దంపతుల కూతురు వి.స్నేహ. శేషారెడ్డి ఆర్మీలో 24 ఏళ్లకుపైగా సేవలందించాడు. ఆయన రెండు సంవత్సరాల క్రితం మరణించారు. 
స్నేహను చిత్తూరు నగరంలోని గిరింపేటకు చెందిన కుంచాల అనిల్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. బ్రిటన్‌లోని వారింగటన్‌ సిటీలో ఉంటున్నారు. వారి కుమారుడే అనీశ్వర్‌. 
ఏం చేశాడంటే.. 
తొలుత అనీశ్వర్‌ క్రికెట్‌ ఛాలెంజ్‌ను స్వీకరించాడు. హల్ట న్‌ టీచింగ్‌ హాస్పిటల్‌ ఫౌండేషన్‌ తరఫున క్రికెట్‌ పోటీల్లో పాల్గొన్నాడు. 
వెయ్యి హిట్లు కొట్టి రూ.3 లక్షలు సేకరించి ట్రస్ట్‌కు అందజేశాడు. 
తర్వాత సైక్లింగ్‌పై దృష్టి పెట్టాడు. మే 27వ తేదీన ఐదురుగు స్నేహితులతో కలిసి బృందంగా ఏర్పడి ఇంటి పరిసరాలు, పార్కుల చుట్టూ సైక్లింగ్‌ చేయడం ప్రారంభించాడు. 
దీనికి లిటిల్‌ ఫెడరల్స్‌ అనీష్‌ అండ్‌ ఫ్రెండ్స్‌ అని పేరు పెట్టారు. 
నెలరోజులపాటు సాగిన ఈ ఛాలెంజ్‌లో 4,700 కిలోమీటర్లు సైక్లింగ్‌ చేశారు. దీనిని గివ్‌ ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా విరాళాల కోసం ప్రచారం చేశారు. 
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. రూ.7 లక్షల వరకు సేకరించారు. 
రూ.3 లక్షలను యూకే ప్రభుత్వానికి, రూ.3.70 లక్షలను గివ్‌ ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా సంస్థకు అందజేశామని అనీశ్వర్‌ తల్లిదండ్రులు సాక్షికి తెలిపారు. నిధులను వైద్యుల రక్షణ కోసం వినియోగించాలని కోరామన్నారు. 

వీడియో చూసి.. 
అనీశ్వర్‌ యూకేజీ చదువుతున్నాడు. ఓ రోజు టీవీలో సర్‌ థామస్‌ మూర్‌ (100) అనే వృద్ధుడి వీడియో చూశాడు. 
కోవిడ్‌ బాధితులకు సాయం చేసేందుకు విరాళాలు సేకరించాలని మూర్‌ తన గార్డెన్‌ చుట్టూ సహాయకుడి సాయంతో వంద రౌండ్లు నడవడం చూశాడు. అనీశ్వర్‌ ఆయన్ను స్ఫూర్తిగా తీసుకున్నాడు. 
తాను కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌ కోసం క్రికెట్, సైక్లింగ్‌లో పాల్గొంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. వారు ప్రోత్సహించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement