నల్ల బంగారం జిగేల్! | Coal India interim dividend to make FIIs richer by Rs 1,001 cr | Sakshi
Sakshi News home page

నల్ల బంగారం జిగేల్!

Published Thu, Jan 16 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

నల్ల బంగారం జిగేల్!

నల్ల బంగారం జిగేల్!

కోల్‌కతా: వాటాదారులకు ప్రభుత్వరంగ బొగ్గు దిగ్గజం కోల్ ఇండియా డివిడెండ్ బొనాంజా ప్రకటించింది. మధ్యంతర డివిడెండ్ కింద షేరుకి రూ. 29(290%) చెల్లించేందుకు నిర్ణయించింది. దీంతో 100 షేర్లు కలిగిన వాటాదారుడికి రూ. 1,500 అందనుంది. ఇక ప్రభుత్వానికైతే ఏకంగా రూ. 16,485 కోట్లు లభించనున్నాయి. కంపెనీలో ప్రభుత్వానికి 90% వాటా ఉండటమే దీనికి కారణం. వెరసి ఇందుకు కంపెనీ 18,317 కోట్లు వెచ్చించనుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి(2013-14) ప్రభుత్వం పెట్టుకున్న డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 40,000 కోట్లుకాగా, కోల్ ఇండియా డివిడెండ్ ద్వారా దీనిలో దాదాపు 60% వాటా సమకూరనుండటం గమనించదగ్గ విషయం!

భారీ డివిడెండ్ చెల్లింపుపై దృష్టిపెట్టాల్సిందిగా ప్రభుత్వరంగ సంస్థలపై ఆర్థిక శాఖ తీసుకువచ్చిన ఒత్తిడి దీనికి నేపథ్యమని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, డివిడెండ్ పంపిణీ పన్ను కింద ప్రభుత్వానికి మరో రూ. 3,113 కోట్లు లభించనున్నాయి. డివిడెండ్‌తో కలిపి ప్రభుత్వానికి మొత్తంగా రూ. 19,599 కోట్లు దక్కనున్నాయి. 2013 డిసెంబర్‌కల్లా కంపెనీలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) వాటా 5.47%(34.52 కోట్ల షేర్లు)గా నమోదైంది. దీంతో ఎఫ్‌ఐఐలకు రూ. 1,001 కోట్లు లభిస్తాయి. ఇక బీమా దిగ్గజం ఎల్‌ఐసీకున్న 1.83% వాటాకుగాను రూ. 336 కోట్లు దక్కనున్నాయి.
 
 భారీ నగదు నిల్వలు
 కోల్ ఇండియా వద్ద 2013 మార్చి చివరికల్లా రూ. 62,236 కోట్ల విలువైన నగదు నిల్వలున్నాయి. దీంతో ప్రభుత్వానికి ప్రత్యేక డివిడెండ్ ప్రకటించేం దుకు వీలు కలిగిందని నిపుణులు వ్యాఖ్యానించారు. రూ. 10 ముఖ విలువగల షేరుకి రూ. 29 డివిడెండ్ చెల్లించేందుకు సంస్థ ఆడిట్ కమిటీ ప్రతిపాదించిందని కంపెనీ చైర్మన్ ఎస్.నర్సింగ్‌రావు చెప్పారు. దీనిలో భాగంగా ఈ నెల 25న డివిడెండ్‌ను చె ల్లించనుంది. గతేడాది మధ్యంతర డివిడెండ్ కింద రూ. 9.7ను చెల్లించిన సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో ఇటీవల షేరు ధర లాభపడుతూ వచ్చింది. ఈ బాటలో తాజాగా బీఎస్‌ఈలో 1.8% బలపడి రూ. 295 వద్ద ముగిసింది. మరోవైపు డిజిన్వెస్ట్‌మెంట్‌కింద తొలుత 10% వాటాను విక్రయిం చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందుకు ట్రేడ్ యూనియన్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండటంతో 5% డిజిన్వెస్ట్‌మెంట్‌కు ప్రణాళిక వేస్తోంది. ప్రస్తుత ధర వద్ద ప్రభుత్వానికి 5% వాటా కు రూ. 9,000 కోట్లకుపైగా లభించే అవకాశముంది.
 
 చిదంబరంతో సమావేశం
 పీఎస్‌యూ చైర్మన్లతో బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం సమావేశాన్ని నిర్వహించారు. కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, ఇండియన్ ఆయిల్ తదితర దిగ్గజాల చైర్మన్లు హాజరయ్యారు. ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధించే దిశలో పీఎస్‌యూలు ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించనున్నాయి. ఇందుకు దారిచూపుతూ తొలుత కోల్ ఇండియా భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. దీంతోపాటు ప్రభుత్వం హిందుస్తాన్ జింక్, బాల్కో, యాక్సిస్ బ్యాంక్ తదితర సంస్థలలో వాటాలను సైతం విక్రయించే యోచనలో ఉంది. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మంట్ లక్ష్యం రూ. 40,000 కోట్లుకాగా, ఇప్పటివరకూ ప్రభుత్వం రూ. 3,000 కోట్లను మాత్రమే సమీకరించింది. ఇందుకు ఎంఎంటీసీ, హిందుస్తాన్ కాపర్, నైవేలీ లిగ్నైట్, నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో వాటాలను విక్రయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement