ఇక సర్కారీ షేర్ల జాతర..! | Govt clears Coal India, ONGC, NHPC share sales | Sakshi
Sakshi News home page

ఇక సర్కారీ షేర్ల జాతర..!

Published Wed, Sep 10 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

ఇక సర్కారీ షేర్ల జాతర..!

ఇక సర్కారీ షేర్ల జాతర..!

 న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా దిగ్గజ కంపెనీలు ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీలలో వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) ఇందుకు ఓకే చెప్పింది.

ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ మూడు కంపెనీలలో ప్రతిపాదిత ప్రభుత్వ వాటాలను విక్రయిస్తే రూ. 43,000 కోట్లకుపైగా నిధులు సమకూరనున్నాయి. కోల్ ఇండియాలో ప్రతిపాదిత 10% వాటాకు ప్రస్తుత ధరూ. 374 ప్రకారం రూ. 23,000 కోట్లు లభించనుండగా, ఓఎన్‌జీసీలో 5% వాటాకు ప్రస్తుత మార్కెట్ ధర రూ. 445 ప్రకారం రూ. 18,000 కోట్లు, ప్రస్తుత రూ. 22 ధర ప్రకారం ఎన్‌హెచ్‌పీసీలో 11.36% వాటాకుగాను రూ. 2,800 కోట్లు చొప్పున ప్రభుత్వానికి లభిస్తాయి.

 తద్వారా బడ్జెట్‌లో ప్రతిపాదించినమేరకు ప్రభుత్వం నిధులను సమీకరించగలుగుతుంది. కాగా, ఈ సంస్థలలో వాటాలను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) ద్వారా విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ బాటలో ఇప్పటికే ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ను చేపట్టేందుకు మర్చంట్ బ్యాంకర్ల ఎంపిక ప్రక్రియను సైతం మొదలుపెట్టింది.
 
ఈ నెలలో సెయిల్...
 డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా స్టీల్ రంగ దిగ్గజం సెయిల్‌లో 5% వాటాను విక్రయించేందుకు గత ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. సెయిల్ ఇష్యూని ప్రభుత్వం ఈ నెలలో చేపట్టే అవకాశమున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత మార్కెట్ ధర రూ. 81 ప్రకారం సెయిల్‌లో 5% వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 1,600 కోట్లవరకూ లభించవచ్చు.

కాగా, వరుసగా గత ఐదేళ్లలో ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని చేరడంలో విఫలమవుతూనే వస్తోంది. నిజానికి ప్రతీ బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 40,000 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ 2010-11లో రూ. 22,144 కోట్లు, 2011-12లో రూ. 13,894 కోట్లు చొప్పున మాత్రమే సమీకరించగలిగింది. ఇక 2012-13లో లక్ష్యం రూ. 30,000 కోట్లుకాగా రూ. 23,956 కోట్లు సమకూర్చుకుంది. 2013-14లో రూ. 40,000 కోట్ల ల క్ష్యానికిగాను రూ. 16,027 కోట్లు మాత్రమే సమీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement