ఓఎన్‌జీసీ లాభం 12% అప్
క్యూ4లో రూ.4,416 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీ ఓఎన్‌జీసీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 12 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2014-15) నాలుగో క్వార్టర్‌కు రూ.3,935 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు 12 శాతం వృద్ధితో రూ.4,416 కోట్లకు పెరిగిందని ఓఎన్‌జీసీ తెలిపింది. ఇంపెయిర్‌మెంట్ నష్టాలను రివర్స్ చేయడం, ప్రభుత్వం నుంచి ఇంధన సబ్సిడీ వెనక్కి రావడం తదితర కారణాల వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ సీఎండీ డి.కె. సరాఫ్ చెప్పారు. చమురు ధరల పతనం కారణంగా టర్నోవర్ 24 శాతం క్షీణించి రూ.16,424 కోట్లకు తగ్గిందని తెలిపారు. ప్రభుత్వానికి చెల్లించే ఇంధన సబ్సిడీ రూ.36,300 కోట్ల నుంచి రూ.1,096 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు.
చమురు ధరల పతనం కారణంగా గతంలో రూ.800 కోట్లు ఇంపెయిర్‌మెంట్ నష్టాలు చూపించామని, దీనిని ఇప్పుడు లెక్కల్లోకి తీసుకున్నామని, గతంలో ప్రభుత్వానికి రూ.633 కోట్ల ఇంధన సబ్సిడీని అదనంగా చెల్లించామని, దీనిని కూడా ఇప్పుడు లెక్కలోకి తీసుకున్నామని, డ్రై వెల్ ప్రొవిజనింగ్ లాభాలు రూ.1,585 కోట్లు పొందామని.. వీటన్నింటి కారణంగా గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నికర లాభం పెరిగిందని సరాఫ్ వివరించారు. ముడి చమురు ఉత్పత్తి 1.7 శాత ం క్షీణించి 6.34 మిలియన్ టన్నులకు పడిపోయిందని, గ్యాస్ ఉత్పత్తి 10 శాతం తగ్గి 5.24 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పడిపోయిందని, అయినప్పటికీ, లాభం పెరిగిందని పేర్కొన్నారు.
చమురు ధరలు బాగా పడిపోవడంతో గత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగానికి ఇంధన సబ్సిడీ చెల్లింపుల నుంచి ఓఎన్‌జీసీకి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. దీంతో ఓఎన్‌జీసీ లాభం జోరుగా పెరిగింది. ఇక ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15లో రూ.17,733 కోట్లుగా ఉన్న నికర లాభం 2015-16లో రూ.16,004 కోట్లకు తగ్గిందని తెలిపారు. ఇక టర్నోవర్ రూ.78,569 కోట్ల నుంచి రూ.83,094 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఓఎన్‌జీసీ షేరు 3% లాభంతో రూ.217 వద్ద ముగిసింది.