న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ బొగ్గు రంగంలో కేంద్రం మరిన్ని సంస్కరణలకు తెరతీసింది. ఇకపై వాణిజ్య అవసరాల కోసం బొగ్గును ఉత్పత్తి చేసేందుకు ప్రైవేట్ కంపెనీలకు కూడా కాంట్రాక్టులివ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు సొంత అవసరాల కోసం బొగ్గును ఉత్పత్తి చేయడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో మంగళవారం జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది.
1973లో బొగ్గు రంగాన్ని జాతీయం చేశాక మళ్లీ ఇన్నాళ్లకు ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ఇది బొగ్గు రంగంలో అత్యంత కీలక సంస్కరణ అని సమావేశానంతరం బొగ్గు, రైల్వే శాఖల మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. దీంతో బొగ్గు రంగంలో సమర్ధత మరింత పెరుగుతుందని, గుత్తాధిపత్య (కోల్ ఇండియా) ధోరణులకు చెక్ పెట్టినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. బొగ్గు రంగంలో పోటీతత్వం పెరిగేందుకు, చౌక విద్యుత్ టారిఫ్‌లు సాకారమయ్యేందుకు ఇది దోహదపడగలదని గోయల్ వివరించారు.
‘బొగ్గు రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడాన్ని ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుంది. భారీ పెట్టుబడులు రావడం వల్ల బొగ్గు నిల్వలున్న ప్రాంతాల్లో.. ముఖ్యంగా మైనింగ్ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మందికి ఉపాధి కలుగుతుంది. ఆయా ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుంది‘ అని గోయల్ పేర్కొన్నారు. బొగ్గు గనుల చట్టం (స్పెషల్ ప్రొవిజన్స్) 2015, గనులు.. ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957 కింద బొగ్గు గనులు/బ్లాకుల వేలంలో ఉపయోగించే ప్రక్రియను సీసీఈఏ ఆమోదించినట్లు కేంద్ర బొగ్గు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
పోటీతో కోల్ ఇండియాకూ ప్రయోజనం..
బొగ్గు రంగాన్ని జాతీయం చేసిన అనంతరం బొగ్గు విక్రయించే అధికారాలు ప్రభుత్వ రంగ కోల్ ఇండియాకి (సీఐఎల్) మాత్రమే కట్టబెట్టారు. దేశీయంగా ఉత్పత్తయ్యే మొత్తం బొగ్గులో సీఐఎల్ వాటా 80 శాతం ఉంటుంది. తాజా సంస్కరణలతో కోల్ ఇండియా గుత్తాధిపత్యం తగ్గినప్పటికీ.. ఈ రంగంలో పోటీతత్వం పెరగడం ద్వారా ఆ సంస్థకూ ప్రయోజనం చేకూరగలదని మంత్రి గోయల్ వ్యాఖ్యానించారు. బొగ్గు ఉత్పత్తి దేశీయంగా పెరిగితే దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని.. తద్వారా విలువైన విదేశీ మారక నిల్వలూ కూడా ఆదా చేసుకోవచ్చని ఆయన వివరించారు.
పారదర్శకతకు పెద్ద పీట..
బొగ్గు తవ్వకాల కోసం చిన్న, మధ్య స్థాయి, భారీ స్థాయి గనులన్నింటినీ కూడా ప్రైవేట్ కంపెనీలకు ఆఫర్ చేయడం జరుగుతుందని మంత్రి చెప్పారు. పారదర్శకతకు, సులభతరంగా వ్యాపారాల నిర్వహణ విధానాలకు పెద్ద పీట వేసేలా వేలం ప్రక్రియ ఉంటుందన్నారు. సహజ వనరులు దేశాభివృద్ధికే ఉపయోగపడేలా చూసేందుకు ఇది ఉపయోగపడగలదన్నారు. ఈ సంస్కరణలు బొగ్గు సరఫరాపై ఖచ్చితత్వం.. కేటాయింపుల్లో జవాబుదారీతనం పెరిగేందుకు, చౌకగా బొగ్గు లభ్యతకు దోహదపడగలవని, ఇంధన భద్రత సాధించేందుకు తోడ్పడగలవని గోయల్ పేర్కొన్నారు.
ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తిపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు కంపెనీలు ఎంతెంత అధికంగా చెల్లిస్తాయన్న ప్రాతిపదికన వేలం ఉంటుందని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. ఆయా గనుల నుంచి ఉత్పత్తి చేసే బొగ్గు విక్రయం/వినియోగంపై ఎలాంటి ఆంక్షలు ఉండవని వివరించింది. దేశీయంగా 70 శాతం విద్యుదుత్పత్తి బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచే జరుగుతున్న నేపథ్యంలో ఇంధన భద్రత సాధించేం దుకు ఈ సంస్కరణలు దోహదపడగలవని తెలిపింది.
అయిదు బొగ్గు రాష్ట్రాలకు అత్యధిక లబ్ధి ..
బొగ్గు గనుల వేలం, విక్రయం ద్వారా వచ్చే మొత్తం ఆదాయం అంతా బొగ్గు నిల్వలున్న ఆయా రాష్ట్రాలకే చెందుతుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ఆర్థిక వృద్ధికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సదరు రాష్ట్రాలు ఈ ఆదాయాలను ఉపయోగించుకోవడం ద్వారా లబ్ధి పొందవచ్చని వివరించింది.
ముఖ్యంగా తూర్పు రాష్ట్రాలకు అత్యధికంగా ప్రయోజనం చేకూరగలదని పేర్కొంది. భారత్‌లో 300 బిలియన్ టన్నుల మేర బొగ్గు నిల్వలు ఉన్నాయని అంచనా. వీటిలో అత్యధికంగా నిల్వలు అయిదు రాష్ట్రాల్లో.. పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లకు తాజా సంస్కరణలు ప్రయోజనం చేకూర్చనున్నాయి.
పోంజీ స్కీములపై కొరడా
♦ నిషేధానికి సమగ్ర చట్టం
♦ పథకాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు
♦ ప్రత్యేక బిల్లుకు క్యాబినెట్ ఆమోదం
చిట్టీలు, డిపాజిట్ల పేరుతో సామాన్యులు మోసపోకుండా ఉండేందుకు కేంద్రం రెండు కొత్త బిల్లులు తేనుంది. ఈమేరకు నియంత్రణ లేని డిపాజిట్ల వసూళ్లను నిషేధిస్తూ ప్రతిపాదించిన నూతన బిల్లును కేంద్ర కేబినెట్ మంగళవారం ఇక్కడ ఆమోదించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ‘నియంత్రణ లేని డిపాజిట్ స్కీముల నిషేధ బిల్లు, 2018’, ‘చిట్‌ఫండ్స్(సవరణ) బిల్లు, 2018’ని ఆమోదించింది. అన్‌రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ నిషేధ బిల్లు 2018ని త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.
‘కొన్ని సంస్థలు, కంపెనీలు..నియంత్రణ చట్టాల్లోని లొసుగులను వాడుకుంటూ, మోసపూరిత పథకాలతో సామాన్య ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటున్నాయి. దేశీయంగా ఇలాంటి అక్రమ డిపాజిట్ల సమీకరణ కార్యకలాపాల సమస్యను పరిష్కరించడం ఈ బిల్లు ప్రధానోద్దేశం‘ అని ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి స్కీముల వల్ల మోసపోయే వారిలో అత్యధికులు పేదలు ఉంటున్నారు. నియంత్రణ సంస్థల కంటబడకుండా పోంజీ స్కీములు పలు రాష్ట్రాల్లో విస్తరించి ఉంటున్నాయి.
కఠిన శిక్షలు.. జరిమానాలు: తాజాగా రూపొం దించిన బిల్లు ప్రకారం .. ఇలాంటి అనధికారిక డిపాజిట్ల సమీకరణపై పూర్తి నిషేధం అమల్లోకి రావడంతో పాటు, నిధులు సమీకరించే వారిపై కఠిన శిక్షలు ఉంటాయి. ఒకవేళ డిపాజిట్లు సమీకరించిన సంస్థ మూతబడితే.. ఇన్వెస్టర్లకు సక్రమంగా తిరిగి చెల్లింపులు జరిగేలా చూ సేందుకు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేకంగా అధికార యంత్రాంగాన్ని నియమించాల్సి ఉంటుంది. ఈ బిల్లు ప్రధానంగా మూడు రకాల నేరాలను ప్రస్తావించింది.
అనధికారిక డిపాజిట్ల పథకాల నిర్వహణ, నియంత్రిత డిపాజిట్ స్కీములలో మోసపూరిత డిఫాల్ట్, అనధికారిక డిపాజిట్ పథకాల్లో చేరేలా ప్రేరేపించడం మొదలైన వాటిని నేరాలుగా పరిగణించడం జరుగుతుంది. ఇలాంటి విషయాల్లో కఠిన శిక్షలతో పాటు జరిమానాలు కూడా ఉంటాయి. స్కీము నడిపే సంస్థ గానీ మూతబడితే .. దాని ఆస్తులను అటాచ్ చేసి, డిపాజిటర్లకు తిరిగి చెల్లింపులు జరిపేందుకు స్పష్టమైన గడువు ఉం టుంది. దేశం మొత్తం మీద డిపాజిట్స్ సమీకరణ కార్యకలాపాల వివరాలను సమీకరించేందుకు, దర్యాప్తు సంస్థలతో పంచుకునేందుకు ఆన్‌లైన్ సెంట్రల్ డేటా బేస్ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment