రాష్ట్రంలో 18 శాతం పెరిగిన సైబర్ నేరాలు
గత ఏడాది కాలంలో 24,643 కేసులు నమోదు..
519 తీవ్ర నేరాలకు సంబంధించి 186 మంది అరెస్టు
సైబర్ నేరాల కేసుల్లో టాప్–5 రాష్ట్రాల్లో తెలంగాణ
టీజీసీఎస్‌బీ 2024 నివేదికలో వెల్లడించిన డైరెక్టర్ శిఖాగోయల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలను టార్గెట్‌గా చేసుకుని సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. భారీ స్థాయిలో సొమ్ము దండుకుంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే 2024లో తెలంగాణలో సైబర్ నేరాల ఫిర్యాదులు 18 శాతం పెరిగాయి. నేరస్తులు ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.1,866.9 కోట్లు కొల్లగొట్టడం గమనార్హం. 2024 ఏడాదిలో రాష్ట్రంలో నమోదైన సైబర్ నేరాలు, బాధితులు పోగొట్టుకున్న డబ్బు, కేసుల దర్యాప్తు, నేరస్తుల అరెస్టు, నేరాల కట్టడి కోసం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను డైరెక్టర్ శిఖాగోయల్ సోమవారం వెల్లడించారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ‘తెలంగాణ సైబర్ సెక్యురిటీ బ్యూరో’2024 నివేదికను టీజీసీఎస్‌బీ ఎస్పీ దేవేందర్‌సింగ్, ఇతర అధికారులతో కలిసి శిఖాగోయల్ విడుదల చేశారు. సైబర్ నేరాలకు సంబంధించి 2023లో 91,652 ఫిర్యాదులు రాగా.. 2024లో 1,14,174 ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 519 సైబర్ నేరాలకు సంబంధించి 186 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించి కేసుల నమోదులో దేశంలోని టాప్–5 రాష్ట్రాల్లో రాజస్థాన్, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌లతోపాటు తెలంగాణ కూడా ఉన్నట్టు వెల్లడించారు.
కొత్తగా సైబర్ క్రైం పీఎస్‌లు..
రాష్ట్రంలో సైబర్ నేరాల కట్టడిలో భాగంగా ఈ ఏడాది వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట, రామగుండం, నిజామాబాద్ కమిషనరేట్లలో సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని శిఖా గోయల్ తెలిపారు. సైబర్ నేరాల కట్టడితోపాటు ప్రజలు సైబర్ నేరాల బారినపడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక కానిస్టేబుల్‌కు సైబర్ వారియర్‌గా శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం 850 మంది సైబర్ వారియర్స్ సైబర్ నేరాల దర్యాప్తు, నియంత్రణలో పనిచేస్తున్నట్టు వెల్లడించారు.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 2024 నివేదికలోని ప్రధాన అంశాలివే..
⇒ 2023లో సైబర్ నేరాలకు సంబంధించి 16,339 ఎఫ్‌ఐఆర్‌లు నమోదవగా.. 2024లో 24,643 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
⇒2023లో 1,830 మంది బాధితులకు రూ.8.36 కోట్లు రీఫండ్ చేయగా.. 2024లో 17,411 మంది బాధితులకు రూ.176.71 కోట్లు రీఫండ్ చేయడంలో టీజీసీఎస్‌బీ అధికారులు సఫలీకృతమయ్యారు.
⇒ టీజీసీఎస్‌బీ 186 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసింది. ఈ నిందితులకు టీజీసీఎస్‌బీ పరిధిలోని 94 కేసులతో, రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో 823 కేసులతో, దేశవ్యాప్తంగా 3,637 కేసులతో సంబంధాలు ఉన్నాయి.
⇒ గత ఏడాది కాలంలో టీజీసీఎస్‌బీ 262 పీటీ వారెంట్లు అమలు చేసింది.
⇒టీజీసీఎస్‌బీకి చెందిన సైకాప్స్ టూల్ ద్వారా గుర్తించిన క్రైం లింకులతో దేశవ్యాప్తంగా 1,057 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. పట్టుబడిన నేరస్తులకు దేశవ్యాప్తంగా 1,16,421 కేసులతో సబంధం ఉన్నట్టుగా గుర్తించారు.
5 ప్రధాన సైబర్ నేరాలు
⇒బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్–స్టాక్స్
⇒ పార్ట్‌టైం జాబ్స్
⇒ డిజిటల్ అరెస్టు
⇒నకిలీ కస్టమర్ కేర్
⇒ డెబిట్, క్రెడిట్ కార్డు మోసాలు
Comments
Please login to add a commentAdd a comment