మళ్లీ పెరుగుతున్న మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసాలు
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ
మోసగిస్తున్న సైబర్ మోసగాళ్లు
హెల్ప్‌లైన్ నంబర్ 1930, 8712672222లో ఫిర్యాదు చేయాలన్న సైబర్ పోలీసులు
అనుమానం ఉంటే మాకు సమాచారం ఇవ్వండి: శిఖాగోయల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ మల్టీలెవెల్ మార్కెటింగ్ (పిరమిడ్) మోసాలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గతానికి భిన్నంగా సైబర్ మోసగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటనలు ఇస్తూ అమాయకులకు వల వేస్తున్నారని పేర్కొన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని, మీరే క్రిప్టోకరెన్సీని అమ్మడం ద్వారా లాభాలు పొందొచ్చని.. వ్యవసాయ ఉత్పత్తులు, హెర్బల్, హెల్త్, ఇతర గృహోపకరణ వస్తువుల విక్రయంతో లాభాలు వస్తాయని, అలాగే మరికొందరిని సభ్యులుగా చేరిస్తే కమీషన్లు వస్తాయని ఊదరగొడుతున్నట్టు తెలిపారు.
గతంలో ఇదే తరహాలో ఎంతోమంది నష్టపోయిన విషయాన్ని పోలీసులు గుర్తు చేస్తున్నారు. తాజాగా మరోమారు ఈ మల్టీలెవెల్ మార్కెటింగ్ సైబర్ మోసాలు పెరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు. ఈ తరహా మోసాల బారినపడకుండా, ఒకవేళ సైబర్ మోసగాళ్లకు చిక్కితే ఎలా బయటపడాలి.. అన్న విషయాలపై టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు పలు సూచనలు చేశారు.
ఎలా మోసగిస్తారు.. అప్రమత్తంగా ఎలా ఉండాలి?
⇒ బాగా లాభాలు వస్తాయని, తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించవచ్చని ఆశచూపి ముగ్గులోకి లాగుతారు. వాస్తవానికి ఈ పిరమిడ్‌లో టాప్‌లో (స్కీంలో తొలుత చేరిన వారు) ఉన్న వారికి మాత్రమే లాభాలు వస్తాయి. ఆ తర్వాత చేరిన వారికి లాభాలు లేకపోగా అసలు సొమ్మునే కొల్లగొడతారు.
⇒ మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీంలు నడిపే కీలక సూత్ర« దారులు విదేశాల్లోనే ఉండి ఈ మోసాలు చేస్తుంటారు.
⇒ లగ్జరీ కార్లు, ఫారిన్ టూర్లు, అత్యధిక లాభాలు అని ప్రక టనల్లో ఊదరగొడితే అది పక్కా మోసమని గుర్తించాలి.
⇒ మీకు వచ్చే ప్రకటనల్లో ఉన్న కంపెనీల పేర్లు, వాటి వ్యాపారం గురించి గుడ్డిగా నమ్మకుండా పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
⇒మల్టీలెవెల్ మార్కెటింగ్‌లో ఒకరి ద్వారా మరొకరు చేరుతుంటారు. ఇలాంటి చైన్‌లలో చేరొద్దు. ఆయా కంపెనీలు పెట్టే సభలు, సమావేశాలకు వెళ్లొద్దు.
⇒ మీకు వచ్చే ఎస్‌ఎంఎస్‌లలోని అనుమానాస్పద వెబ్‌లింక్‌లు, ఏపీకే ఫైల్స్‌పై క్లిక్ చేయొద్దు.
⇒ పూర్తి వివరాలు తెలుసుకోకుండానే ఎవరికీ డబ్బులు పంపవద్దు. ఇలా పంపిన సొమ్మును అవతలి వ్యక్తులు దేశవిద్రోహ పనులకు వాడే ప్రమాదం ఉంటుంది.
⇒ ఇలాంటి మోసాలపై కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులను అప్రమత్తం చేయాలి.
కఠిన చర్యలు తీసుకుంటాం..
మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసాలు పెరుగుతున్నాయి. వాస్తవ విరుద్ధంగా.. బాగా లాభాలు వస్తాయని వచ్చే ప్రకటనలు మోసపూరితమైనవని అనుమానించాలి. అనుమానాస్పద మెసేజ్‌లు, మోసపూరిత ప్రకటనలపై వెంటనే సైబర్ క్రైం హెల్ప్‌లైన్ నంబర్ 1930, వాట్సాప్ నంబర్ 8712672222లో ఫిర్యాదు చేయాలి. మీ వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకు ఖాతాల వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. – శిఖాగోయల్, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment