రూ.100 కోట్లు..‘గాడిద పాలు’ | Fraud in Name of Donkey Milk: Telangana | Sakshi
Sakshi News home page

రూ.100 కోట్లు..‘గాడిద పాలు’

Published Sat, Nov 16 2024 3:07 AM | Last Updated on Sat, Nov 16 2024 7:23 AM

Fraud in Name of Donkey Milk: Telangana

గాడిద పాల వ్యాపారం పేరిట ‘ది డాంకీ ప్యాలస్‌’ మోసం  

లీటర్‌ రూ.1,600 చొప్పున కొంటామని మాయమాటలు 

ఫ్రాంచైజీ కోసం లక్షలు ముట్టచెప్పామని బాధిత రైతుల గగ్గోలు 

ఐదు రాష్ట్రాల్లో 400 మంది బాధితులు

ప్రభుత్వాలు న్యాయం చేయాలని వేడుకోలు

సాక్షి, హైదరాబాద్‌: ‘గాడిద పాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. గాడిదల ఫామ్‌ పెట్టుకుంటే మీ నుంచి లీటరు గాడిద పాలను రూ.1,600 చొప్పున మేమే కొంటాం. మంచి లాభాలు ఆర్జించవచ్చు’అని నమ్మించి ది డాంకీ ప్యాలస్‌ సంస్థ ప్రతినిధులు తమను మోసం చేశారని ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన సాయిబాబు, మరికొంత మంది బాధితులు ఆరోపించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా ముక్కడల్‌ గ్రామంలో ‘డాంకీ ప్యాలస్‌’అనే సంస్థ ఉంది.

వీళ్లు గాడిదలు, గాడిద పాల వ్యాపారం చేస్తారు. గాడిద పాలతో లాభాలు ఆర్జించవచ్చని యూట్యూబ్‌లో బాగా ప్రచారం చేశారు. దీనికి ఆకర్షితులైన పలువురు రైతులు ఆ సంస్థ ప్రతినిధులను సంప్రదించారు. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీ తీసుకోవాలనుకునేవారు రూ.5.5 లక్షలు ముందుగా చెల్లించాల్సి ఉంటుందని, ఆపై గాడిదలను తామే కొనుగోలు చేసి ఇస్తామని, ఒక్కో లీటరు పాలకు రూ.1,600 చొప్పున చెల్లిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. గాడిదలను గుజరాత్‌ నుంచి కొనుగోలు చేయడానికి ఒక్కోదానికి రూ.70 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని వివరించారు.

ఇదిలా ఉండగా ప్రారంభ సమయంలో కొందరికి 2023 జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు సక్రమంగానే పాలకు సంబంధించిన బిల్లులు చెల్లించారు. దీంతో ఈ వ్యాపారం బాగుందని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన 400 మందికి పైగా రైతులు ఫ్రాంచైజీలు తీసుకున్నారు. దీంతో డాంకీ ప్యాలస్‌ సంస్థ ప్రతినిధులు ఒకొక్కరి నుంచి రూ.20 లక్షలు మొదలు రూ.70 లక్షల వరకు కట్టించుకున్నారు.  

బిల్లుల చెల్లింపులో జాప్యం.. ఆపై బెదిరింపులు 
మొదట్లో బాగానే ఉన్నా.. గత 18 నెలల నుంచి పాల బిల్లుల చెల్లింపులో జాప్యం మొదలైంది. బిల్లులు అడిగితే సంస్థ ప్రతినిధులు బెదిరింపులకు దిగడం మొదలు పెట్టారు. దీంతో తిరునెలవేలి జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీలను కలసి ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. తమ ఫిర్యాదు మేరకు పోలీసులు డాంకీ ప్యాలస్‌ ప్రతినిధులను గట్టిగా హెచ్చరించారని, రైతులకు న్యాయం చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని వెల్లడించారు.

దీంతో డాంకీ ప్యాలస్‌ ప్రతినిధులు దాదాపు 200 మంది రైతులను వాట్సాప్‌ గ్రూపుల్లో బెదిరించారని చెప్పారు. తమకు రాజకీయంగా పలుకుబడి ఉందని, మీరేం చేయలేరని, చంపేస్తామని మెస్సేజ్‌లు పెట్టారని బాధితులు వాపోయారు. తామంతా సుమారు రూ.100 కోట్ల వరకు మోసపోయామని పేర్కొన్నారు. కాగా, ఏడాది క్రితం రూ.10 కోట్ల చెక్కు యూరప్‌ నుంచి వచి్చందని, ఆ డబ్బులు రాగానే అందరికి చెల్లింపులు చేస్తామని చెప్పారని వెల్లడించారు.

చాలా మందికి చెక్కులు ఇచ్చారని, అయితే తమ బ్యాంకు ఖాతాల్లో చెక్‌లను డిపాజిట్‌ చేస్తే బౌన్స్‌ అయ్యాయని తెలిపారు. తమకు న్యాయం చేయాలని ఏపీ మంత్రి లోకేశ్‌కు వినతి పత్రం ఇచ్చామని, తమ బాధలను కేటీఆర్‌ ట్విట్టర్‌లో చూసి స్పందించారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్‌లు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.

ఆదుకోకుంటే.. ఆత్మహత్యే శరణ్యం  
మేం రైతులం. పాలు అమ్ముకుని బతుకుదాం అనుకున్నాం. రూ.30 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాం. డాంకీ ప్యాలస్‌ వాళ్లు మోసం చేశారు. రూ.లక్షలు పెట్టి గుజరాత్‌లో కొనుగోలు చేసిన వందలాది గాడిదలను మేపలేక వదిలేస్తున్నాం. అవి చచి్చపోతున్నాయి. చేసిన అప్పులు తీర్చడానికి మాకు వేరే దిక్కులేదు. ప్రభుత్వాలు ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్నాం. - తేజస్విని, బాధితురాలు, అనంతపురం (ఏపీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement