సెన్సెక్స్ 184 పాయింట్లు లాస్
Published Mon, Mar 27 2017 4:19 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
ముంబై : బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, రుతుపవనాలపై వస్తున్న నిరాశజనకమైన అంచనాలతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 184.25 పాయింట్లు పడిపోయిన బీఎస్ఈ సెన్సెక్స్ 29,237.15 వద్ద, 62.80 పాయింట్ల నష్టంలో 9045.20 వద్ద నిఫ్టీ క్లోజయ్యాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొద్దామనుకున్న హెల్త్ కేర్ బిల్లుపై ఆయనకు ఎదురుదెబ్బ తగలడంతో డాలర్ ఇండెక్స్ ఢమాల్ మంటోంది. డాలర్ పడిపోతుండటంతో బంగారం పైపైకి ఎగుస్తోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 108.00 పైకి ఎగిసి రూ.28,901 వద్ద ట్రేడయ్యాయి.
డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా ఏడాదిన్నర గరిష్ట స్థాయిలకు ఎగిసింది. 34 పైసల లాభంతో 65.08 వద్ద ముగిసింది. బలహీనమైన గ్లోబల్ సంకేతాలు, నిరాశజనకమైన రుతుపవనాలు అంచనాలకు తోడు లాభాల స్వీకరణ కూడా మార్కెట్లకు దెబ్బకొట్టింది. మెటల్, టెక్, ఐటీ, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ, ఆటో సూచీలు నష్టాల్లో నడిచాయి. కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, హీరో మోటార్ కార్పొరేషన్, ఏసియన్ పేయింట్స్, టాటా మోటార్స్, విప్రో, లుపిన్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్ నేటి ట్రేడింగ్ మేజర్ లూజర్లుగా 2.37 శాతం వరకు నష్టపోయాయి.
Advertisement