దినదిన గండం
సాక్షి ప్రతినిధి, కడప: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో బొగ్గు సంక్షోభం తీవ్రతరమైంది. ఏడాదిగా ఇదే పరిస్థితి ఉన్నా కోల్ ఇండియా నుంచి ఆశించిన ఫలితం లేదు. సింగరేణి కాలరీస్ సవతి ప్రేమ చూపుతోంది. వెరసి ఆర్టీపీపీ పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లుగా తయారైంది. 1050 మెగా యూనిట్ల సామర్థ్యం స్థానంలో కేవలం 360 మెగా యూనిట్ల ఉత్పత్తితో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కాంతులు వెదజల్లాల్సిన చోట మబ్బులు కమ్ముకుంటున్నాయి.
రాయలసీమ ప్రాంతానికి తలమానికంగా నిలుస్తున్న ఆర్టీపీపీలో ఉత్పత్తికి తగ్గట్టు బొగ్గు సరఫరా లేదు. సింగరేణి కాలరీస్ యాజమాన్యం నిరంకుశ వైఖరి కారణంగా రెండు యూనిట్లను నిలిపివేయాల్సి వచ్చింది. పరిస్థితి ఏడాదిగా ఇలాగే ఉన్నా జెన్‌కో యంత్రాంగం చోద్యం చూస్తోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీపీపీ ఐదు యూనిట్లలో 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా, అవసరం మేరకు బొగ్గు నిల్వలు లేని కారణంగా గణనీయంగా విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది.
ఐదు యూనిట్ల పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి సాధించాలంటే 15 వేల టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం బొగ్గులేని కారణంగా 2, 3 యూనిట్లను నిలిపివేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రేక్ బొగ్గు మాత్రమే ఆదివారం సాయంత్రం చేరినట్లు సమాచారం. ప్రస్తుతం 1, 4, 5 యూనిట్లు మాత్రమే రన్నింగ్‌లో ఉన్నాయి. అది కూడా అతి తక్కువ సామర్థ్యంలో నడుస్తున్నాయి. ఏ కారణంతోనైనా ప్రతిరోజు బొగ్గు రేక్‌లు రాకపోతే ఆర్టీపీపీలో ఆ కాస్త ఉత్పత్తి సైతం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఆర్టీపీపీకి బొగ్గు గండం ఏర్పడి దాదాపు ఏడాదిగా ఇదే పరిస్థితి ఉన్నా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంలో జెన్‌కో యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలున్నాయి.
సింగరేణి నిర్లక్ష్యంపై చర్యలేవి?
సింగరేణి కాలరీస్ యాజమాన్యం నుంచి 2030 వరకూ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా చేయాలనే ఒప్పందం ఉంది. రాష్ట్ర విభజన నాటినుంచి ఇప్పటి వరకూ అక్కడి నుంచి మోతాదు మేరకు సరఫరా లేకుండా పోయిందని ఆర్టీపీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. జెన్‌కోకు ఉన్న ఒప్పందం ప్రకారం ఆర్టీపీపీకి ప్రతి ఏడాది 38.8 లక్షల టన్నులు బొగ్గు సరఫరా చేయాల్సి ఉంది. ప్రతి నెల సుమారు లక్షల టన్నులు పైబడి కోత విధిస్తున్నారు. ఇప్పుడా పరిస్థితి మరింత అధికమైనట్లు సమాచారం. రాయలసీమకు విద్యుత్ కాంతులు వెదజల్లే ఆర్టీపీపీ సైతం అంధకారంతో మగ్గాల్సిన రోజులు దాపురించాయి. గత నెలరోజులుగా ఆర్టీపీపీలో 1050 మెగావాట్ల పూర్తి సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి కావడంలేదు. ఆదివారం కేవలం 360 మెగావాట్లతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గత కొంతకాలంగా ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ, ఒప్పందం మేరకు బొగ్గు సరఫరా చేయాలని సింగరేణి యాజమాన్యంపై జెన్‌కో ఉన్నతాధికారులు ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి.
పతిరోజు ఐదు రేక్‌లు బొగ్గు ఆర్టీపీపీకి దిగుమతి కావాల్సి ఉంది. అంటే ప్రతిరోజు 18వేల టన్నులు సరఫరా కావాలి. అయితే ప్రస్తుతం రెండు రేక్‌లు మాత్రమే సరఫరా అవుతోంది. అది కాస్తా ఆదివారం ఒక్క రేక్‌తోనే సరిపెట్టారు. ఇంతటి విపత్కర పరిస్థితులు మునుపెన్నడూ ఎదుర్కోలేదని ఆర్టీపీపీ అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్టీపీపీలో బొగ్గు కొరత గత కొన్ని నెలలుగా పట్టిపీడిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. దీంతో ఆర్టీపీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
కేంద్ర ప్రభుత్వం స్పందిస్తేనే....
ఆర్టీపీపీకి బొగ్గుకొరత విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్పా, బొగ్గు దిగుమతిలో మార్పు కనిపించే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కోల్ ఇండియా స్పందిస్తేనే థర్మల్ పవర్ ప్లాంట్ల మనుగడ సాధ్యమవుతుందని నిపుణులు వివరిస్తున్నారు. జలవిద్యుత్ ఉత్పత్తికి క్లిష ్టపరిస్థితులు ఉన్నప్పటికీ, జెన్‌కో ద్వారా ఉన్న అవకాశాన్ని సైతం వినియోగించుకోలేని దుస్థితి ఆంధ్రప్రదేశ్‌కు నెలకొంది. ఈ పరిస్థితులనుంచి గట్టెక్కాలంటే అవసరమైన బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు స్పందించడం అవసరం.