న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్ల నడకను ఈ వారం పలు అంశాలు ప్రభావితం చేయనున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్ ఫలితాల సీజన్ ఊపందుకుంది. జనవరి–మార్చి(క్యూ4) ఫలితాలతోపాటు పూర్తి ఏడాది(2022–23)కి లిస్టెడ్ కంపెనీలు పనితీరును వెల్లడిస్తున్నాయి. వీటికితోడు విదేశీ స్టాక్ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు సైతం దేశీయంగా ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ వారం పలు దిగ్గజాలు ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్నాయి. జాబితాలో ఏషియన్ పెయింట్స్, అపోలో టైర్స్ సిప్లా, ఐషర్ మోటార్స్, ఎల్‌అండ్‌టీ, యూపీఎల్, టాటా మోటార్స్ తదితరాలున్నాయి.
కోల్ ఇండియా వీక్
వారాంతాన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా క్యూ4 ఫలితాలు ప్రకటించాయి. యూనియన్ బ్యాంక్ లాభం 81 శాతం జంప్‌చేయగా.. కోల్ ఇండియా లాభం 18 శాతం క్షీణించింది. దీంతో నేడు(సోమవారం) ఈ కౌంటర్లపై ఫలితాల ప్రభావం కనిపించనున్నట్లు స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ బాటలో కెనరా బ్యాంక్, యూపీఎల్(8న), లుపిన్(9న), బాష్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎల్‌అండ్‌టీ(10న), ఏషియన్ పెయింట్స్, సీమెన్స్(11న), సిప్లా, హెచ్‌పీసీఎల్, టాటా మోటార్స్(12న) పనితీరు వెల్లడించనున్నాయి.
ఆర్థిక గణాంకాలు
మార్చి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), తయారీ రంగ గణాంకాలతోపాటు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు 12న విడుదలకానున్నాయి. ఏప్రిల్ నెలకు 10న యూఎస్, 11న చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు తెలియరానున్నాయి. కాగా.. 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు 13న వెలువడనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీసహా పలు ప్రధాన పార్టీలు పోటీపడుతుండటంతో ఫలితాలకు ప్రాధాన్యమున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్పంగా 58 పాయింట్లు నీరసించి 61,112 వద్ద నిలవగా.. నిఫ్టీ 4 పాయింట్ల నామమాత్ర లాభంతో 18,069 వద్ద ముగిసింది. అయితే చిన్న షేర్లకు డిమాండ్ పుట్టడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.3 శాత చొప్పున బలపడ్డాయి.
ఇతర అంశాలు
ఇటీవల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌పట్ల ఆసక్తిని చూపుతున్నారు. ఏప్రిల్ 26– మే 5 మధ్య కాలంలో ఎఫ్‌పీఐలు రూ. 11,700 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు వీకే విజయకుమార్ తెలియజేశారు. దీంతో ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఇకపై కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. వీటికితోడు ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం సెంటిమెంటును ప్రభావితంచేయనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ విశ్లేషకులు ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు.
ఫలితాలు, గ్లోబల్ ట్రెండ్ కీలకం
Published Mon, May 8 2023 5:16 AM | Last Updated on Mon, May 8 2023 6:05 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment