జూమ్ ద్వారా ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వర్
సీతంపేట (విశాఖ ఉత్తర): బొగ్గు కృత్రిమ కొరత వెనుక కోల్ ఇండియాను ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. స్థానిక ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ‘బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభం’ అంశంపై శనివారం నిర్వహించిన సదస్సులో నాగేశ్వర్ జూమ్ ద్వారా ప్రసంగించారు. కోల్ ఇండియాను ప్రైవేటీకరించేందుకు బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదన్నారు. బొగ్గు సంక్షోభం విద్యుత్ చార్జీలు పెరగడానికి దారి తీస్తుందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకపోవడం, కోల్ ఇండియాకు బొగ్గు బ్లాకులు కేటాయించకపోవడం వెనుక వాటిని అమ్మాలన్న ఆలోచన దాగుందన్నారు.
బొగ్గు నిల్వల్లో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న మన దేశంలో బొగ్గు సమస్య ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కోల్ ఇండియా విస్తరణ కంటే దాని నిర్వీర్యానికే చర్యలు చేపడుతున్నట్టు ఉందన్నారు. విశ్రాంత ఐఏఎస్ ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి దూరదృష్టి ప్రణాళిక లేకపోవడమే బొగ్గు సమస్యకు కారణమన్నారు. ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించి ఏపీ జెన్‌కో సామర్థ్యాన్ని తగ్గిస్తూ వస్తోందన్నారు.
రాయితీలు పొందిన ప్రైవేటు కంపెనీలు ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి విద్యుత్ కేటాయించకుండా.. ఇతర రాష్ట్రాల్లో అధిక ధరలకు అమ్ముకుంటున్నా వాటిపై రాష్ట్ర ప్రభుత్వం జరిమానా వేయకపోవడం విచారకరమన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు పెంచడం ద్వారా ప్రైవేటు కంపెనీలు లాభపడేందుకు బొగ్గు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని విమర్శించారు. సీపీఎం నగర కార్యదర్శి బి.గంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజ శర్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment