
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫారమ్ ఎక్స్(X Plat Form) భారత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలకు దిగింది. చట్టాలకు విరుద్ధంగా తమ కంటెంట్‌ను నియంత్రించాలని చూస్తోందని, ఏకపక్షంగా సెన్షార్‌షిఫ్‌నకు పాల్పడుతోందని.. ఇది యూజర్ల స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని కోర్టుకెక్కింది. అయితే ఈ పరిణామంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది.
ఈ వ్యవహారంలో ప్రభుత్వం తగిన రీతిలో స్పందిస్తుంది.. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ తప్పనిసరిగా చట్టాన్ని గౌరవించాల్సిందే అని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం(Indian Government)పై కర్ణాటక హైకోర్టులో ఎక్స్(పూర్వపు ట్విట్టర్) రిట్ పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ ఎం నాగప్రసన్న బెంచ్ ఈ పిటిషన్‌ను విచారణ జరుపుతోంది.
ఐటీ యాక్ట్-2000 సెక్షన్ 79(3)(b) ప్రకారం.. కేంద్రం సేఫ్ హార్బర్ (Safe Harbor Provision) అనే నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ప్రభుత్వం కోరిన సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లు తప్పనిసరిగా బ్లాక్ చేయడమో లేదంటే తొలగించడమో చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో సదరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ న్యాయపరమైన రక్షణ కోల్పోతుంది. అయితే.. ఈ సెక్షన్‌ను సవాల్ చేస్తూ ‘ఎక్స్’ కర్ణాటక ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
భారతదేశంలో సరైన చట్టపరమైన విధానాలతో కాకుండా.. ఆన్‌లైన్‌లో కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి చట్టవిరుద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని X ఆ రిట్ పిటిషన్‌లో ఆరోపించింది. కంటెంట్‌ను బ్లాక్ చేసే అంశంపై ఐటీ యాక్ట్‌లోని 69(A) సెక్షన్ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని, అది ఏయే సందర్భాల్లో అనే అంశంపైనా శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు(2015లో)ను సైతం ఎక్స్ గుర్తు చేసింది. అయితే..
69(A) సెక్షన్ కింద కాకుండా.. స్పష్టమైన నిబంధనలు లేని సెక్షన్ 79(3)(b)తో కంటెంట్‌ను నియంత్రించాలని ప్రభుత్వం చూస్తోందని.. ఈ సెక్షన్ ద్వారా కంటెంట్ బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని ఎక్స్ అంటోంది. సాక్ష్యాలుగా 2024 ఫిబ్రవరిలో రైల్వే శాఖ పంపిన ‘బ్లాకింగ్ ఆదేశాలను’ కోర్టుకు చూపించింది. ఇది తమ వ్యాపార లావాదేవీలను దెబ్బ తీయడమే అవుతుందన్న ఎక్స్.. పైగా ఇలాంటి చర్యలు యూజర్ల స్వేచ్ఛను హరించడం అవుతుందని వాదించింది.
అంతేకాదు.. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నడిపించే సహయోగ్ పోర్ట్‌లో తమను చేరాలంటూ ప్రభుత్వం బలవంత పెడుతోందని ఆరోపించింది. అయితే.. తాము 2021 భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన ఐటీ మార్గదర్శకాలను పాటిస్తున్నామన్న ఎక్స్.. ఇప్పటివరకైతే ప్రభుత్వం తమపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోలేదని కోర్టుకు తెలిపింది.
శ్రేయా సింఘాల్ కేసులో..
సోషల్‌మీడియా వేదికల్లో చట్టవిరుద్ధ, ప్రమాదకర కంటెంట్‌ను పోస్ట్ చేసిన వారిని సెక్షన్ 66ఏ కింద అరెస్టు చేసేందుకు వీలుండేది. ఈ సెక్షన్ ప్రకారం.. నిందితులకు మూడేళ్ల వరకు జైలుశిక్ష విధించొచ్చు. అయితే పలు రాష్ట్రాల్లో ఈ సెక్షన్‌ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. 2015లో దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ విచారణ సందర్భంగా సెక్షన్ 66ఏను రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment