ఐదు పాక్‌ యుద్ధ విమానాలు కూల్చేశాం  | India Air Force Chief Big Reveal On Operation Sindoor, Check Highlights And Attack Details | Sakshi
Sakshi News home page

ఐదు పాక్‌ యుద్ధ విమానాలు కూల్చేశాం 

Aug 9 2025 3:05 PM | Updated on Aug 10 2025 6:29 AM

India Air Force chief big reveal On operation sindoor

మరోభారీ విమానాన్ని సైతం పడగొట్టాం  

ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌ వైమానిక దళానికి భారీ దెబ్బ  

మాపై ఎలాంటి ఒత్తిళ్లు రాలేదు.. ఆంక్షల్లేవు  

లక్ష్యం నెరవేరింది కాబట్టే ఆపరేషన్‌ ముగించాం  

భారత్‌ వైపు కన్నెత్తి చూస్తే ఏం జరుగుతుందో ఉగ్రవాదులకు అర్థమైంది  

ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌ వెల్లడి

బెంగళూరు:  పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో పాకిస్తాన్‌ వైమానిక దళాన్ని భారీగా దెబ్బకొట్టామని భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌ వెల్లడించారు. ఆ ఆపరేషన్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలు, మరో భారీ విమానాన్ని కూల్చివేశామని ప్రకటించారు. మన సైన్యం ఇప్పటిదాకా ఉపరితలం నుంచి ఉపరితలానికి చేసిన నమోదిత దాడుల్లో ఇది అతిపెద్ద దాడి అని పేర్కొన్నారు. 


శనివారం బెంగళూరులో 16వ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎల్‌.ఎం.కాట్రే స్మారక ప్రసంగంలో అమర్‌ప్రీత్‌ సింగ్‌ మాట్లాడారు. ఆపరేషన్‌ సిందూర్‌పై వివరాలు పంచుకున్నారు. ఆ ఆపరేషన్‌లో పాకిస్తాన్‌పై జరిగిన నష్టంపై భారత సైనికాధికారి బహిరంగంగా ప్రకటన చేయడం ఇదే మొదటిసారి.  తొమ్మిది పాక్‌ ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన శాటిలైట్‌ చిత్రాలను అమర్‌ప్రీత్‌ సింగ్‌ ప్రదర్శించారు. దాడికి ముందు, దాడి తర్వాత దృశ్యాలు ఇందులో ఉన్నాయి. పాకిస్తాన్‌ చెబుతున్నట్లుగా సాధారణ జనావాసాలపై, పౌరులపై దాడి చేయలేదని స్పష్టంచేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...    

‘‘పటిష్టమైన ప్రణాళికతో ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించాం. 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం అలవోకగా ఛేదించాం. దాదాపు 90 గంటల వ్యవధిలోనే అనుకున్న లక్ష్యం సాధించి, ప్రత్యర్థి దేశాన్ని భారీగా నష్టపరిచాం. పాకిస్తాన్‌కు చెందిన రెండు వైమానిక స్థావరాలు సైతం ధ్వంసం చేశాం. భారత ఎస్‌–400 గగనతల రక్షణ వ్యవస్థ, డ్రోన్‌ వ్యవస్థలు సమర్థవంతంగా పని చేశాయి. పాక్‌ సైన్యం ప్రయోగించిన మానవ రహిత వైమానిక వాహనాలు(యూఏవీ), డ్రోన్లను కూల్చివేశాం. వాటిలో చాలావరకు మన భూభాగంలో పడి పోయాయి. కొన్ని క్షిపణులను సైతం తుత్తునియలు చేసి మన సత్తా చాటాం.   

కాళ్లబేరానికి వచ్చిన పాక్‌  
ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాక్‌ సైనిక స్థావరాలపై దృష్టి పెట్టి, క్షిపణులతో దాడికి దిగాం. జకోబాబాద్‌ ఎయిర్‌బేస్‌లో కనీసం ఒక ఏడబ్ల్యూసీ విమానంతోపాటు ఎఫ్‌–16 యుద్ధ విమానాలను పార్క్‌ చేసిన హ్యాంగర్‌ సగం వరకు నామరూపాల్లేకుండా పోయింది. అమెరికా ఇచ్చిన ఎఫ్‌–16లు చాలావరకు దెబ్బతిన్నాయి. రెండు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలు కూడా ధ్వంసమయ్యాయి. సర్గోధా ఎయిర్‌బేస్‌ను సైతం నేలమట్టం చేశాం. 

పదవీ విరమణ కంటే ముందే ఈ ఎయిర్‌బేస్‌పై దాడి చేసే అవకాశం రావడం సంతోషకరం. సుకుర్‌ ఎయిర్‌బేస్‌లో యూఏబీ హ్యాంగర్‌తోపాటు రాడార్‌ సైట్‌పై దాడి చేశాం. మరింత నష్టం జరిగే ప్రమాదం కనిపించడంతో పాకిస్తాన్‌ కాళ్లబేరానికి వచ్చింది. దాడులు ఆపాలంటూ ఫోన్‌చేసి అభ్యరి్థంచింది. కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసింది. మన దాడిలో దెబ్బతిన్న పాక్‌ ఎయిర్‌బేస్‌లు ఎప్పటికీ వినియోగంలోకి రావు. వాటికి మరమ్మతు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యాలో తయారైన ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ మనకు ఎంతగానో తోడ్పడింది. ఇదొక గేమ్‌ ఛేంజర్‌ అని చెప్పొచ్చు.  

మాకు పూర్తి స్వేచ్ఛ లభించింది  
పాక్‌ ముష్కరులపై ఆపరేషన్‌ విషయంలో సైన్యంపై రాజకీయపరమైన ఒత్తిళ్లేవీ రాలేదు. దాడులకు ప్రణాళిక రచించి, అమలు చేయడానికి మాకు పూర్తి స్వేచ్ఛ లభించింది. ఆపరేషన్‌ సిందూర్‌ విజయానికి మన ప్రభుత్వ పట్టుదల కూడా కారణమే. మాకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఒత్తిళ్లు లేవు, ఆంక్షలు విధించలేదు. మేము ఏవైనా నియంత్రణలు పాటించి ఉంటే అవి సొంతంగా పాటించినవే. పాక్‌ ఉగ్రవాదులను భారీగా దెబ్బకొట్టాలన్న లక్ష్యంతోనే పనిచేశాం. మన శక్తి
సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పాం.    

‘ఇంకా చావగొట్టాలి’ అన్నారు  
పాకిస్తాన్‌పై ఆపరేషన్‌ను త్వరగా ముగించడంపై రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి. వాస్తవం ఏమిటో చెప్పుకోవాలి. మా ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉగ్రవాదులకు మర్చిపోలేని గుణపాఠం చెప్పాలన్నదే మా లక్ష్యం. భారత్‌పై మళ్లీ దాడికి దిగితే ఏం జరుగుతుందో వారికి తెలిసిరావాలి. ఆపరేషన్‌ సిందూర్‌తో ఆ లక్ష్యం నెరవేరింది. భారత్‌ వైపు కన్నెత్తి చూస్తే ఎంత మూల్యం చెల్లించాలో ముష్కరులకు అర్థమైంది. లక్ష్యం నెరవేరింది కాబట్టి దాడులు ఆపేశాం. ఆపరేషన్‌ ముగించిన రోజు చాలామంది మాట్లాడారు. నాకు సన్నిహితులైనవారు మాట్లాడుతూ.. ‘ఇంకా చావగొట్టాలి’ అన్నారు. అనుకున్నది సాధించిన తర్వాత కూడా దాడులు కొనసాగించడంలో అర్థం లేదు.   

‘బాలాకోట్‌’పై ఒప్పించలేకపోయాం  
పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలన్న ధ్యేయంతో బాలాకోట్‌లో భీకర దాడులు చేశాం. వైమానిక దాడులతో పాక్‌ సైనిక శిబిరాలను నేలమట్టం చేశాం. బాలాకోట్‌ దాడికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు అందుబాటులో లేవు. అవి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. విమర్శలకు తావిచ్చింది. మేము ఏం సాధించామో ప్రజలకు చెప్పలేకపోవడం నిజంగా దురదృష్టకరం. బాలాకోట్‌ దాడులతో పాకిస్తాన్‌కు పెద్ద నష్టం జరిగినట్లు నిఘా సమాచారం ఉంది. ఈ దాడుల్లో ఎంతోమంది ఉగ్రవాదులు హతమయ్యారు. కానీ, ఆ విషయంలో ప్రజలను నమ్మించలేకపోయాం. కానీ, ఆపరేషన్‌ సిందూర్‌ విషయంలో మేము అదృష్టవంతులమే. ఎందుకంటే వీడియోలు, ఫొటోలు ఉన్నాయి. ఈ ఆపరేషన్‌లో మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ది అత్యంత కీలక పాత్ర. సైనిక దళాలను, ఇతర సంస్థలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. ఏ యుద్ధంలోనైనా తొలుత గగనతల దాడులే ముఖ్యమని ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా మరోసారి తేటతెల్లమైంది’’ అని అమర్‌ప్రీత్‌ సింగ్‌ వివరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement