సర్కారీ షేర్లొస్తున్నాయ్.! | The Stock Market's Shock is Surprising | Sakshi
Sakshi News home page

సర్కారీ షేర్లొస్తున్నాయ్.!

Published Thu, Jan 29 2015 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

సర్కారీ షేర్లొస్తున్నాయ్.!

సర్కారీ షేర్లొస్తున్నాయ్.!

కోల్ ఇండియాలో రేపు 10% వాటా విక్రయం
కేంద్ర ప్రభుత్వానికి రూ.24,000 కోట్లు లభించే చాన్స్...
రిటైలర్లకు 20% షేర్ల కేటాయింపు;  బిడ్డింగ్ ధరలో 5% డిస్కౌంట్ కూడా..
మార్చిలోపే ఓఎన్‌జీసీలో డిజిన్వెస్ట్‌మెంట్

న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లో ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల షేర్లు వెల్లువెత్తనున్నాయి.

ఈ ఏడాది పీఎస్‌యూల్లో వాటా విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్) లక్ష్యానికి మరో 60 రోజులే వ్యవధి ఉండటంతో కేంద్ర ప్రభుత్వం జోరు పెంచుతోంది. ప్రధానంగా బడా కంపెనీలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా జనవరి 30న(రేపు) బొగ్గు దిగ్గజం కోల్ ఇండియాలో 10 శాతం వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించింది.

ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) రూపంలో నేరుగా స్టాక్ మార్కెట్లో షేర్లను వేలం ప్రక్రియ ద్వారా విక్రయించనున్నట్లు కోల్ ఇండియా స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించిన సమాచారంలో పేర్కొంది. 30న స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకూ(ఉదయం 9.15 నుంచి సాయంత్రం 3.30) షేర్ల విక్రయం జరుగుతుందని తెలిపింది.  బుధవారం కంపెనీ షేరు ధర బీఎస్‌ఈలో స్వల్ప లాభంతో రూ.384 వద్ద ముగిసింది. దీనిప్రకారం చూస్తే కేంద్ర ఖజానాకు రూ.24,257 కోట్లు లభిస్తాయని అంచనా.
 
అమ్మకానికి 63.17 కోట్ల షేర్లు...
ప్రస్తుతం కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వానికి 89.65 శాతం వాటా ఉంది. ఓఎఫ్‌ఎస్ ద్వారా 10 శాతానికి సమానమైన 63.17 కోట్ల షేర్లను విక్రయానికి పెడుతోంది. తొలుత 5 శాతం వాటా, మరో 5 శాతాన్ని అదనంగా విక్రయించే ఆప్షన్‌తో ఓఎఫ్‌ఎస్ ఉంటుంది. ఈ మొత్తం షేర్లలో 20 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు... 25 శాతాన్ని మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలకు కేటాయించనున్నారు.

ఇప్పటివరకూ రిటైలర్లకు ఓఎఫ్‌ఎస్‌లో కోటా 10 శాతం కాగా, ఈ ఇష్యూలో రెట్టింపు చేస్తున్నారు. అంటే ఒక్కో రిటైల్ ఇన్వెస్టర్ గరిష్టంగా రూ.2 లక్షల విలువైన షేర్లను కొనుగోలు చేయొచ్చు. గురువారం మార్కెట్లు ముగిశాక షేర్ల వేలానికి సంబంధించి కనీస ధర(ఫ్లోర్ ప్రైస్)ను ప్రకటించనున్నారు. రిటైర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ప్రైస్‌లో 5 శాతం డిస్కౌంట్ కూడా లభించనుంది. ప్రపంచంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కంపెనీగా నిలుస్తున్న కోల్ ఇండియా... 2010 అక్టోబర్‌లో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్టయింది. ఈ ఇష్యూ ద్వారా 10 శాతం వాటా విక్రయించిన కేంద్రానికి రూ.15,199 కోట్లు లభించాయి.  దేశంలో ఇప్పటిదాకా వచ్చిన అతిపెద్ద ఐపీఓగా కూడా ఇది నిలిచింది.
 
డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యంపై దృష్టి...
ఇండియన్ ఆయిల్(ఐఓసీ), బీహెచ్‌ఈఎల్, నాల్కో, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, ఎన్‌ఎండీసీల్లో కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే వాటాను విక్రయించే అవకాశాలున్నాయి. పీఎస్‌సీ, ఆర్‌ఈసీల్లోనూ 5 శాతం చొప్పున వాటా అమ్మకానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఐసీఓలో 10%, నాల్కో, బీహెచ్‌ఈఎల్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌లలో 5% చొప్పున వాటాలను అమ్మాలనేది ప్రభుత్వ ప్రణాళిక. ఈ ఏడాది(2014-15)లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.43,425 కోట్లను సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.

గతేడాది డిసెంబర్‌లో సెయిల్‌లో 5 శాతం వాటాను అమ్మడం ద్వారా ఇప్పటిదాకా లక్ష్యంలో రూ.1,715 కోట్లు మాత్రమే లభించాయి. ఇంకో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ఎలాగైనా లక్ష్యాన్ని అందుకునేలా కేంద్రం వేగంగా చర్యలు చేపడుతోంది. మరోపక్క, జీడీపీలో ద్రవ్యలోటును 4.1%కి కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని సాధించాలన్నా ఈ డిజిన్వెస్ట్‌మెంట్ నిధుల చాలా కీలకంగా మారాయి. కోల్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారానే లక్ష్యంలో సగం నిధులు సమకూరనుండటం గమనార్హం.
 
వరుసలో ఓఎన్‌జీసీ...
ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే(మార్చిలోగా) మరో పీఎస్‌యూ చమురు అగ్రగామి ఓఎన్‌జీసీలో కూడా వాటా విక్రయించనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం వెల్లడించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పతనం సవాలుగా నిలుస్తున్నప్పటికీ వెనక్కితగ్గబోమని చెప్పారు. కంపెనీలో 5 శాతం వాటాను విక్రయించాలనేది కేంద్రం ప్రణాళిక.

ఒకపక్క క్రూడ్ క్షీణత, మరోపక్క పెట్రో సబ్సిడీ భారం కారణంగా ఇటీవలి కాలంలో ఓఎన్‌జీసీ షేర ధర పడిపోతూ వస్తోంది. గతేడాది జూన్‌లో రూ.472 స్థాయి నుంచి ప్రస్తుతం(బుధవారం బీఎస్‌ఈలో) రూ.354 స్థాయికి దిగజారింది. ప్రస్తుత షేరు ధర ప్రకారం చూస్తే ఈ వాటా అమ్మకం ద్వారా ఖజానాకు రూ.15,000 కోట్లు లభించొచ్చని అంచనా.  కేంద్ర ప్రభుత్వానికి ఓఎన్‌జీసీలో 68.94 శాతం వాటా ఉంది.
 
హెచ్‌ఏఎల్ లిస్టింగ్‌కు సన్నాహాలు...
ప్రభుత్వ రంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్)ను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసేందుకు ప్రయత్నాలు జోరందుకుంటున్నాయి. ఈ మహారత్న కంపెనీ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)కు వీలుగా డెరైక్టర్ల బోర్డును ఏప్రిల్ 1కల్లా పునర్‌వ్యవస్థీకరించనున్నారు. మరోపక్క, కేవలం విమానయాన తయారీ సంస్థగానే కాకుండా ఈ రంగంలోని టెక్నాలజీ విభాగంపై కూడా మరింత దృష్టిసారించనున్నట్లు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న కంపెనీ చైర్మన్ ఆర్‌కే త్యాగి బుధవారమిక్కడ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement