ఓఎన్‌జీసీలో వాటా విక్రయం! | Sale of 5% stake: Government readies ONGC OFS | Sakshi
Sakshi News home page

ఓఎన్‌జీసీలో వాటా విక్రయం!

Published Wed, Aug 29 2018 12:24 AM | Last Updated on Wed, Aug 29 2018 12:24 AM

Sale of 5% stake: Government readies ONGC OFS - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవటంలో (డిజిన్వెస్ట్‌మెంట్‌) భాగంగా చమురు దిగ్గజం ఓఎన్‌జీసీలో 5 శాతం దాకా వాటాను విక్రయించడానికి కేంద్రం ప్రయత్నాలు మొదలెట్టింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో ఈ విక్రయం ఉండనుంది. ఓఎఫ్‌ఎస్‌ వైపు ఇన్వెస్టర్లను ఆకర్షించే క్రమంలో పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్‌) గతవారం అమెరికాలో రోడ్‌షో కూడా నిర్వహించింది.

నిర్దిష్టంగా ఎంత మొత్తం వాటాలు విక్రయిస్తుందన్నదీ వెల్లడికాకపోయినా సుమారు 3–5% మేర డిజిన్వెస్ట్‌మెంట్‌ ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఓఎన్‌జీసీ ప్రస్తుత షేరు ధర ప్రకారం దీని ద్వారా ఖజానాకు దాదాపు రూ. 11,300 కోట్ల దాకా రావొచ్చు. ఓఎన్‌జీసీలో కేంద్రానికి మొత్తం 67.45 శాతం వాటా ఉంది.

గతంలో 5 శాతం విక్రయం...
2011–12 ఆర్థిక సంవత్సరంలో కూడా ఓఎన్‌జీసీలో కేంద్రం దాదాపు 5 శాతం వాటాల విక్రయించి రూ.12,750 కోట్లు సమీకరించింది. అప్పట్లో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఆదుకోవడంతో ఈ విక్రయ ప్రతిపాదన గట్టెక్కింది. ఆ తర్వాత మళ్లీ మరిన్ని వాటాలు విక్రయించడానికి ప్రయత్నించినప్పటికీ.. సబ్సిడీల భారంతో ఓఎన్‌జీసీ షేరుపై ప్రతికూల ప్రభావాల కారణంగా కుదరలేదు.

అయితే, బ్యారెల్‌ క్రూడాయిల్‌ రేటు 70 డాలర్ల పైకి చేరిన పక్షంలో సబ్సిడీ భారాన్ని పంచుకోవాలంటూ ఓఎన్‌జీసీని అడగాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెట్టడం ప్రస్తుతం సంస్థ షేరుకు సానుకూలంగా ఉంటుందనే అంచనాలున్నాయి. దీంతో వాటాల విక్రయం సజావుగా జరగొచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. 2016 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ భారంలో వాటాల విధానాన్ని ఉపసంహరించారు. దీంతో అప్పటిదాకా 60 శాతం దాకా వాటాలు భరిస్తున్న ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాల సబ్సిడీ భారం ఆ సంవత్సరం 10 శాతానికి తగ్గిపోయింది. ఆ తర్వాత పూర్తిగా తొలిగిపోయింది.


ఈసారి డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం రూ. 80వేల కోట్లు..
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం రూ. 80,000 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకుంది. డిజిన్వెస్ట్‌మెంట్‌ మార్గంలో గతేడాది రికార్డు స్థాయిలో రూ. లక్ష కోట్లు సమీకరించింది. ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో కేంద్రానికి ఉన్న 51 శాతం వాటాను ఓఎన్‌జీసీ గతేడాది రూ. 36,915 కోట్లకు కొనుగోలు చేయడం కూడా ఇందుకు దోహదపడింది. అయితే, ఈసారి ఇప్పటిదాకా డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా కేవలం రూ. 9,220 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో సమీకరించిన నిధుల్లో ఇది కేవలం సగమే కావడం గమనార్హం.

దీంతో ఇన్వెస్టర్ల సామర్థ్యానికి అనుగుణంగా.. మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఏర్పడకుండా స్వల్ప స్థాయిల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌ నిర్వహించే వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  ఓఎన్‌జీసీతో పాటు కోల్‌ ఇండియాలో 5 శాతం వాటాలు విక్రయించాలని కూడా కేంద్రం యోచిస్తోంది. కోల్‌ ఇండియా ప్రస్తుత షేరు ధర ప్రకారం మరో రూ. 9,100 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంస్థ ఓఎఫ్‌ఎస్‌ కోసం ఈ ఏడాది జూన్‌లో దీపం విభాగం విదేశాల్లో రోడ్‌షోలు నిర్వహించింది. అటు ఇండియన్‌ ఆయిల్‌ (3%), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (10% దాకా)లో సైతం డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా భారీగాగా నిధులు సమకూర్చుకోవచ్చని కేంద్రం యోచిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement