ఐఓసీలో 10% వాటా విక్రయం
న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్ కంపెనీ ఐవోసీలో ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా తలా 5 శాతం వాటా కొనుగోలు చేశాయి. డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ప్రభుత్వం ఆఫర్ చేసిన 10 శాతం వాటాను (24.27 కోట్ల షేర్లు) షేరుకి రూ.220 ధర చొప్పున టోకున సొంతం చేసుకున్నాయి. దీంతో ప్రభుత్వానికి రూ.5,340 కోట్లు సమకూరాయి. వెరసి ఈ ఆర్థిక సంవత్సరంలో వాటాల విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా ప్రభుత్వం రూ.10,434 కోట్లను సమీకరించినట్లయ్యింది. కాగా, ఐవోసీలో ప్రభుత్వ వాటా 78.92% నుంచి 68.92%కు క్షీణించగా, ఓఎన్‌జీసీ వాటా 8.77% నుంచి 13.77%కు ఎగసింది. ఇక ఆయిల్ ఇండియా తొలిసారి ఐవోసీలో (5%) వాటాను కొనుగోలు చేసింది. బీఎస్‌ఈలో ఐవోసీ షేరు 2% క్షీణించి రూ. 269 వద్ద ముగిసింది.
లక్ష్యాన్ని అందుకుంటాం
ఈ ఆర్థిక సంవత్సరానికి సవరించిన డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ.16,000 కోట్ల సమీకరణను సాధించగలమని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా ఐవోసీలో వాటా విక్రయంతో ఇప్పటికే రూ.10,434 కోట్లను సమీకరించామని డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ కార్యదర్శి అలోక్ టాండన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల (సీపీఎస్‌ఈ) వాటాలతో ఏర్పాటు చేస్తున్న ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్) ద్వారా రూ.3,000 కోట్లను సమీకరిస్తామని, తద్వారా ఈ నెలాఖరుకల్లా లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారాయన. ఇదే బాటలో యాక్సిస్ బ్యాంక్‌లో ప్రభుత్వానికి ఉన్న వాటా విక్రయాన్ని కూడా ఈ నెలలో ముగిస్తామన్నారు. ఎల్‌అండ్‌టీ, ఐటీసీలలోనూ ప్రభుత్వానికి కొంతమేర వాటా ఉంది.
వచ్చే వారమే ఈటీఎఫ్
సీపీఎస్‌ఈల వాటాలతో ఏర్పాటు చేస్తున్న ఈటీఎఫ్‌ను ప్రభుత్వం వచ్చే వారం ప్రవేశపెట్టనుంది. ఓఎన్‌జీసీ, గెయిల్, కోల్ ఇండియా, ఆర్‌ఈసీ, కంటెయినర్ కార్పొరేషన్ తదితర 10 ప్రభుత్వ బ్లూచిప్ కంపెనీలలోని వాటాలతో ఈటీఎఫ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఫండ్‌ను రూ.10 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌చేసే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 18న ఆఫర్ చేస్తారు. రిటైల్ ఇన్వెస్టర్లు, తదితర సంస్థలు 19 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్వెస్టర్లందరికీ 5% తొలి(అప్‌ఫ్రంట్) డిస్కౌంట్ లభిస్తుంది.