కోల్ ఇండియా లాభం రూ.4,238 కోట్లు
కోల్‌కతా: ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా లాభాలు మందగించాయి. గతేడాది జనవరి-మార్చి నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.4,238 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.4,434 కోట్లతో పోలిస్తే లాభం 4.4 శాతం తగ్గింది. అధిక వ్యయాలు లాభాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ తెలిపింది. కాగా, మొత్తం ఆదాయం రూ.20,564 కోట్ల నుంచి రూ.21,340 కోట్లకు పెరిగింది. 3.7% వృద్ధి చెందింది. సంస్థ మొత్తం వ్యయాలు క్యూ4లో రూ.14,850 కోట్ల నుంచి రూ.16,073 కోట్లకు ఎగబాకాయి.
ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.646 కోట్ల నుంచి రూ.9,629 కోట్లకు ఎగసింది. 15 రెట్లు దూసుకెళ్లింది. సబ్సిడరీ కంపెనీల నుంచి డివిడెండ్‌ల రూపంలో భారీగా ఇతర ఆదాయం రావడమే దీనికి ప్రధాన కారణం.
పూర్తి ఏడాదికి చూస్తే...
2014-15 పూర్తి ఏడాదికి కోల్ ఇండియా రూ.13,727 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాదిలో రూ.15,112 కోట్లతో పోలిస్తే లాభం 9.1 శాతం దిగజారింది. మొత్తం ఆదాయం రూ.70,608 కోట్ల నుంచి రూ.74,120 కోట్లకు పెరిగింది. 5 శాతం వృద్ధి చెందింది.
గురువారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర నామమాత్ర లాభంతో రూ.383 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి.