భారీగా తగ్గిన కోల్ ఇండియా లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంపెనీ, కోల్ ఇండియా నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 77 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.2,654 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.600 కోట్లకు తగ్గిందని కోల్ ఇండియా తెలిపింది. అమ్మకాలు తగ్గడం, వ్యయాలు పెరగడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని పేర్కొంది.
ఈ క్యూ2లో నికర అమ్మకాలు 8 శాతం తగ్గి రూ.15,645 కోట్లకు పడిపోయాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.17,490 కోట్ల నుంచి రూ.16,213 కోట్లకు తగ్గగా, మొత్తం వ్యయాలు రూ.14,733 కోట్ల నుంచి రూ.16,162 కోట్లకు పెరిగాయని పేర్కొంది. స్టాండోలోన్ ప్రాతిపదికన గత క్యూ2లో రూ.1,246 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,098 కోట్లకు తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.49 కోట్ల నుంచి రూ.81 కోట్లకు పెరిగిందని పేర్కొంది.