రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలి
ఐఎన్‌టీయూసీ {పధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్
గోదావరిఖని : సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లకుండా ఉండాలంటే విదేశాల నుంచి వచ్చే పెట్‌కోక్ బొగ్గు దిగుమతిని నియంత్రించాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు, కోల్‌ఇండియాకు లేఖ రాయాలని ఐఎన్‌టీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.జనక్‌ప్రసాద్ కోరారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశాల నుంచి టన్నుకు రూ.2,700 ధర పలికే బొగ్గు అధికంగా దిగుమతి అవుతున్నా కేంద్రప్రభుత్వం కానీ, కోల్‌ఇండియా గానీ అడ్డుకోలేకపోతున్నాయని ఆరోపించారు. దీని వల్ల సింగరేణి సంస్థ వ్యాప్తంగా సుమారు 70 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయాయని తెలిపారు. గత నాలుగు నెలలుగా పెట్‌కోక్ బొగ్గును సిమెంట్, ఇతర ప్రైవేటు కంపెనీలు ఎక్కువగా వినియోగిస్తున్నాయని, దీనివల్ల కాలుష్యం కూడా అధికంగానే వస్తోందని, అయినా పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు అధికారులు కానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
బొగ్గు కొనుగోలు చేసిన తెలంగాణ, ఏపీ, మహా జెన్‌కోలు, కర్ణాటక పవర్ కార్పొరేషన్ సంస్థలు సింగరేణికి డబ్బులు ఇవ్వడం లేదని, మరోవైపు విదేశీ బొగ్గుతో సంస్థకు గడ్డు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని అన్నారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీని కోరినట్టు చెప్పారు. నాయకులు బడికెల రాజలింగం, కుమారస్వామి, పి.ధర్మపురి, రవికుమార్, లక్ష్మణ్‌బాబు, వెంకటేశ్వర్లు, శేఖర్, కుమార్, ప్రసన్న, యుగంధర్, పోచం తదితరులు ఉన్నారు.