Coal import
-
పట్టణాల్లో నగర వనాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, పచ్చదనాన్ని అందించేందుకు నగర వనాలను మరింత అభివృద్ధి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశిం చారు. సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం 23 నగర వనాలు, 7 టెంపుల్ ఎకో పార్కులు ఉన్నాయన్నారు. ఈ ఏడాది పలమనేరు, కర్నూలు, పుట్టపర్తి, ప్రొద్దుటూరు, చిత్తూరు, మదనపల్లిలో కొత్త నగర వనాలను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మొత్తం రూ.18.02 కోట్ల వ్యయంతో 220.48 ఎకరాల్లో ఈ నగరవనాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. పులులు పెరుగుతున్నాయి.. రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని.. నల్లమల నుంచి శేషాచలం వరకు పులుల సంచారం ఉందని మంత్రి తెలిపారు. తాజాగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కూడా పులి సంచరిస్తున్నట్లు గుర్తించామన్నారు. అటవీ ప్రాంతా ల్లో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టాలని ఆదేశించారు. యూకలిప్టస్ సాగు చేస్తున్న రైతులకు టన్నుకు రూ.4,050 ధర లభిస్తోందని.. దీన్ని మరింత పెంచేందుకు ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌లను పెంచాలని సూచించారు. అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి విదేశీ బొగ్గు విదేశాల నుంచి 31 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు దిగుమతికి చర్యలు తీసుకున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. దేశంలో అన్ని విద్యు త్ ప్లాంట్లలానే.. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లలో కూడా రెండు, మూడు రోజులకు సరిపడా నిల్వలే ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో విదేశీ బొగ్గు కొనుగోళ్లు చేపట్టడం ద్వారా బొగ్గు నిల్వలను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కృష్ణపట్నం మూడో యూనిట్‌ను సెప్టెంబర్ కల్లా వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ట్రాన్స్‌కో జేఎండీ పృథ్వీతేజ్, డిప్యూ టీ సెక్రటరీ కుమార్‌రెడ్డి, డైరెక్టర్ కె.ముత్తుపాండ్యన్, డిస్కంల సీఎండీలు పాల్గొన్నారు. -
పోర్టులో సున్నపురాయి దిగుమతి
ముత్తుకూరు(సర్వేపల్లి): కృష్ణపట్నంపోర్టులో సున్నపురాయి దిగుమతి జరుగుతున్నట్టు పోర్టు ఉన్నతోద్యోగి ఒకరు మంగళవారం తెలిపారు. పనామాకు చెందిన గ్రేట్–61 అనే నౌక ద్వారా 54,583 టన్నుల సున్నపురాయి దిగుమతి జరుగుతోందన్నారు. అలాగే మనదేశానికి చెందిన జాగ్ రాణి అనే నౌక ద్వారా ఈ నెల 6వ తేదీన 56,000 టన్నుల సున్నపురాయి దిగుమతి జరుగుతుందన్నారు. మరో వైపు డక్కన్ ప్రైడ్ అనే నౌక నుంచి 74,000 టన్నుల బొగ్గు దిగుమతి జరుగుతోంది. ఇదే విధంగా టొమిని డెస్టినీ అనే నౌక నుంచి 63,000 టన్నుల బొగ్గు దిగుమతి జరుగుతోంది. -
విదేశీ బొగ్గు దిగుమతిని నియంత్రించాలి
రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలి ఐఎన్టీయూసీ {పధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్ గోదావరిఖని : సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లకుండా ఉండాలంటే విదేశాల నుంచి వచ్చే పెట్‌కోక్ బొగ్గు దిగుమతిని నియంత్రించాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు, కోల్‌ఇండియాకు లేఖ రాయాలని ఐఎన్టీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.జనక్‌ప్రసాద్ కోరారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశాల నుంచి టన్నుకు రూ.2,700 ధర పలికే బొగ్గు అధికంగా దిగుమతి అవుతున్నా కేంద్రప్రభుత్వం కానీ, కోల్ఇండియా గానీ అడ్డుకోలేకపోతున్నాయని ఆరోపించారు. దీని వల్ల సింగరేణి సంస్థ వ్యాప్తంగా సుమారు 70 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయాయని తెలిపారు. గత నాలుగు నెలలుగా పెట్‌కోక్ బొగ్గును సిమెంట్, ఇతర ప్రైవేటు కంపెనీలు ఎక్కువగా వినియోగిస్తున్నాయని, దీనివల్ల కాలుష్యం కూడా అధికంగానే వస్తోందని, అయినా పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు అధికారులు కానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. బొగ్గు కొనుగోలు చేసిన తెలంగాణ, ఏపీ, మహా జెన్కోలు, కర్ణాటక పవర్ కార్పొరేషన్ సంస్థలు సింగరేణికి డబ్బులు ఇవ్వడం లేదని, మరోవైపు విదేశీ బొగ్గుతో సంస్థకు గడ్డు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని అన్నారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీని కోరినట్టు చెప్పారు. నాయకులు బడికెల రాజలింగం, కుమారస్వామి, పి.ధర్మపురి, రవికుమార్, లక్ష్మణ్‌బాబు, వెంకటేశ్వర్లు, శేఖర్, కుమార్, ప్రసన్న, యుగంధర్, పోచం తదితరులు ఉన్నారు.