‘పూలు అమ్మిన చోట.. కట్టెలు అమ్మడం..’
40 వేల మంది సింగరేణి రిటైర్డ్ కార్మికుల బతుకులు దుర్భరం
కుటుంబ పోషణ గడువక నానా యాతన
నా పేరు గోసిక నర్సయ్య. మాది బెల్లంపల్లిలోని టేకులబస్తీ. బెల్లంపల్లి ఏరియాలోని ఎంవీకే-1 గనిలో కార్మికుడిగా పనిచేసి 2002లో ఉద్యోగ విరమణ చేశాను. సుమారు 30 ఏళ్లు సింగరేణి కార్మికుడిగా పనిచేశాను. జీతం డబ్బులు కుటుంబ పోషణకే సరిపోయేవి. మా కుటుంబంలో నేను, నా భార్య, మనుమరాలు ఉంటాము. కంపెనీలో పని చేసి దిగిపోయిన తర్వాత నాకు నెలకు రూ.1,000 పింఛన్ అస్తంది. ఆ డబ్బు మాకు దేనికీ సరిపోతలేదు.
కూరగాయలు సుత వస్తలేవు. అందుకనే తో పుడు బండి మీద బజార్ ఏరియాల పండ్లు అమ్ము తున్నా. పొద్దంత కష్టపడితే రోజుకు రూ.100 నుంచి రూ.150 సంపాదిస్తున్న. ఆ సంపదనతోనే మాకు టుంబం గడుస్తున్నది. పింఛన్ సరిపోవడం లేదు. తెలంగాణ సర్కారైనా మా మీద దయ చూపి పింఛన్ పెంచాలి..
‘పూలు అమ్మిన చోట.. కట్టెలు అమ్మడం..’ అంటే ఇదేనేమో.. ఒకప్పుడు రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి దేశానికి వెలుగులు పంచిన సింగరేణి రిటైర్డ్ కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయి.. ప్రజలకు వెలుగులు పంచుతూ వారి జీవితాల్లో వెలుగులు నింపుకున్న సింగరేణి కార్మికులు ప్రస్తుతం జీవిత చరమాంకంలో పిడికెడు మెతుకుల కోసం అల్లాడుతున్నారు.. కొందరు భిక్షాటన చేస్తుండటం మరీ దారుణం.. దినసరి కూలీలుగా.. హోటళ్లలో పనివాళ్లుగా.. పండ్లు అమ్ముకుంటూ జానెడు పొట్ట కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు.. వృద్ధాశ్రమాల్లో చేరుతూ వ్యథాభరిత జీవితాలు అనుభవిస్తున్నారు. కొందరు బతుకు మీద విరక్తి చెంది మానసిక క్షోభకు గురవుతూ.. మందులు కొనుక్కునే స్థోమత లేక అనారోగ్యం క్షీణించి బతుక లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. ఇంకొందరు బతుకు మీది ఆశతో తెలంగాణ సర్కారు అయినా ఆదుకోదా అని ఆశగా ఎదురు చూస్తున్నారు..
బెల్లంపల్లి : సింగరేణి రిటైర్డ్ కార్మికులు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత సుఖమయ జీవనం సాగించాల్సిన రిటైర్డ్ కార్మికులు జీవిత చరమాంకంలో అవస్థలు పడుతున్నారు.ఏళ్ల తరబడి రక్తాన్ని చెమటగా మార్చి సింగరేణి పురోభివృద్ధికి దోహదపడిన కార్మికులు ఉద్యోగ విరమణ తర్వాత అందించే అరకొర పింఛన్‌తో చాలీచాలని బతుకులు వెళ్లదీస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పింఛన్ పెంచాలని కోరుతున్నా వీరి మొరను ఎవరు ఆలకించడం లేదు. బొగ్గు గని కార్మికులకు 1998లో పింఛన్ పథకం అమలులోకి వచ్చింది.
పింఛన్ అమలు కోసం 1989లోనే జీవో జారీ అయినప్పటికీ అమలు చేయడానికి మాత్రం తొమ్మిదేళ్ల సమయం పట్టింది. ఉద్యోగ విరమణ అనంతరం కార్మికుడికి 25 శాతం పింఛన్‌ను చెల్లిస్తున్నారు. 1998 నుంచి ఇప్పటి వరకు సింగరేణి కాలరీస్‌లో సుమారు 40 వేల మందికిపైబడి కార్మికులు ఉద్యోగ విరమణ చేశారు. వీరిలో 2009 సంవత్సరం నుంచి దిగిపోయిన కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పింఛన్‌ను వర్తింపజేసిన అంతకుముందు 1998 నుంచి 2008 వరకు రిటైర్డ్ అయిన కార్మికులకు మాత్రం అతిస్వల్పంగా పింఛన్‌ను అందిస్తున్నారు. ఆ పదేళ్ల కాలంలో ఉద్యోగ విరమణ చేసిన కార్మికులు సుమారు 30 వేల మంది వరకు ఉన్నారనేది అంచనా. అంత మంది కార్మికులకు ప్రతి నెల రూ.300 నుంచి రూ.1500 వరకు మాత్రమే పింఛన్ అందుతోంది. ఆ పింఛన్ దేనికి సరిపడక రిటైర్డ్ కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి సతమతమవుతున్నారు.
పెరుగుతున్న ధరలు..
బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు అమాంతం ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ఏ రోజుకు ఆ రోజు సరుకుల ధరలు పెరిగిపోతుండటంతో రిటైర్డ్ కార్మికులు పోటీపడలేక పోతున్నారు. వచ్చే అతి కొద్ది పింఛన్‌తో నెలంతా నెట్టుకురావడం కష్టంగా మారి వీరిలో కొనుగోలు శక్తి రోజు రోజుకు పడిపోతోంది. ప్రతి మూడేళ్లకోసారి ధరల సూచికకు అనుగుణంగా పింఛన్‌ను సవరించాల్సి ఉండగా ఆ దిశగా యత్నాలు జరగడం లేదు. రిటైర్డ్ కార్మికుల పింఛన్‌ను సవరించాలని పాలకులు, కార్మిక సంఘాలు ఏ ఒక్కనాడు కూడా వీరిపక్షాన మాట్లాడటం లేదు.
కోల్ ఇండియా యాజమాన్యంతో చర్చించడం లేదు. ప్రస్తుతం చెల్లిస్తున్న 25 శాతం పింఛన్‌ను 50 శాతానికి పెంచాలని రిటైర్డ్ కార్మికులు కొన్నాళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నా పట్టింపు చేయడం లేదు. కార్మికుల పక్షాన నిత్యం పోరాటాలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకునే కార్మిక సంఘాల నాయకులు వీరి దుస్థితిని పట్టించుకున్న పాపానపోవడం లేదు. గుర్తింపు ఎన్నికల్లో రిటైర్డ్ కార్మికులకు ఓటు హక్కు లేకపోవడంతో కార్మిక సంఘాలు వీరిపై శ్రద్ధ చూపించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రూ.6 వేలు చెల్లించాలి..
పెరుగుతున్న ధరలు దృష్టిలో పెట్టుకుని రిటైర్డ్ కార్మికుల పింఛన్‌ను పెంచాల్సిన అవసరం ఉంది. బియ్యం, కూరగాయలు, ఇతరాత్ర సరుకుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న ధరలకు సమానంగా పింఛన్ పెంచకపోయిన కనీసం నెలకు రూ.6 వేల చొప్పున అందజేయాలని పింఛన్‌దారులు డిమాండ్ చేస్తున్నారు. పాలక ప్రభుత్వాలు ధరల సూచికను దృష్టిలో పెట్టుకొని వృద్ధాప్య, వితంతు పింఛన్లను రూ.200 నుంచి రూ.1,000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
అదే మాదిరి రిటైర్డ్ కార్మికుల పింఛన్‌ను కూడా సవరించి గౌరవ ప్రదంగా జీవించేలా చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. బొగ్గు గనికార్మికుల పింఛన్ పెంపుదల కోసం ఇప్పటికైనా జాతీయ కార్మిక సంఘాలు, కేంద్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, ఎంపీలు ఉమ్మడిగా కృషి చేయాలని కార్మికులు ముక్త కంఠంతో కోరుతున్నారు.