‘పింఛన్’ పాట
ప్రతి ఎన్నికల వేళ నాయకుల మాట
గెలిచాక హామీ హుష్‌కాకి..
తక్కువ పింఛన్‌తో అరిగోస పడుతున్న సింగరేణి కార్మికులు
పింఛన్ 25 శాతం నుంచి 40 శాతం పెంచాలని డిమాండ్
లాభాలు సాధిస్తున్న కార్మికులకు శూన్య హస్తం
హక్కులు సాధించాలంటే పోరాటమే చివరి అస్త్రం
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : ప్రపంచానికి వెలుగునిచ్చేది సూరీడు అయితే.. రాత్రి వెలుగునిచ్చేది నల్లసూరీడు.. నిత్యం బొగ్గు గనుల మధ్య ప్రాణాలతో సహవాసం.. ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో తెలి యదు.. రెక్కలు ముక్కలు చేసుకుని.. ప్రాణాలకు త్యజించి.. కోట్లాది ప్రజలకు వెలుగు నిస్తున్నాడు.. వీరి శ్రమ వెల కట్టలేనిది.. అటువంటి సింగరేణి కార్మికులపై పాలకులు చిన్న చూపు చూస్తున్నారు.
రిటైర్ అయిన తర్వాత మాత్రం వచ్చే పింఛన్‌పై ఆధార పడి అతని కుటుంబం బతకడం కష్టమవుతోంది. ప్రస్తుత ధరలకు అనుగుణంగా పింఛన్ రావడం లేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పింఛన్ ఇవ్వడం లేదు. పదవీ విరమణ పొందిన సింగరేణి కార్మికులకు పదవీ విరమణ చేసిన రోజు నుంచి అతని బేసిక్‌లో 25 శాతం పింఛన్ చెల్లిస్తున్నారు.
సింగరేణిలో పింఛన్ విధానం 1994 నుంచి అమలు అవుతోంది. కార్మికుల హక్కులను కాపాడుతామంటూ కార్మిక సంఘాల నాయకులతోపాటు, కార్మిక సంఘాల మాతృ సంస్థల పార్టీల నాయకులు కూడా ఎన్నికల సమయంలో ప్రగల్భాలు పలుకడం సింగరేణి గనులపై సహజమైంది. పింఛన్ విధానం మారుస్తామంటూ నాయకులు కార్మికల ఓట్లను సొమ్ము చేసుకోవడం ఎన్నికల సమయంలో మామూలై పోయింది. తర్వాత ఈ విషయాన్నే మరచిపోతున్నారు. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మళ్లీ పింఛన్ పాట పాడుతున్నారు.
సింగరేణిలో పింఛన్ విధానం
సింగరేణి సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందిన కార్మికులకు, అధికారులకు తను ఎంత బేసిక్‌తో పదవీ విరమణ పొందితే ఆ బేసిక్‌లో 25 శాతం ప్రతి నెల చెల్లిస్తారు. కార్మికుడి తదనంతరం అతని భార్యకు 12.5 శాతం చెల్లిస్తారు. కార్మికుడి జీవితాంతం తన పింఛన్‌లో ఎలాంటి మార్పులు ఉండవు. పింఛన్ మినహాయిస్తే వైద్య ఖర్చులు, ఇంటి అద్దె, డీఏ అంటూ ఏమీ ఉండవు.
ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్ విధానం
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వారు పదవీ విరమణ పొందిన రోజున ఉన్న బేసిక్‌లో 50 శాతం పింఛన్ చెల్లిస్తారు. ఉద్యోగి మరణిస్తే తన భార్యకు 25 శాతం వస్తుంది. భార్య తదనంతరం వారిపై ఆధారపడ్డ వితంతువు కూతురు, అంగవైకల్యం, మానసిక వికలాంగులైన పిల్లలకు అదే 25 శాతం చెల్లిస్తారు. పదవీ విరమణ పొందిన తరువాతఉద్యోగి మరణిస్తే అతని దహన సంస్కారాలకు ప్రభుత్వం రూ.10 వేలు అందజేస్తుంది.
భార్యాభర్తలు ఇరువురికి మరణించే వరకు వైద్య ఖర్చు లు ప్రభుత్వమే భరిస్తుంది. పనిచేస్తున్న ఉద్యోగులతో సమానంగా పద వీ విరమణ పొందిన వారికి కూడా ప్రతి ఆరు నెలలకోసారి డీఏ పింఛన్‌లో కలుపుతారు. అదేవిధంగా ఐదేళ్లకోసారి కొత్త వేతనాలు మంజూరు అయినపుడు కూడాపదవీ విరమణ పొందిన వారి పింఛన్ కూడా పెరుగుతుంది. వీటితోపాటు ఇంటి అద్దె జీవితాంతం పింఛన్‌తో కలిపి చె ల్లిస్తారు.
కార్మికుల డిమాండ్
సింగరేణిలో కార్మికులకు పింఛన్‌లో మార్పులు తీసుకురావాలంటే కోల్ ఇండియాలో సవరించాలి. వేజ్‌బోర్డు కమిటీ సభ్యులు చర్చలు చేపట్టాలి. సీఎంపీఎఫ్ నుంచి పింఛన్ చెల్లిస్తారు. ప్రస్తుతం కార్మికుల వేతనాల నుంచి 2 శాతం, సింగరేణి సంస్థ ఒక ఇంక్రిమెంటు, ప్రభుత్వం 1.13 శాతం కలుపగా ఏర్పడిన నిధుల నుంచి పింఛన్ చెల్లిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న పింఛన్ విధానాన్ని సవరించి 40 శాతం ఇవ్వాలని కార్మిక సంఘాలు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తిలో నుంచి టన్నుకు రూ.5, కార్మికుల వేతనం నుంచి 3 శాతం, సంస్థ ఇంక్రిమెంటు ఒకటి నుంచి 3 శాతం, ప్రభుత్వం 2 శాతం కలుపుతూ సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అమలు అయితే కార్మికుల బతుకు బండికి ఆసరా పెరుగుతుంది.
పింఛన్ సరిపోత లేదు..
2002 సంవత్సరంలో సింగరేణి సంస్థలో పనిచేసి రిటైర్ అయిన. రూ.1,600 పింఛన్ వస్తంది. సరిపోవడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ధరలకు అనుగుణంగా పింఛన్ పెంచడానికి నాయకులు కృషి చేయాలి. హామీలు ఇచ్చుడే కాదు సాధించి నిరుపించాలి.
- కే.శ్యాంసుందర్,
కేకే-1గని రిటైడ్ కార్మికుడు,మందమర్రి
ప్రభుత్వ ఉద్యోగుల విధానం అమలు చేయాలి
ప్రభుత్వ ఉద్యోగులకు అమలు అవుతున్న పింఛన్ విధానాన్ని సింగరేణిలో కూడా అమలు చేయాలి. ప్రస్తుతం ఉన్న విధానం సరికాదు. ఇంత పెద్దసంస్థలో అంత తక్కవ పింఛన్ విధానం సరి కాదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పింఛన్ పెండానికి నాయకులు కృషి చేయాలి.
- టి.అంజయ్య, కాసిపేట గని,
సపోర్ట్‌మన్, బెల్లంపల్లి