
కోల్‌బెల్ట్ ఏరియాలో గంజాయి కలకలం రేగుతోంది. గంజాయి ప్రభావంతో సింగరేణి ఉద్యోగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా సింగరేణి డివిజన్‌లో గంజాయి కలకలం రేగుతోంది. సింగరేణి ఉద్యోగులు.. ముఖ్యమంగా యువ ఉద్యోగులు గంజాయికి బానిసలవుతున్నారు. తాజాగా ఓ యువ ఉద్యోగి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సింగరేణి ఉద్యోగి అనిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోదావరి నది నుంచి అతని మృతదేహాన్ని అధికారులు వెలికి తీశారు. గంజాయి మత్తువల్లే అనిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న దండేపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా.. కోల్‌బెల్ట్ ఏరియాలో గత కొంతకాలంగా గంజాయి దందా యధేచ్చగా సాగుతోంది. పలు చోట్ల గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. తాజా ఘటన నేపథ్యంలో సింగరేణి ఉద్యోగులకు మాదక ద్రవ్యాల నివారణపై కౌన్సెలింగ్ అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.