సాక్షి, హైదరాబాద్: సర్వీ సులో ఉన్న ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందే అర్హత లేదని ఆర్టీసీ తేల్చి చెప్పింది. ఆయా కేసుల్లో మానిటరీ బెనిఫిట్ కింద కుటుంబ సభ్యులకు నగదు మాత్రమే అందిస్తామని స్పష్టం చేసింది. ఉద్యోగి సర్విసులో ఉండగా సహజ మరణం పొందితేనే కారుణ్య నియామకం (బ్రెడ్ విన్నర్ స్కీం) కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు పేర్కొంది.
ఈ మేరకు 2008లో జారీ చేసిన సర్క్యులర్‌ను ఉటంకిస్తూ కొత్త సర్క్యులర్‌ను జారీ చేసింది. అలాగే స్టాఫ్ బెనెవలెంట్ ట్రస్ట్ (ఎస్‌బీటీ) పథకం కింద చనిపోయిన ఉద్యోగుల కు అందించే ఎక్స్‌గ్రేషియాను సైతం సర్విసులో ఉండగా ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు అందించడం సాధ్యం కాదని ఆ సర్క్యులర్‌లో ఆర్టీసీ పునరుద్ఘాటించింది. ఇవి మినహా ఎస్‌ఆర్‌బీఎస్, ఈడీఎల్‌ఐఎఫ్, ఇతర బెనిఫిట్స్‌ను సెటిల్‌మెంట్ రూపంలో అందించనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తున్న తరుణంలో పాత సర్క్యులర్‌లను కోట్ చేస్తూ ఆర్టీసీ కొత్తగా సర్క్యులర్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
నాడు అనుమతించి...
సాధారణంగా ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో కారుణ్య నియామకానికి వెసులుబాటు ఉంది. ఆర్టీసీలో కూడా అది అమలులో ఉంది. కొన్నేళ్లుగా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగో లేకపోవటంతోపాటు ఖాళీలు లేవన్న సాకుతో కారుణ్య నియామకాలను సంస్థ పెండింగ్‌లో పెట్టింది. కానీ ఆ వెసులుబాటు మాత్రం అమలులోనే ఉంది. 2019లో దీర్ఘకాలం ఆర్టీసీ సమ్మె జరిగిన సమయంలో కొందరు ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి కుటుంబ సభ్యులకు అప్పట్లో కారుణ్య నియామకాలకు సంస్థ అనుమతించింది. కానీ ఇప్పుడు సాధ్యం కాదని స్పష్టం చేస్తూ ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం.
ఎస్‌బీటీ పథకం ఉన్నా...
ఆర్టీసీ ఉద్యోగులు ఎస్‌బీటీ పథకం కింద ప్రతినెలా వేతనంలో రూ.100 చొప్పున ఆ పథకం ట్రస్టుకు జమ చేస్తారు. ట్రస్టును ఆర్టీసీనే నిర్వహిస్తుంది. ఉద్యోగులు పదవీ విరమణ పొందినప్పుడు వారు నెలనెలా చెల్లిస్తూ పోగు చేసిన మొత్తాన్ని వడ్డీతో కలిపి సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ఉద్యోగి సర్వీసు పూర్తి కాకుండానే మరణిస్తే ఆ మొత్తంతోపాటు రూ. లక్షన్నర ఎక్స్‌గ్రేషియా కూడా చెల్లిస్తుంది. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడం సాధ్యం కాదని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఇందుకు 1983లో జారీ చేసిన సర్క్యులర్‌ను కోట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment