విలీనం లేదు.. వేతన సవరణ 'ఊసే లేదు'! | Telangana Govt not focusing on RTC pending issues | Sakshi
Sakshi News home page

విలీనం లేదు.. వేతన సవరణ 'ఊసే లేదు'!

Published Mon, Feb 19 2024 4:12 AM | Last Updated on Mon, Feb 19 2024 2:55 PM

Telangana Govt not focusing on RTC pending issues - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఇటు ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనంపై స్పష్టత లేదు.. అటు బకాయి ఉన్న రెండు వేతన సవరణల జాడ లేదు’ఆర్టీసీకి సంబంధించి ఈ కీలక అంశాలకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. బడ్జెట్‌లో ప్రతిపాదించటం ద్వారా శుభవార్త అందుతుందని ఎదురు చూసిన ఆర్టీసీ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వెంటనే నెక్లెస్‌ రోడ్డు సమీపంలో వంద ఆర్టీసీ కొత్త బస్సులను స్వయంగా ప్రారంభించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి రావడంతో ఆ కార్యక్రమంపై కూడా ఆర్టీసీ ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు.

అయితే ఈ సందర్భంగా కూడా కేవలం 2013 వేతన సవరణకు సంబంధించి బకాయి ఉన్న బాండ్ల మొత్తం విడుదల ప్రకటన తప్ప ప్రధాన అంశాలను కనీసం మాట వరసకు కూడా ప్రస్తావించకపోవటంతో ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటినా ఆర్టీసీ పెండింగు అంశాలపై ఎలాంటి నిర్ణయం వెలువడకపోవటంతో.. అసలు తమ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పంథా ఏంటో అర్ధం కాక అయోమయంలో పడిపోయారు. 

‘మహాలక్ష్మి’ పథకాన్ని సక్సెస్‌ చేసినా.. పట్టించుకోరా? 
ప్రభుత్వం కొలువు దీరిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటును ఆర్టీసీ ఆరంభించింది. గత డిసెంబరు 9న ఒక్క కొత్త బస్సు లేకుండా, ఉన్న సిబ్బందితోనే ఈ పథకాన్ని ప్రారంభించారు. అంతకు ముందు సగటున రోజుకి 28 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు. ఈ పథకం మొదలయ్యాక అది 45 లక్షలకు చేరింది. కొన్ని ప్రత్యేక రోజుల్లో ఆ సంఖ్య 52 లక్షలకు చేరినట్టు అధికారులు చెబుతున్నారు. 30 శాతం డొక్కుగా ఉన్న బస్సుల్లో ఓవర్‌లోడ్‌ వల్ల ఎక్కడ ఎప్పుడు ఏ బస్సు అదుపు తప్పుతుందోనని ఆర్టీసీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

కానీ, నిత్యం అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, సిబ్బందికి జాగ్రత్తలు సూచిస్తుండటంతో ఎక్కడా ప్రమాదాలు చోటుచేసుకోకుండా పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. బస్సులు కిక్కిరిసి ఘర్షణలు జరుగుతున్న పరిస్థితి ఉన్నా ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఒక్క కొత్త బస్సు కూడా సమకూర్చకుండానే తమతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించినా తాము విజయవంతంగా అమలు చేస్తున్నామని, కానీ తమకు అందాల్సిన ఆర్థిక లబ్ధి విషయంలో ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించటం ఏంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. 

గత బీఆర్‌ఎస్‌ సర్కారు జీఓ ఇచ్చినా.. 
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. కానీ, విధివిధానాలకు కమిటీ ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంది. విధివిధానాలు ఖరారయ్యేలోపే ఎన్నికల కోడ్‌ రావటంతో ఆ విషయం మరుగున పడింది. విధివిధానాలు వచ్చేలోపు తమ జీతాలను ట్రెజరీ ద్వారా చెల్లించేలా ఆదేశించాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరినా అది నెరవేరలేదు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటంతో వెంటనే ఆ ప్రక్రియ కొనసాగుతుందని ఆర్టీసీ ఉద్యోగులు ఆశించారు. కానీ, రెండు నెలలైనా దాని జాడలేదు. 

అన్నీ వదిలేసి తక్కువ మొత్తం విడుదల చేసి 2017, 2021 సంవత్సరాల్లో వేతన సవరణలు జరగాల్సి ఉంది. కానీ అవి నాటి నుంచి పెండింగులోనే ఉన్నాయి. ఇక 2013లో జరిగిన వేతన సవరణకు సంబంధించి బాండ్ల రూపంలో చెల్లించాల్సిన రూ.281 కోట్ల మొత్తం కూడా పెండింగ్‌లోనే ఉంటూ వచ్చింది. ఇవి కాకుండా, ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడే ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్‌)కు సంబంధించి దాదాపు రూ.1100 కోట్లు, పీఎఫ్‌కు సంబంధించి రూ.1400 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. వీటన్నింటినీ పెండింగులో ఉంచి కేవలం తక్కువ మొత్తం ఉన్న బాండ్ల నిధులను మాత్రమే విడుదల చేస్తున్నట్టు కొత్త ప్రభుత్వం ప్రకటించింది. 

ఈ ప్రభుత్వం కూడా అంతేనా? 
శాసనసభ ఎన్నికలకు ముందు, ప్రధాన కార్మిక సంఘాల నేతలు.. వారివారి సొంత సంఘాలు వదిలేసి కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మద్దతు తెలిపారు. బడ్జెట్‌ ముందు వరకు కూడా కాంగ్రెస్‌ పార్టీ తీరును ప్రశంసిస్తూ పోస్టులు వైరల్‌ చేశారు. కానీ, బడ్జెట్‌ తర్వాత ఒక్కసారిగా వారిపై కార్మికుల నుంచి ఒత్తిడి పెరగటంతో తాజాగా కార్మిక నేతలు ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వం తీరు కంటితుడుపు చర్యగా కూడా లేదని, కార్మికుల ఓపిక నశించకముందే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని అశ్వత్థామరెడ్డి హెచ్చరించారు.

ప్రభుత్వ తీరు నిరుత్సాహానికి గురిచేసిందని, అప్రజాస్వామిక, నియంత పాలనను ఈ ప్రభుత్వం కూడా కొనసాగించనుందా అంటూ రాజిరెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే తమ ధ్యేయమని చెప్తున్న ఈ ప్రభుత్వం చేతల్లో చూపటం లేదని వీఎస్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. వేతన సవరణ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న కార్మికులను ప్రభుత్వం తీవ్రంగా నిరాశపరిచిందని సీనియర్‌ కార్మిక నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement