సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) స్థానంలో ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ అందించేలా ప్రభుత్వం ప్రతిపాదించిన గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)పై ప్రభుత్వ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)తో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో జీపీఎస్‌లోనూ అలాంటివే ఉన్నాయని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఓపీఎస్‌లో ఉన్న మెజారిటీ అంశాలను జీపీఎస్‌లో కొనసాగించడంపై వారిలో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.
ఈ మేరకు వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగుల మధ్య ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఓపీఎస్, జీపీఎస్, సీపీఎస్ మధ్య లాభనష్టాలను పోలుస్తూ ఒక పట్టికను వారు విస్తతంగా షేర్ చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్‌లో కేవలం రెండు అంశాల్లో మినహా.. యథాతథంగా ఓపీఎస్ వల్ల కలిగే లాభాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగి పెన్షన్ విషయంలో 13 కీలకాంశాల్లో ఏకంగా తొమ్మిదింటిని ప్రభుత్వం జీపీఎస్‌లో చేర్చడం పట్ల వారిలో సానుకూలత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఓపీఎస్‌లో మాదిరిగానే పెన్షన్‌కు భద్రత కల్పించడం, జీవిత భాగస్వామికి సైతం పెన్షన్ వర్తిస్తుండటంపై జీపీఎస్ మంచిదని అభిప్రాయపడుతున్నారు.
సీపీఎస్‌లో అనిశ్చితి కంటే ఇదే మేలు..
సీపీఎస్‌లో ఉద్యోగ విరమణ తర్వాత కార్పస్‌లో 60 శాతాన్ని ఉద్యోగి తీసుకుని.. 40 శాతం సొమ్ము యాన్యుటీ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంది. ఇదంతా మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. పూర్తి అనిశ్చితి ఏర్పతే.. రావాల్సిన పెన్షన్‌కూ గ్యారెంటీ ఉండదు. బేసిక్ శాలరీలో 20.3 శాతమే పెన్షన్‌గా వచ్చే అవకాశం ఉండగా.. ఇది కూడా వడ్డీరేట్లపై ఆధారపడే వస్తుండటంతో భద్రత కూడా కష్టమే. జీపీఎస్‌లోనూ సీపీఎస్‌లో చెల్లించినట్టే ఉద్యోగి 10 శాతం పెన్షన్ వాటాగా ఇస్తే.. ప్రభుత్వం కూడా అంతే కడుతుంది.
ఉద్యోగ విరమణ సమయంలో చివరి జీతంలో బేసిక్‌లో 50 శాతం పెన్షన్‌గా అందుతుంది. ఇక్కడ సీపీఎస్‌తో పోలిస్తే పెన్షన్ 150 శాతం అధికంగా ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏడాదికి డీఏ/డీఆర్‌లు ఇస్తుంది. ఒక రిటైర్ అయిన వ్యక్తి చివరి నెల బేసిక్ జీతం రూ.లక్ష ఉంటే.. అందులో ఏకంగా రూ.50 వేలు పెన్షన్‌గా వస్తుంది. డీఆర్‌లతో కలుపుకుని ఇది ఏటా పెరుగుతుంది. 62 ఏళ్లకు రిటైర్ అయ్యే వ్యక్తి మరో ఇరవై ఏళ్ల తర్వాత అంటే.. అంటే 82 ఏళ్లకు జీపీఎస్ ద్వారా నెలకు రూ.1,10,000 పెన్షన్ తీసుకుంటారు.
వాట్సాప్ గ్రూపుల్లో ఈ లెక్కలన్నీ వేసుకుంటూ జీపీఎస్‌పై ఉద్యోగులు సుదీర్ఘ చర్చలు సాగిస్తున్నారు. 2070 నాటికి జీపీఎస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బు క్రమంగా పెరుగుతూ అప్పటికి రూ.1,33,506 కోట్లకు చేరుకుంటుంది. ఇందులో రూ.1,19,520 కోట్లు ప్రభుత్వం బడ్జెట్ నుంచి భరించాల్సి వస్తుంది. ఒకవేళ ఉద్యోగులకు జీపీఎస్ నచ్చకుంటే సీపీఎస్‌లో కొనసాగే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
మళ్లీ రద్దు చేస్తే ఎలా..
ఓపీఎస్ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుపై పెను ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతోనే ప్రభుత్వం జీపీఎస్‌ను తీసుకొచ్చింది. ఓపీఎస్ ఇవ్వాల్సి వస్తే ప్రభుత్వం చెబుతున్నట్టు అప్పటికి ఇవ్వాల్సిన పెన్షన్ల మొత్తం.. ఉద్యోగుల జీతాలను కూడా దాటేసి మోయలేని స్థాయికి చేరుకుంటుంది. 2041 నాటికి రాష్ట్ర బడ్జెట్లో ఏకంగా రూ.65,234 కోట్లు పెన్షన్ల కోసమే చెల్లించాల్సి వస్తుంది.
రుణాలపై చెల్లింపులతో కలుపుకుని రాష్ట్ర సొంత ఆదాయంలో 220 శాతానికి చేరుకుంటుంది. 2070 నాటికి ఈ చెల్లింపులు సుమారు రూ.3,73,000 కోట్లు అవుతాయి. ఏదోక దశలో ఈ మోయలేని భారాన్ని తట్టుకోలేక 2003 మాదిరిగానే మళ్లీ ఓపీఎస్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తే మళ్లీ కథ మొదటికి వస్తుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓపీఎస్‌కు దగ్గరగా మెరుగైన పెన్షన్ భరోసా జీపీఎస్‌తో లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
ఆ రెండింటిపై కూడా అనుకూలంగా ఉంటే..
ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడంలో ప్రభుత్వం జీపీఎస్ ద్వారా పూర్తి గ్యారెంటీ ఇస్తుండటంపై ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. జీపీఎస్‌లో ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్‌కు పీఆర్సీ వర్తింపు ఉండదు. పెన్షన్ కాంట్రిబ్యూషన్ చెల్లించాలి. ఈ రెండు మినహా ఓపీఎస్‌లోని అంశాలన్నీ జీపీఎస్‌లోనూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ గ్రూపుల్లో చర్చల ద్వారా ఉద్యోగులు ఒకరికొకరు తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు.
ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్), అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ విషయంలో కూడా సందిగ్ధతను తొలగించి వాటిని కూడా ఇచ్చేస్తే మొత్తం 11 అంశాలతో జీపీఎస్ మరింత సంపూర్ణంగా ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందోనని వారిలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment