పెన్షన్‌ ఇచ్చే యాన్యుటీ ప్లాన్స్‌  | Annuity Plans Which Gives Pension After Retirement | Sakshi
Sakshi News home page

పెన్షన్‌ ఇచ్చే యాన్యుటీ ప్లాన్స్‌ 

Published Mon, May 2 2022 12:00 AM | Last Updated on Mon, May 2 2022 12:01 AM

Annuity Plans Which Gives Pension After Retirement - Sakshi

రిటైర్మెంట్‌ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారికి ఉన్న మార్గాల్లో బీమా సంస్థలు అందిస్తున్న యాన్యుటీ ప్లాన్‌లు కూడా ఒకటి. పెట్టిన పెట్టుబడిపై నిర్ణీ త రేటుకు అనుగుణంగా ఏటా ఆదాయాన్ని అందుకోవడమే ఈ ప్లాన్లలో ఉన్న సౌలభ్యం. రిస్క్‌ లేని రాబడులు కోరుకునే వారికి ఉన్న ఆప్షన్లు కొన్నే. యాన్యుటీలు కూడా ఈ విభాగంలోకే వస్తాయి. ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టి తర్వాతి సంవత్సరం నుంచి ఆదాయం కోరుకునే వారికి ఇమీడియట్‌ యాన్యుటీ ప్లాన్లు. నిర్ణీత కాలం పాటు పెట్టుబడి సమకూర్చుకుని, ఆ తర్వాత నుంచి ఆదాయం కోరుకునే వారికి డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్లు. రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్న వారికి ఇమీడియట్‌ యాన్యుటీ, రిటైర్మెంట్‌కు కొన్నేళ్ల వ్యవధి ఉన్న వారికి డిఫర్డ్‌ యాన్యుటీ అనుకూలం. ఇన్వెస్టర్లు తమ వయసు, అవసరాల ఆధారంగా వీటిల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో రాబడులు మోస్తరుగానే ఉంటాయన్నది మర్చిపోకూడదు.     

రిటర్న్‌ ఆఫ్‌ పర్చేజ్‌ ప్రైస్‌ 
ఇమీడియట్‌ యాన్యుటీ ప్లాన్లలో ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే.. పాలసీదారు జీవించి ఉన్నంత కాలం చెల్లింపులు చేస్తారు. వారి మరణానంతరం పర్చేజ్‌ ప్రైస్‌ను నామినీలకు/వారసులకు చెల్లిస్తారు. తమ వారికి కొంత వదిలి వెళ్లాలనుకునే వారికి ఈ ఆప్షన్‌ అనుకూలిస్తుంది. కాకపోతే ఈ ఆప్షన్‌లో చెల్లింపులు ఇతర ఆప్షన్లతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ గ్యారంటీడ్‌ పెన్షన్‌ ప్లాన్‌లో 50 ఏళ్ల వ్యక్తి ఆర్‌వోపీ (రిటర్న్‌ ఆన్‌ పర్చేజ్‌ ప్రైస్‌) ఆప్షన్‌ లేకుండా ఎంపిక చేసుకుంటే రూ.10 లక్షలపై ఏటా రూ.67,741 మొత్తం వస్తుంది. ఆర్‌వోపీ ఎంపిక చేసుకుంటే వార్షిక ఆదాయం రూ.60,235కు తగ్గిపోతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ద్రవ్యోల్బణం ప్రభావం కారణంగా పర్చేజ్‌ ప్రైస్‌ రూ.10లక్షల విలువ కొంత కాలానికి తగ్గిపోతుంది. కనుక నామినీకి అదేమంత పెద్ద మొత్తం కాబోదు...  

ఇక వీటిల్లోనూ కొన్ని ఉప రకాలున్నాయి. రిటర్న్‌ ఆఫ్‌ బ్యాలన్స్‌ పర్చేజ్‌ ప్రైస్‌ అందులో ఒకటి. ఈ ఆప్షన్‌లో యాన్యుటీ ప్లాన్‌ తీసుకున్న వ్యక్తికి ఏటా నిర్ధేశిత మొత్తం చెల్లింపులు కొనసాగుతాయి. మరణానంతరం మిగిలి ఉన్న పర్చేజ్‌ ప్రైస్‌ వరకే నామినీకి అందుతుంది. ఈ విభాగంలో పాలసీదారు, వారసులకూ ఎంతో కొంత అందుతుంది. ఒకవేళ అప్పటి వరకు చేసిన యాన్యుటీ మొత్తం పర్చేజింగ్‌ ప్రైస్‌ను మించిపోతే మరణానంతరం నామినీకి ఎటువంటి చెల్లింపులు రావు. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ (తీవ్ర అనారోగ్య సమస్యలు) బారిన పడితే, ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యం బారిన పడినా ఆర్‌వోపీని చెల్లించే యాన్యుటీ ప్లాన్లు ఉన్నాయి.   

పెరిగే యాన్యుటీ 
స్థిర యాన్యుటీ (ఏటా ఒకే మొత్తం చెల్లింపులు చేసేది) కాకుండా.. ఏటా పెరుగుతూ వెళ్లే యాన్యూటీ ప్లాన్లను కూడా బీమా సంస్థలు అందిస్తున్నాయి. ఏటా 35 శాతం చొప్పున పెరిగే యాన్యూటీ కూడా ఉంది. జీవన్‌ అక్షయ్‌ 7 ప్లాన్‌లో ఏటా 3 శాతం పెరిగే ఆప్షన్‌ ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ అయితే ఏటా 5 శాతం చొప్పున చెల్లింపులు పెరిగే ఆప్షన్‌ అందిస్తోంది. ఎస్‌బీఐ లైఫ్‌ యాన్యుటీ ప్లస్‌ ప్లాన్‌ ఏటా 3–5 శాతం మేర పెంచుకునే ఆప్షన్‌ ఇస్తోంది. 60 ఏళ్ల వ్యక్తి రూ.10లక్షలను ఎస్‌బీఐ లైఫ్‌లో యాన్యుటీ ప్లస్‌ కింద ఇన్వెస్ట్‌ చేస్తే మొదటి ఏడాది అనంతరం రూ.63,842 ఆదాయం వస్తుంది. ఆ తర్వాత నుంచి ఈ మొత్తం ఏటా 3 శాతం చొప్పున పెరుగుతుంది. అదే 5 శాతం పెరిగే ఆప్షన్‌లో మొదటి ఏడాది అనంతరం రూ.56,390 వస్తుంటే.. ఇది ఏటా 5 శాతం పెరుగుతుంది. లైఫ్‌టైమ్‌ ఇన్‌కమ్‌ ఆప్షన్‌(ఆర్‌వోపీ లేకుండా)లో ఏటా వచ్చే రూ.79,864తో పోలిస్తే, తక్కువగా వస్తుందని అర్థం చేసుకోవాలి. యాన్యుటీ పెరుగుతూ వెళ్లే ఆప్షన్‌ అన్నది ద్రవ్యోల్బణం నుంచి నిధికి రక్షణ కల్పించుకోవడానికే. కానీ, ఆరంభంలో తక్కువ మొత్తాన్ని ఖరారు చేసి, దాన్ని ఏటా పెంచుతూ వెళ్లడం ఆకర్షణీయం కాబోదు. పైగా ద్రవ్యోల్బణం సగటున 6 శాతంగా ఉన్నప్పుడు ఏటా 3 శాతం పెరుగుదల ఏ మాత్రం సరిపోదు. యాన్యుటీ ప్లాన్లు సైతం మోస్తరు రాబడినే ఇస్తాయి. పైగా ఈ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందన్న విషయం గమనార్హం. 

పన్ను పరిధి ఇలా..
సెక్షన్‌ 80సీసీసీ కింద యాన్యూటీ ప్లాన్లలో ఏటా రూ.1.5 లక్షల పెట్టుబడిపై పన్ను లేదు. రిటైర్మెంట్‌ సమయంలో సమకూర్చుకున్న నిధి నుంచి 25–33% వరకు వెనక్కి తీసుకున్నా ప న్నులేదు. కాకపోతే ఈ ప్లాన్ల నుంచి క్రమం తప్పకుండా వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుం ది. 60 ఏళ్లు నిండి, ఈ ప్లాన్ల నుంచి వచ్చే ఆదాయం కనీస ఆదాయ పరిమితి లోపే ఉంటే పన్నులేదు. పన్ను పరిధిలోకి వస్తే తముకు వర్తిం చే శ్లాబు రేటు ప్రకారం చెల్లించాల్సి వస్తుంది.  

డిఫర్డ్‌ యాన్యుటీ  
డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్లు అన్నవి నిర్ణీత కాలం పెట్టుబడుల తర్వాత నుంచి వార్షికంగా చెల్లింపులు చేసేవి. ఇందులో నిధి సమకూర్చుకునే కాలం ఉం టుంది.  అది ఎంత కాలం అన్నది ఇన్వెస్టర్ల వెసు లుబాటును బట్టి ఎంపిక చేసుకోవచ్చు. ఉద్యోగం చేస్తున్న వారు డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్‌ను ఎంపిక చేసుకుని, రిటైర్మెంట్‌ వయసు వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. రిటైర్మెంట్‌ తర్వాత అప్పటికి సమ కూరిన మొత్తంపై యాన్యుటీ రూపంలో ఆదా యం లభిస్తుంది. సరైన ఉత్పత్తిని ఎంపిక చేసుకోవడంపైనే రాబడి రేటు ఆధారపడి ఉంటుంది. డిఫర్డ్‌యాన్యుటీల్లో లంప్‌సమ్‌ లేదా రెగ్యులర్‌గా ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లొచ్చు. బీమా సంస్థలు ఈ పెట్టుబడిని ఇన్వెస్టర్‌ తరఫున తీసుకెళ్లి డెట్‌ సాధనాల్లో పెట్టుబడిగా పెడతాయి. రిటైర్మెంట్‌ తర్వాత అప్పటి వరకు సమకూర్చుకున్న మొత్తా న్ని వెనక్కి తీసుకోవచ్చు. లేదంటే ఆ మొ త్తంపై నెలవారీ/వార్షికంగా ఆదాయం అందుకోవచ్చు. 

ఇంటర్నల్‌ రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌ (ఐఆర్‌ఆర్‌): డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్‌ను ఎంపిక చేసుకునే ముందు వాటి సాధారణ రాబడులు కాకుండా.. ఐఆర్‌ఆర్‌ను చూడాలి. అప్పుడే పెట్టుబడి లాభదాయకమా? అన్నది తెలుస్తుంది. సాధారణంగా ఇది ఉత్పత్తులను బట్టి 5–7 శాతం మధ్య ఉంటుంది. ఎక్కువ రేటు ఉన్న ఉత్పత్తిని ఎంపిక చేసుకోవాలి. 
ద్రవ్యోల్బణం: ఇక్కడ ద్రవ్యోల్బణమే పెద్ద శత్రువు. నేడు 35 ఏళ్ల వ్యక్తి నెలవారీ ఖర్చులు రూ.60,000 ఉన్నాయనుకోండి. 60 ఏళ్లకు రిటైర్‌ అవుతాడని అనుకుంటే.. 6 శాతం వార్షిక ద్రవ్యోల్బణం ఆధారంగా అప్పుడు మొదటి నెల ఖర్చులకే రూ.2.57 లక్షలు కావాలి. అందుకే డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్లలో ఇన్వెస్ట్‌ చేసుకునే వారు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని, అందుకు తగ్గ ప్రణాళికలు వేసుకోవాలి.   


జీవించి ఉన్నంత కాలం ఆదాయం కోరుకుంటే ఇమీడియట్‌ యాన్యుటీ పాలసీ పరిశీలించొచ్చు. ఇందులో ఏకమొత్తంలో ఇన్వెస్ట్‌ చేయాలి. దానిపై బీమా సంస్థ నిర్ణీత రేటు ప్రకారం నెలవారీ లేదంటే ఏడాదికోసారి చొప్పున చెల్లింపులు చేస్తుంది. ఈ ఉత్పత్తుల్లోనూ బీమా సంస్థలు భిన్నమైన వ్యత్యాసాలు చూపిస్తున్నాయి. ఇమీడియట్‌ యాన్యుటీ ప్లాన్లలో నచ్చిన ఆప్షన్‌ ఎంచుకుంటే, ఆ తర్వాత మార్చుకునేందుకు అవకాశం ఉండదు. అందుకని ముందే అందుబాటు         లో ని వివిధ యాన్యుటీ రకాలను అర్థం చేసుకునే ప్ర యత్నం చేయాలి. తర్వాతే తమకు అనుకూలమైన ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం సాధ్యపడుతుంది. 

లైఫ్‌ యాన్యుటీ, గ్యారంటీడ్‌ పీరియడ్‌ 
ఈ ఆప్షన్‌లో చెల్లింపులు అన్నవి కాలవ్యవధి వరకు ఒకే రేటు ఆధారంగా కొనసాగుతాయి. అంటే పాలసీదారు జీవించి ఉన్నంత కాలం ఒకే మొత్తాన్ని నెలవారీ లేదంటే ఏటా అందుకుంటారు. పాలసీదారు మరణానంతరం ఎటువంటి చెల్లింపులు ఉండవు. పాలసీ రద్దయిపోతుంది. ఆ తర్వాత వారసులకు చెల్లించేదేమీ ఉండదు. కొనుగోలు చేసిన ఏడాది తర్వాత నుంచి చెల్లింపులు ప్రారంభమవుతాయి. ఉదాహరణకు 50 ఏళ్ల వ్యక్తి ఎల్‌ఐసీ జీవన్‌ అక్షయ్‌ 7 ప్లాన్‌ను రూ.10లక్షలతో కొనుగోలు చేశాడని అనుకుంటే అప్పుడు ఏటా రూ.71,550 ఆదాయంగా లభిస్తుంది. 7.15 శాతం రేటు ఆధారంగా జీవించి ఉన్నంత కాలం ఏటా ఈ మేరకు చెల్లింపులు సాగుతాయి. 60 ఏళ్ల వ్యక్తికి ఇంతే మొత్తంపై 8.32 శాతం చొప్పున రూ.83,250 ఆదాయం ఏటా లభిస్తుంది. లైఫ్‌ యాన్యుటీ/ఇన్‌కమ్‌ ఆప్షన్‌ అన్నది ఇతర ఆప్షన్లతో పోలిస్తే మెరుగైన రాబడిని ఇస్తుంది. కాకపోతే ఈ ఆప్షన్‌లో నామినీ లేదా వారసులకు వచ్చేదేమీ ఉండదు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్,  ఎస్‌బీఐ లైఫ్‌ బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ తదితర ప్రముఖ సంస్థలు అన్నీ లైఫ్‌ యాన్యుటీ ప్లాన్‌లను ఆఫర్‌ చేస్తున్నాయి. 

 లైఫ్‌ యాన్యుటీలోనే గ్యారంటీడ్‌ పీరియడ్‌ ఆప్షన్‌తో వచ్చేవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు 20 ఏళ్ల కాలానికి యాన్యుటీ ఆప్షన్‌ ఎంపిక చేసుకున్నారనుకుంటే.. పాలసీదారు ఆలోపు మరణించినా.. కాలవ్యవధి ముగిసే వరకు నామినీకి చెల్లింపులు లభిస్తాయి. గ్యారంటీడ్‌ పీరియడ్‌ తర్వాత పాలసీదారు మరణించినట్టయితే ఎటువంటి చెల్లింపులు ఉండవు. జీవన్‌ అక్షయ్‌ 7 ప్లాన్‌లో గ్యారంటీడ్‌ పీరియడ్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే.. 50 ఏళ్ల వ్యక్తి రూ.71,350 నుంచి రూ.69,250 మధ్య ఆదాయం లభిస్తుంది. 5–20 ఏళ్ల మధ్య కాలంలో ఇది పెరుగుతూ వెళుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement